Telangana News: వడ్లు కొనేదాకా వదలం

తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వడ్ల సేకరణకు కేంద్రం ససేమిరా అంటోందని పేర్కొంటూ.. తెరాస సమరభేరి మోగించింది. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో పెద్దఎత్తున నిరసనలు, దీక్షలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ల పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళనల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎమ్మెస్‌లు, జిల్లా పరిషత్‌ల ఛైర్‌పర్సన్లు, సభ్యులు, మండల పరిషత్‌ల అధ్యక్షులు, సభ్యులు, పురపాలక సంఘాలు, రైతుబంధు సమితులు, సహకార సంఘాల అధ్యక్షులు,...

Updated : 05 Apr 2022 05:13 IST

యాసంగి ధాన్యం మొత్తం తీసుకోవాల్సిందే
కేంద్రం తీరుపై భగ్గుమన్న తెరాస
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు
పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వడ్ల సేకరణకు కేంద్రం ససేమిరా అంటోందని పేర్కొంటూ.. తెరాస సమరభేరి మోగించింది. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో పెద్దఎత్తున నిరసనలు, దీక్షలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ల పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళనల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎమ్మెస్‌లు, జిల్లా పరిషత్‌ల ఛైర్‌పర్సన్లు, సభ్యులు, మండల పరిషత్‌ల అధ్యక్షులు, సభ్యులు, పురపాలక సంఘాలు, రైతుబంధు సమితులు, సహకార సంఘాల అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు భారీసంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రైతుల నుంచి ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం తన వైఖరి మార్చుకునేంత వరకు పోరాటం ఆగదని, వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని మంత్రులు, నేతలు పేర్కొన్నారు. 594 మండలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన దీక్షలు జరిగాయి. తెరాస శ్రేణులతో పాటు రైతులు ర్యాలీగా తరలివచ్చి పాల్గొన్నారు.

దీక్షల్లో పాల్గొన్న మంత్రులు

కరీంనగర్‌ జిల్లా కరీంనగర్‌ గ్రామీణ మండలం గోపాల్‌పూర్‌ వద్ద రైతుల నిరసన, ధర్నాలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని తూర్పారబట్టారు. కేంద్రం ధాన్యం కొనేంతవరకు పార్టీలకు అతీతంగా రైతులందరూ నిరసనలు చేపట్టాలని సూచించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేటలో జరిగిన దీక్షలో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడలో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి సబిత పాల్గొన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌ జిల్లా రాయపర్తి, మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు, పెద్దవంగర, జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాయపర్తిలో నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీ ఆకర్షణగా నిలిచింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌లో తెరాస శ్రేణులు చేపట్టిన నిరసన దీక్షలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే రైతులంతా ఏకం కావాలని సూచించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో రవాణాశాఖ మంత్రి పువ్వాడఅజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. తెలంగాణపై కేంద్రం వ్యవహరిస్తున్న నియంతృత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. సూర్యాపేటలో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. రైతులు వరి సాగు చేయాలని, వడ్లు కొంటామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెబితే.. కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేలు ఆయా మండలాల్లో దీక్షల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌ నగరంలోని అల్వాల్‌లో జరిగిన దీక్షలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో పాటు ప్రజాగాయకుడు గద్దర్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని