Tamilisai soundararajan: అవమానాలు పట్టించుకోను

కొన్ని నిర్ణయాలను అంగీకరించకపోతే గవర్నర్‌ కార్యాలయాన్ని అవమానిస్తారా..? ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తారా? అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రశ్నించారు. గవర్నర్‌ పర్యటనకు వెళితే కలెక్టర్‌, ఎస్పీలు అక్కడకు రారా..?

Updated : 07 Apr 2022 05:12 IST

కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వంపై సంతృప్తి చెందలేదు

అంగీకరించకపోతే గవర్నర్‌ కార్యాలయాన్ని అవమానిస్తారా?

ప్రభుత్వంతో సత్సంబంధాలే కోరుకున్నా

సీఎం, మంత్రులతో చర్చకు సిద్ధం

విలేకరుల ప్రశ్నలకు గవర్నర్‌ తమిళిసై సమాధానాలు

ప్రధానమంత్రి మోదీతో భేటీ

ఈనాడు, దిల్లీ: కొన్ని నిర్ణయాలను అంగీకరించకపోతే గవర్నర్‌ కార్యాలయాన్ని అవమానిస్తారా..? ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తారా? అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రశ్నించారు. గవర్నర్‌ పర్యటనకు వెళితే కలెక్టర్‌, ఎస్పీలు అక్కడకు రారా..? అటువంటి నిబంధన ఏమైనా ఉందా? అని అన్నారు. తాను ఈ అవమానాలను పట్టించుకోనని..తెలంగాణ ప్రజలను ప్రేమిస్తానని తెలిపారు. బుధవారం ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాజ్‌భవన్‌కు, సీఎంవోకు మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సమావేశానంతరం ఆమె తెలంగాణభవన్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.  ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వంపై చెబుతూ అది గవర్నర్‌ కోటాఅని..సేవా విభాగంలో ఉందన్నారు. అభ్యర్థిత్వం విషయంలో తాను సంతృప్తి చెందలేదని చెప్పారు. ఈ విషయంలో తననెవరూ బలవంతం చేయలేరన్నారు. అది తన హక్కన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరు రాజ్‌భవన్‌కు వచ్చినా చర్చిస్తానన్నారు. అధికారులు వచ్చి ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా పర్యటనలకు దూరం కాబోనన్నారు. రాజ్‌భవన్‌ పారదర్శంగా ఉంటుందన్నారు. ఉగాది సంబురాలు చేసినప్పుడు తాను అందరినీ పిలిచానన్నారు. కొంత మంది ఫలానా కారణాలతో రాలేమని ఫోన్‌ చేసి చెప్పారని... కొందరి నుంచి అటువంటి సమాధానం కూడా లేదన్నారు. విస్మరించి అవమానించారని చెప్పారు. తాను అహంకారిని(ఈగోయిస్ట్‌) కాదని స్నేహపూరిత వ్యక్తినని...తననెవరూ వేలెత్తి చూపలేరన్నారు.

రాజ్‌భవన్‌, సీఎంవో మధ్య ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసు

‘‘రాజ్‌భవన్‌, సీఎంవో మధ్య ఏం జరిగిందో తెలంగాణ మీడియా ప్రసారం చేసింది.  విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రధానికి ప్రత్యేకంగా నివేదించాల్సిన అవసరం లేదు. నా అధికారాలు ఇవి..అవి అంటూ బలవంతంగా వినియోగించను. నేను స్నేహపూరిత వ్యక్తిని. వివాదాస్పద వ్యక్తిని కాను.. దీనర్థం ప్రభుత్వం చెప్పే ప్రతిదాన్నీ ఆమోదిస్తానని కాదు. నేను కూడా రాజ్యాంగాధిపతిని. నాకూ అభిప్రాయం ఉంటుంది. ఎప్పుడూ చట్టాన్ని, వ్యవస్థను అనుసరిస్తా. అలా వెళుతున్నప్పుడు దాన్ని ఇంకో విధంగా చూసి ప్రభుత్వం గవర్నర్‌ను అవమానించాలని చూస్తే పట్టించుకోను. నన్ను అక్కడ తమిళిసైగా కాకుండా గవర్నర్‌గా గౌరవించాలి. రాజ్యాంగాన్నీ గౌరవించాలి. ఇవాళ నేను ఉండొచ్చు. రేపు వేరే గవర్నర్‌ రావచ్చు. ప్రభుత్వం పంపే ప్రతి ఒక్కటీ అంగీకరించాలని లేదు. గతంలో రెండు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమోదించా. అవేవీ వివాదాస్పదం కాలేదు. గవర్నర్‌కోటా నియామకాలు రాజకీయ నిర్ణయం కాదు. రాజ్యాంగబద్ధ నిర్ణయం. మరో విషయం మండలి ప్రొటెం ఛైర్మన్‌ గురించి చెప్పారు. ప్రొటెంపై పాయింట్‌ లేవనెత్తితే వారు మళ్లీ పంపించారు. అది కూడా రాజ్యాంగపరమైందే. నేను ఏదైనా వ్యవస్థాపరమైన అంశాన్ని లేవనెత్తితే హృదయపూర్వకంగా అంగీకరించాలి లేదా చర్చించాలి. ఎప్పుడూ ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకున్నా. అయినా గవర్నర్‌తో ప్రభుత్వం అలా వ్యవహరించడానికి కారణం ఏంటో తెలియదు. అంతమాత్రాన నేను ఆగిపోను. ముందుకువెళ్తూనే ఉంటా. మహమ్మారి కాలంలో సలహాలు ఇచ్చా. ఇలా చేయాలని నేను చెప్పగలను. కానీ ప్రభుత్వం తన బాధ్యతలను తెలుసుకోవాలి. గవర్నర్‌ పర్యటనల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్‌కు తెలుసు. ఆ పర్యటనలో ఎలా వ్యవహరించాలో కూడా వారికి తెలుసు. అయినా నేను సమస్య సృష్టించదల్చుకోలేదు. నేను చర్య తీసుకుంటే గవర్నర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నానని మీరే అంటారు. నేను ప్రభుత్వం గురించి రిపోర్ట్‌ కార్డు ఇవ్వడం లేదు. అయితే ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని తొలి నుంచి చెబుతున్నా. ఈ విషయాన్ని గవర్నర్‌గానే కాదు ఓ వైద్యురాలిగా కూడా చెప్పా. ఇటీవల కూడా వరంగల్‌ ఆసుపత్రిలో ఎలుక కొరికి వ్యక్తి చనిపోవడం బాధ కల్గించింది. కొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని అభినందించా. కొన్ని విషయాల్లో సూచనలు చేశా. ప్రభుత్వం నాకు ఎటువంటి నివేదిక ఇవ్వనప్పుడు నేనెలా గవర్నర్‌ ప్రసంగం చేయగలను?  దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారీగా చేపట్టినందుకు ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాను. హైదరాబాద్‌ నుంచి పుదుచ్చేరికి నేరుగా విమాన అనుసంధానత కల్పించినందుకు హర్షం వ్యక్తం చేశాను. తెలంగాణలో నా గిరిజన ప్రాంత పర్యటన వివరాలు చెప్పా. ఇటీవల నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చెంచులను కలిసేందుకు 500 కిలోమీటర్లు ప్రయాణించా. ఆరు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నా. 11, 12 తేదీల్లో భద్రాచలం వెళతా’ అని గవర్నర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని