Telangana: సన్నరకం వరికి సరే!

ప్రస్తుత యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న వానాకాలం (ఖరీఫ్‌)లో పంటలసాగుపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. వానాకాలంలో

Updated : 03 Apr 2022 05:42 IST

వానాకాలం పంటలపై సర్కారు కసరత్తు

పత్తి, కంది సాగు పెంచాలని నిర్ణయం

విత్తనాలకు రాయితీ లేనట్టేనని సంకేతాలు

ఈనాడు - హైదరాబాద్‌

ప్రస్తుత యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న వానాకాలం (ఖరీఫ్‌)లో పంటలసాగుపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. వానాకాలంలో దీర్ఘకాలిక వరి వంగడాల సాగుకు తెలంగాణ వాతావరణం, భూములు అనుకూలమని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసింది. సన్నబియ్యానికి మార్కెట్‌లో డిమాండు అధికంగా ఉన్నందున మద్దతు ధర సులభంగా వస్తుందని మార్కెటింగ్‌శాఖ అంచనా. ఈ నేపథ్యంలోనే సన్నవరి సాగుపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలను విధించడం లేదని సమాచారం. అయితే వరి విత్తనాల ధరపై రాయితీని ఇచ్చే అవకాశాలు లేవని తెలిసింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టీఎస్‌ సీడ్స్‌) వద్ద ఉన్న వరి విత్తనాలను మార్కెట్‌ ధరలకే రైతులకు విక్రయించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

పత్తికి మంచి ధర
పత్తి, కంది సాగును మరింత ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ రెండు పంటలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండు ఉందని, రైతులకు మద్దతు ధర వచ్చే అవకాశాలున్నందున వీటి సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులను ప్రోత్సహించనున్నారు. గత వానాకాలంలో రాష్ట్రంలో 46.42 లక్షల ఎకరాల్లో పత్తి, 7.64 లక్షల ఎకరాల్లో కంది, 61.94 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగుచేశారు. కానీ వచ్చే వానాకాలంలో పత్తి 60 లక్షల ఎకరాలకు పైగా వేస్తారని వ్యవసాయశాఖ అంచనా. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండు ఉన్నందున పత్తి పంట సాగును ప్రోత్సహించనున్నారు. ఎకరానికి 2 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం. 60 లక్షల ఎకరాలకు సరిపోయేలా 1.20 కోట్ల విత్తన ప్యాకెట్లను గ్రామాలకు వచ్చే నెలాఖరులోగా పంపాలని ప్రైవేటు విత్తన కంపెనీలు నిర్ణయించాయి. కంది సాగుకు సంకరజాతి (హైబ్రిడ్‌) విత్తనాలను వాడుతున్నందున రైతులు వాటిని మార్కెట్‌లో సొంతంగా కొనాల్సిందే.

పెరగనున్న సోయాచిక్కుడు సాగు
ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం వల్ల దేశంలో వంటనూనెలకు కొరత ఏర్పడి ధరలు బాగా పెరుగుతున్నాయి. సోయా వంటనూనెను విదేశాల నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. పైగా విదేశాల్లో జన్యుమార్పిడి (జీఎం) సోయా విత్తనాలతో పంట సాగుచేస్తున్నారు. భారతదేశంలో జీఎం సోయా విత్తనాలకు అనుమతి లేనందున సాధారణ దేశీయ రకాలనే వేస్తున్నందున ఇక్కడి పంటకు అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం మంచి డిమాండు ఉంది. సోయాచిక్కుడు పంటను గత వానాకాలంలో 3.74 లక్షల ఎకరాల్లో వేశారు. ఈ ఏడాది 4 లక్షల ఎకరాలు దాటవచ్చని అంచనా. సోయా విత్తనాలను కొనేందుకు ఇటీవల రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. క్వింటా సోయా విత్తనాలకు రూ.14 వేలు చెల్లించాలని ప్రైవేటు విత్తన కంపెనీలు టెండర్లు వేశాయి.


సోయా, పచ్చిరొట్ట పైర్ల విత్తనాలకు రాయితీపై పరిశీలన
- ఎస్‌.నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

సోయా విత్తనాల ధరలు పెరిగినందున రాయితీ ఇస్తే ఎలా ఉంటుందనేది ప్రభుత్వం పరిశీలిస్తోంది. భూసారం పెంచేందుకు జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్ల విత్తనాలను రాయితీపై ఇచ్చి రైతులతో సాగుచేయించాలని ప్రణాళిక సిద్ధం చేశాం. వీటిపై త్వరలో అధికారికంగా ప్రభుత్వం ప్రకటన ఇస్తుంది. వచ్చే వానాకాలంలో పత్తి, కంది పంట అధికంగా వేయాలని రైతులకు సూచిస్తున్నాం. వరి సాగుపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. వానాకాలంలో సన్నరకాల వరి సాగుచేస్తారు కాబట్టి వాటికి మద్దతు ధర సులభంగా అందుతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని