Telugu News: వరంగల్‌ ఎంజీఎంలో ఎలుకల దాడి ఘటనలో గాయపడిన రోగి మృతి

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలు దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కాడర్ల శ్రీనివాస్‌(38) గుండె వైఫల్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం. హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన ఆయన కొన్నాళ్లుగా

Updated : 02 Apr 2022 10:13 IST

 గుండె వైఫల్యంతో చనిపోయినట్లు సమాచారం
ఏజిఎల్‌ ఏజెన్సీని నిషేధిత జాబితాలో చేరుస్తాం: మంత్రి ఎర్రబెల్లి

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే, ఈనాడు, హైదరాబాద్‌ : వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలు దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కాడర్ల శ్రీనివాస్‌(38) గుండె వైఫల్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం. హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన ఆయన కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశంలో ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. ఉదయం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ గోపి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ఎంజీఎం నూతన సూపరింటెండెంటు డాక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి ఆర్‌ఐసీయూ వార్డును సందర్శించి బాధితుడు శ్రీనివాస్‌ను పరామర్శించారు. ఆసుపత్రిలో పేషెంటు కేర్‌, పారిశుద్ధ్య పనులు చూస్తున్న ఏజిఎల్‌ ఏజెన్సీ ఎక్కడా టెండర్లు వేయకుండా నిషేధిత జాబితా(బ్లాక్‌ లిస్టు)లో పెడతామని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఆసుపత్రులపై నిఘా పెడతామని వెల్లడించారు. ఇకపై ధైర్యంగా ఎంజీఎంకు వైద్యం కోసం రావాలని ప్రజలకు సూచించారు. ఆర్‌ఐసీయూ వార్డు హెచ్‌వోడీ, ఇతర వైద్యసిబ్బంది నిర్లక్ష్యంపై పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇరుకుగా ఉన్న ఆర్‌ఐసీయూ వార్డులో కొన్ని పడకలను అకడమిక్‌ హాల్‌ బ్లాక్‌లో ఏర్పాటు చేయిస్తామని, రోగులకు వీలుగా లిఫ్ట్‌ ఏర్పాటుకు కలెక్టర్‌ రూ.10లక్షలు మంజూరు చేశారని వెల్లడించారు.

డాక్టర్లు ఎలుకలను పట్టుకుంటారా?  
వైద్యులు రోగులకు చికిత్స అందిస్తారే తప్ప ఎలుకలను పట్టుకొని.. వాటిని నివారించరని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆక్షేపించింది. సంబంధం లేని విషయాలను అంటకట్టి ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్‌ శ్రీనివాసరావు, ఇద్దరు డ్యూటీ డాక్టర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని ఖండించింది. వారిపై చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. శుక్రవారం అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రాజమోహన్‌ అధ్యక్షతన ఎంజీఎంలో వైద్యులు సమావేశమయ్యారు. ప్రభుత్వం తన నిర్ణయంపై తగ్గకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, అవసరమైతే సమ్మెకు వెళ్తామని వారు హెచ్చరించారు.

ఓ మూషికం చిక్కింది
ఎంజీఎం ఆసుపత్రిలో ఓ ఎలుక చిక్కింది. ఆసుపత్రి ఆర్‌ఐసీయూ వార్డులో రోగి శ్రీనివాస్‌ను ఎలుక కొరికిన ఘటన నేపథ్యంలో అధికారులు గురువారం రాత్రి ఆ వార్డులో ఎలుకల బోన్లు, ప్యాడ్లు ఏర్పాటు చేశారు. రాత్రి వార్డులోకి వచ్చిన మూషికం బోనులో పడింది. ‘అసలు నిందితుడైన మూషికాన్ని పట్టుకున్నాం’అని వైద్యసిబ్బంది సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని