Updated : 01 Apr 2022 05:13 IST

Telangana News: రోగిపై ఎలుకల దండయాత్ర

వరంగల్‌ ఎంజీఎం అత్యవసర విభాగంలో దారుణం
కాలి పైనా, చేతి పైనా ఎడాపెడా కొరికిన మూషికాలు
రక్తస్రావమైనా గుర్తించని సిబ్బంది
తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం.. సూపరింటెండెంట్‌ తొలగింపు..
ఇద్దరు వైద్యుల సస్పెన్షన్‌

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. అత్యవసర విభాగంలోని ఆర్‌ఐసీయూ వార్డులో గురువారం తెల్లవారుజామున రోగిపై ఎలుకలు దాడి చేసి కాలును, చేతిని కొరికేశాయి. స్పృహలో లేకపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆయన సోదరుడు అప్రమత్తం చేయడంతో వైద్యులు కట్టుకట్టి చికిత్స అందించారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతో పాటు ఇద్దరు వైద్యులను సస్పెన్షన్‌ వేటు వేసి విచారణకు ఆదేశించింది. ఈ మేరకు వైద్యమంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. రోగి సోదరుడు శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన కాడర్ల శ్రీనివాస్‌ (38) కొంతకాలంగా ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో శనివారం ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆర్‌ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చేరినరోజే శ్రీనివాస్‌ కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. వెంటనే కుటుంబ సభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా కట్టుకట్టి వదిలేశారే తప్ప ఎలుకల కట్టడికి చర్యలు తీసుకోలేదు. గురువారం తెల్లవారుజామున రోగికి సహాయంగా వచ్చిన ఆయన సోదరుడు శ్రీకాంత్‌ నిద్రపోయిన సమయంలో శ్రీనివాస్‌ ఎడమ చేతితో పాటు ఎడమకాలి మడమ వద్ద ఎలుకలు కొరికేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. శ్రీకాంత్‌ నిద్రలేచి చూసే వరకు వైద్యసిబ్బంది ఎవరూ గుర్తించలేదు. రోగి శ్రీనివాస్‌ స్పృహలో లేకపోవడంతో ఎలుకల దాడిని గుర్తించలేకపోయారు. రక్తస్రావమైన విషయం తెలిసి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో వైద్యులు వచ్చి చికిత్స అందించారు. ఈ ఘటనపై ఎంజీఎం ఆసుపత్రి ఆర్‌ఎంవో-2 డాక్టర్‌ మురళికి ‘న్యూస్‌టుడే’ సమాచారం అందించగా ఆయన వచ్చి పరిశీలించి, ఎలుకల నివారణకు చర్యలు చేపట్టారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం

ఎంజీఎం ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కొరికిన సంఘటనపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యమంత్రి హరీశ్‌రావు వెంటనే దీనిపై విచారణకు ఉత్తర్వులు జారీచేశారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. దీంతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావును ఆ విధుల నుంచి తప్పించి గతంలో పనిచేసిన డాక్టర్‌ చంద్రశేఖర్‌కు తిరిగి బాధ్యతలు అప్పగించింది. ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తించిన వైద్యులు యాకూబ్‌ నాయక్‌, మహమద్‌ అబీదిలను సస్పెండ్‌ చేసింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని