Telangana News: ఆస్తి పన్నులో 5 శాతం రాయితీ.. ఎప్పటి వరకంటే?

రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించేవారికి 5 శాతం పన్ను రాయితీని వర్తింపజేస్తున్నట్లు పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ప్రకటించారు.

Updated : 05 Apr 2022 07:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించేవారికి 5 శాతం పన్ను రాయితీని వర్తింపజేస్తున్నట్లు పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ప్రకటించారు. పురపాలక శాఖ డైరెక్టర్‌ పరిధిలోని 128 పురపాలక సంఘాలు, 13 నగరపాలక సంస్థల్లో ఈ నెల 30లోపు చెల్లించేవారికి ఎర్లీబర్డ్‌ ఆఫర్‌ (ముందస్తు చెల్లింపు రాయితీ అవకాశం) వర్తిస్తుందని తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీహెచ్‌ఎంసీలో కూడా ఆస్తి పన్నును ఈ నెల 30లోపు చెల్లించేవారికి 5 శాతం రాయితీని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.698 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఇది లక్ష్యంలో 86 శాతం. పురపాలకశాఖ తీసుకున్న ప్రత్యేక చర్యలతో ఇది సాధ్యమైందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సారి ప్రతి ఆస్తికి క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా డిమాండ్‌ నోటీసులు ఇవ్వడంతో.. దాని సాయంతో ఆన్‌లైన్‌లో నేరుగా చెల్లించేందుకు అవకాశం కలిగిందన్నారు.

99% ఆస్తి పన్ను వసూలుతో సిరిసిల్ల పురపాలక సంఘం మొదటి స్థానంలో నిలిచింది. 97 శాతంతో మెట్‌పల్లి, హుస్నాబాద్‌, అలంపూర్‌, కోరుట్ల తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పెద్ద అంబర్‌పేట 51.8%తో అట్టడుగున నిలిచింది. నగరపాలక సంస్థల్లో కరీంనగర్‌ 95%తో మొదటి స్థానంలో ఉంది. 39 పట్టణ స్థానిక సంస్థల్లో 90%  కంటే ఎక్కువ వసూలైంది. అచ్చంపేట, మందమర్రి, ఎల్లారెడ్డి పురపాలికల్లో 60% కంటే తక్కువ వసూలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని