మహారాష్ట్రలో ఆకాశం నుంచి కిందపడిన ఇనుప శకలం

ఆకాశం నుంచి మెరుస్తూ భారీ ఇనుప శకలం, సిలిండర్‌ వంటి గుర్తుతెలియని వస్తువులు శనివారం రాత్రి మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లాలోని సిందెవాహి ప్రాంతంలో పడినట్లు కలెక్టర్‌ అజయ్‌ గుల్హానె ఆదివారం తెలిపారు.

Updated : 04 Apr 2022 13:32 IST

సిలిండర్‌ వంటి వస్తువు కూడా..
త్వరలో పరిశీలించనున్న విపత్తు నిర్వహణ బృందం

బల్లార్ష, న్యూస్‌టుడే: ఆకాశం నుంచి మెరుస్తూ భారీ ఇనుప శకలం, సిలిండర్‌ వంటి గుర్తుతెలియని వస్తువులు శనివారం రాత్రి మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లాలోని సిందెవాహి ప్రాంతంలో పడినట్లు కలెక్టర్‌ అజయ్‌ గుల్హానె ఆదివారం తెలిపారు. ముంబయి నుంచి విపత్తు నిర్వహణ బృందం త్వరలోనే వచ్చి ఈ ప్రాంతంలో పర్యటించి ఆ వస్తువులేమిటనేది పరిశీలిస్తుందన్నారు. లాడ్‌బోర్‌ గ్రామంలో ఇనుప శకలం, పవన్‌పార్‌లో సిలిండర్‌ పడినట్లు ఆయన వెల్లడించారు. ఉగాది సందర్భంగా విదర్భ ప్రాంతంలోని ప్రజలంతా వేడుకల్లో నిమగ్నమై ఉండగా.. ఒక్కసారి ఆకాశం నుంచి మెరుపులతో కూడిన వస్తువు కిందకి రాలడం కనిపించింది. ఉల్కలు పడుతున్నాయని భావించిన ప్రజలు.. ఇనుప శకలం, సిలిండర్‌లాంటి వస్తువు పడటంతో భయాందోళనలకు గురయ్యారు. అవి కిందకి పడుతున్న దృశ్యాలను పలువురు తమ చరవాణిల్లో చిత్రీకరించారు. భారీ ఇనుప శకలం లాడ్‌బోర్‌ గ్రామ పరిధిలోని ఖాళీ ప్రదేశంలో పడటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం గ్రామస్థులు ఈ శకలాన్ని ట్రాక్టరుపై తీసుకెళ్లి తాలూకా కేంద్రమైన సిందెవాహి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ విషయమై స్థానిక ఖగోళశాస్త్రవేత్త సురేష్‌చాపనేను సంప్రదించగా...ఉపగ్రహ ప్రయోగానంతరం కూలిన రాకెట్‌ బూస్టర్‌ అయ్యిండొచ్చునని అభిప్రాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని