Tamilisai Soundararajan: డ్రగ్స్‌, అవినీతిపై అమిత్‌షాకు చెప్పా

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వినియోగం పెరిగిందని, యువతరం నాశనమవుతోందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు నివేదించినట్లు తెలిపారు. అవినీతిపైనా రిపోర్టు చేశానని చెప్పారు. గవర్నర్‌కు ప్రొటోకాల్‌ కల్పించని అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందువల్ల ముందస్తు ఎన్నికలకు పోయే

Published : 08 Apr 2022 05:53 IST

 గవర్నర్‌ రాజకీయాలు చేస్తున్నారనడం సరికాదు

 భాజపా మనిషినని నాపై ఎలా ముద్ర వేస్తారు?

 కేసీఆర్‌లా వ్యవహరించి ఉంటే శాసనసభ రద్దయ్యేది

  సమ్మక్క సారక్క జాతరలో అధికారులు రాని విషయం ఎమ్మెల్యే సీతక్క చెప్పారు

 విలేకరులతో ఇష్టాగోష్ఠిగా తమిళిసై

ఈనాడు - దిల్లీ

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వినియోగం పెరిగిందని, యువతరం నాశనమవుతోందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు నివేదించినట్లు తెలిపారు. అవినీతిపైనా రిపోర్టు చేశానని చెప్పారు. గవర్నర్‌కు ప్రొటోకాల్‌ కల్పించని అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందువల్ల ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను గురువారం ఉదయం ఆమె కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు.. ఇతర అంశాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. అనంతరం తెలంగాణభవన్‌లో విలేకరులతో గవర్నర్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘గవర్నర్‌ రాజకీయం చేస్తున్నారని మంత్రులు మాట్లాడడం సరికాదు. వారిని (ముఖ్యమంత్రి, మంత్రులు) పలు కార్యక్రమాలకు ఆహ్వానించినా రాలేదు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళితే భాజపా మనిషినని నాపై ఎలా ముద్ర వేస్తారు? అక్కడ పార్టీ జెండా ఏమైనా ఎగురవేశానా? పార్టీ బెటాలియన్‌ నాతో వచ్చిందా? ఆ వ్యాఖ్యలు విని నవ్వుకోవడం తప్ప ఏం చేయగలం. నేను ఇప్పటివరకు భాజపా నేతలకు కేవలం ఒకటి, రెండు సార్లు మాత్రమే అపాయింట్‌మెంట్‌ ఇచ్చా. ఇతర పార్టీల నేతలే ఎక్కువ కలిశారు. గవర్నర్‌కు గౌరవం ఇస్తున్నామని మంత్రి (జగదీశ్‌రెడ్డి) చెప్పేది నిజమైతే గణతంత్ర వేడుకలకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు రాలేదు? సమ్మక్క, సారక్క జాతరకు నన్ను ఎందుకు పిలవలేదు? ఇదేనా గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం? అయినా నేను పట్టించుకోలేదు. అధికారులు రాని విషయం గుర్తించి స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. నాలుగైదు నెలలుగా జరుగుతున్న సంఘటనలు చూస్తూ... గవర్నర్‌కు అన్ని విధాలా ప్రొటోకాల్‌ కల్పిస్తున్నట్లు మంత్రులు ఎలా చెబుతారు? తెలంగాణలో మంచి సుసంపన్నమైన సంస్కృతి ఉంది.. సోదరసోదరీమణుల్లా కలిసిపోతారు.. నేను తెలంగాణ సోదరిని.. గవర్నర్‌గా కాకపోయినా.. ఒక సాధారణ మహిళగానైనా గౌరవం ఇవ్వాలా..?లేదా? నేను దిల్లీ వచ్చిన మూడు రోజుల్లో తెలంగాణభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ కనీసం కనిపించలేదు. నేను ఉంటున్న శబరి బ్లాక్‌ వైపు రాలేదు. ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నందున రాలేకపోతున్నట్లు అర్థం చేసుకున్నా. 

15 రోజులు సభ అనుమతి పత్రాలు తొక్కిపెట్టి ఉంచినట్లయితే..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరహాలో నేనూ వ్యవహరిస్తే ఇప్పటికే శాసనసభ రద్దయ్యేది. నిబంధనల ప్రకారం ఆరు నెలలకోసారి సమావేశాలు జరపాలి. గవర్నర్‌ ప్రసంగం లేకుండా జరపొచ్చు. కానీ గవర్నర్‌ సంతకం లేకుండా ప్రారంభించకూడదు. నా ప్రసంగం లేకుండా చేసినా సరే నేను సమావేశాల ప్రారంభానికి సంతకం చేశా. అప్పటికి సమావేశాలు జరిగి ఆరు నెలల కాలం ముగియడానికి కేవలం 15 రోజుల వ్యవధే ఉంది. ఆ పదిహేను రోజులు శాసనసభ సమావేశాల అనుమతి దస్త్రాన్ని తొక్కిపెట్టి ఉంచినట్లయితే సభే రద్దయ్యేది. కానీ నేను హుందాగా వ్యవహరించా. నేను పెద్ద రాజకీయ కుటుంబంలో జన్మించా. మా నాన్న ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒక దఫా ఎంపీగా చేశారు. చట్టాలు, రాజకీయాలపై అవగాహన ఉంది. తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలిగా నాటి ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా తీవ్రంగా గళం విప్పేదాన్ని.

అది రాజ్‌భవన్‌ కార్యక్రమం

రాజ్‌భవన్‌లో ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫొటో లేదనడం సరికాదు. అది పూర్తిగా రాజ్‌భవన్‌ కార్యక్రమం. రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు పెట్టాలని చెప్పాను. ఉద్దేశపూర్వకంగా సీఎం ఫొటో పెట్టవద్దనుకోలేదు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫొటో పెట్టాం. ఆ రోజు ఆయనను (సీఎం) పిలిచినా రాలేదు. కొందరు మంత్రులు వచ్చినందుకు సంతోషం. గవర్నర్‌ కార్యాలయాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో..? రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు దూరం ఎందుకు పెరిగిందో నాకు తెలియదు. ఈ విషయాన్ని  మీడియానే అడగాలి. రాజ్యాంగ హోదాలో ప్రభుత్వంపై నేను విమర్శలు చేయడం లేదు. మీడియా ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇస్తున్నా.

మా అమ్మ చనిపోయినా సీఎం పరామర్శించలేదు

మా అమ్మ చనిపోతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనీసం పరామర్శించలేదు. ఆమె భౌతిక కాయాన్ని తమిళనాడు చేర్చేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటుగా తీసుకెళ్లాం. అమ్మ చనిపోయిన వార్తను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయాలకు నేను స్వయంగా ఫోన్‌ చేసి చెప్పాను. రాష్ట్రపతి వెంటనే ఫోన్‌ చేసి ఓదార్చారు. విదేశాల్లో ఉన్న ప్రధాని సాయంత్రానికి ఫోన్‌లో మాట్లాడారు. భౌతికకాయాన్ని చూసేందుకు కేసీఆర్‌ మాత్రం రాజ్‌భవన్‌కు రాలేదు. కనీసం ఫోన్‌లో పరామర్శించలేదు. గత గవర్నర్‌ నరసింహన్‌ మాతృమూర్తి చనిపోతే భౌతికకాయం తరలించే వరకు సీఎం రాజ్‌భవన్‌లోనే ఉన్నారని నాకు కొందరు చెప్పారు. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, దిల్లీల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్ల మధ్య దూరం కనిపిస్తున్నా ఆ ముఖ్యమంత్రులు, గవర్నర్లకు ఇచ్చే గౌరవంలో వ్యత్యాసం చూపడం లేదు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. గతేడాది జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, నా పుట్టిన రోజు ఒకే రోజు కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత నుంచి రాజ్‌భవన్‌ను, గవర్నర్‌ కార్యాలయాన్ని అవమానిస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించాలనే ప్రతిపాదనను ఆమోదించని తర్వాత పరిస్థితి బాగా దిగజారింది. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా అక్కడ కొన్ని సలహాలిచ్చి సమస్యలు పరిష్కరించా. తెలంగాణలో సలహాలిచ్చే  పరిస్థితి లేదు.

రోడ్డు.. రైలు మార్గంలోనే.. 

ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా ప్రజల కోసం నా విధిని నిర్వహిస్తా. ఈ నెల 10, 11 తేదీల్లో భద్రాచలానికి రైలు, రోడ్డు మార్గాల్లో వెళతా.. శ్రీరామ పట్టాభిషేకం, కల్యాణానికి హాజరవుతా’’ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్‌ సదుపాయం కల్పిస్తుందిగా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘‘ఆ జవాబును మీడియాకే వదిలేస్తున్నా’’అని గవర్నర్‌ తెలిపారు. సమ్మక్క, సారక్క జాతర, నాగర్‌కర్నూల్‌ జిల్లాకూ రోడ్డు మార్గంలోనే వెళ్లానని నొక్కిచెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి తెలంగాణ, పుదుచ్చేరిలోని వివిధ అంశాలపై వివరించానన్నారు. స్వాతంత్య్ర అమృతమహోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పానని గవర్నర్‌ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆమె దిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు.


భావోద్వేగాలను సొమ్ము చేసుకోవడంలో కేసీఆర్‌ దిట్ట..

ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవడంలో కేసీఆర్‌ దిట్ట.. ఆయన ప్రసంగాలు ప్రజలను మంత్రముగ్ధులను చేస్తాయి. అయితే అది ఎంతో కాలం కొనసాగదు. నేను తొలి నుంచి కేసీఆర్‌ను అన్నా అని పిలుస్తున్నా. కేసీఆర్‌ ఇప్పటికైనా రాజ్‌భవన్‌కు వస్తే అన్నా అంటా. ఆయనతో అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని