KTR: గవర్నర్‌ ఊహించుకుని మాట్లాడుతున్నారు

రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా గవర్నర్‌ పదవికి భంగం కలిగించేలా వ్యవహరించలేదని రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పష్టం చేశారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో గురువారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నరసింహన్‌

Published : 08 Apr 2022 05:50 IST

 మేం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నాం: కేటీఆర్‌

నూకలు తినమన్న పార్టీ తోకలు కత్తిరిద్దాం

సిరిసిల్ల దీక్షలో మంత్రి

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా గవర్నర్‌ పదవికి భంగం కలిగించేలా వ్యవహరించలేదని రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పష్టం చేశారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో గురువారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నరసింహన్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఎలాంటి పంచాయితీలు లేవన్నారు. గవర్నర్‌ను తాము ఎప్పుడూ ఎక్కడా అవమానించలేదని చెప్పారు. ఆమె ఊహించుకుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ‘‘కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి విషయంలో అభ్యంతరం పెట్టినందుకు అవమానిస్తారా అని గవర్నర్‌ అన్నారు. రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి ఎమ్మెల్సీగా అనుమతించలేదని ఆమె చెప్పారని మీడియాలో వచ్చిన కథనాలను బట్టి తెలిసింది. ఆమె గతంలో భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. గవర్నర్‌గా నియమితులు కావడానికి అది అడ్డు కాలేదు. ఎమ్మెల్సీకి రాజకీయ నేపథ్యం ఎందుకు అడ్డొచ్చింది? మేం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నాం. శాసనసభ సమావేశాలు తొలిసారి జరిగినప్పుడు గవర్నర్‌ ప్రసంగం ఉండాలని రాజ్యాంగంలో ఉంది. ఇటీవల జరిగింది తొలి సమావేశం కాదు. సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. ప్రోరోగ్‌ కాలేదు. అందువల్లే గవర్నర్‌ ప్రసంగం పెట్టలేదు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

రైతులను కేంద్ర ప్రభుత్వం వంచిస్తోందని, తెలంగాణ ప్రజలను నూకలు తినమంటున్న భాజపా తోకలు కత్తిరించాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజాన్ని తక్కువ చేసి మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను వదిలిపెట్టబోమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన రైతు దీక్షలో కేటీఆర్‌ మాట్లాడారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనదని గ్రహించి.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించామన్నారు. ఆ తర్వాత కరీంనగర్‌ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు పలు సందర్భాల్లో ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేదంటూ రైతులను రెచ్చగొట్టి వారిని అయోమయానికి గురిచేశారని తెలిపారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల ఎకరాల్లో వరి సాగైందన్నారు. మార్చిలో పీయూష్‌ గోయల్‌ ఉప్పుడు బియ్యానికి డిమాండ్‌ లేదని, ప్రస్తుతం ఎవరూ తినడం లేదని, తాము కొనలేమని చేతులెత్తేశారని పేర్కొన్నారు. ‘‘నా దగ్గర మూడేళ్ల సమాచారం ఉంది. దేశం నుంచి ఏటా కోటి మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ఎగుమతి అవుతోంది’’ అంటూ కేటీఆర్‌ పత్రాలను చూపించారు. రాష్ట్రంలో తెరాస శాశ్వతంగా పాగా వేయబోతోందని.. తమకు ఇక్కడ జాగా దొరకదని భావించిన భాజపా నాయకులు ధాన్యం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. భాజపా నాయకులు పలు సందర్భాల్లో మాట్లాడిన వీడియోలను సభలో తెరపై ప్రదర్శించారు. రాష్ట్రంలో పండించిన ప్రతి బియ్యం గింజను తామే కొంటామని చెప్పిన భాజపా నాయకులు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఒకవేళ వారికి చేతకాదని అనుకుంటే కేసీఆర్‌కు బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని హితవు పలికారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, రాష్ట్రంలోని తెరాస ప్రజాప్రతినిధులందరితో కలిసి.. దిల్లీలో మోదీ నివాసానికి కూతవేటు దూరంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపడతారని మంత్రి వెల్లడించారు.


చాయ్‌పే కాదు.. ధరలపై చర్చ

‘‘నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని కాకముందు చాయ్‌పే చర్చ అన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో తెలంగాణ ధాన్యంపై.. పెరిగిన పెట్రోల్‌, నిత్యావసరాలు, సిలిండర్‌ ధరలపై చర్చ సాగుతోంది. సిలిండర్‌ ధర రూ.వెయ్యి అయింది.. మళ్లీ కట్టెలపొయ్యే దిక్కయింది’’ అని కేటీఆర్‌ విమర్శించారు. ధరల పెరుగుదలను కప్పిపుచ్చుకునేందుకు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం పేరు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని