Telangana News: నల్ల జెండాలెత్తిన తెరాస

యాసంగిలో తెలంగాణలో పండిన వడ్ల కొనుగోళ్లపై కేంద్ర ధొరణికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తెరాస పెద్దఎత్తున నిరసనలు తెలియజేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతుబంధు సమితుల అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు,

Updated : 09 Apr 2022 06:37 IST

వడ్ల కొనుగోళ్లలో కేంద్ర వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
ర్యాలీలు, దిష్టిబొమ్మ దహనాలు

ఈనాడు, హైదరాబాద్‌: యాసంగిలో తెలంగాణలో పండిన వడ్ల కొనుగోళ్లపై కేంద్ర ధొరణికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తెరాస పెద్దఎత్తున నిరసనలు తెలియజేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతుబంధు సమితుల అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు తమ ఇళ్లపై నల్ల జెండాలను ఎగురవేశారు. ఊరూరా ర్యాలీలు, ప్రదర్శనలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు, చావు డప్పు మోతలు సాగాయి. రైతులు సైతం తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్నదాతలపై తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోందంటూ మండిపడ్డారు. కేంద్రం ఈ వైఖరి మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగర్‌లోని తమ నివాసంలో నల్ల జెండా ఎగురవేశారు. రైతు సమస్యలపై కేంద్రం ద్వంద్వ విధానాలను పాటిస్తోందని దుయ్యబట్టారు. ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు భారీ ద్విచక్రవాహన ప్రదర్శన చేపట్టాయి. కేంద్రం దిగొచ్చేంతవరకూ వెనక్కి తగ్గేదిలేదని మంత్రి తేల్చి చెప్పారు. మహబూబ్‌నగర్‌ మండలంలోని జమిస్తాపూర్‌, తెలుగు గూడెంలలో ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నల్లజెండాలు ఎగురవేశారు. కేంద్ర కక్షసాధింపుపై తెలంగాణ తిరగబడడం ఖాయమన్నారు. నిర్మల్‌లోని తన నివాసంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నల్ల జెండాలు ఎగురవేసి కేంద్ర వైఖరిపై నిరసన తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం రైతుల శ్రేయస్సు దృష్ట్యా పండించిన వడ్లనన్నింటినీ కొనాల్సిందేనని డిమాండ్‌ చేశారు. మేడ్చల్‌లో నల్లజెండాల ఎగురవేత అనంతరం జరిగిన సభలో మంత్రి మల్లారెడ్డి తన నిరసన తెలియజేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్‌లోని తమ ఇంటిపై నల్లజెండాను ఎగురవేశారు. కేంద్రం తెలంగాణను అవమానిస్తోందని, తగిన ఫలితం అనుభవిస్తుందన్నారు. ఆర్మూర్‌లో పీయూసీ ఛైర్మన్‌  ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో బారీ ర్యాలీని నిర్వహించి, కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు.

11న దిల్లీ ధర్నాపై దృష్టి
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 4 నుంచి తెరాస చేపట్టిన అయిదంచెల ఆందోళన చివరి దశకు చేరింది. ఇప్పటికే తెరాస మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు, జాతీయ రహదారులపై రాస్తారోకోతోపాటు తాజాగా నల్లజెండాల ఎగురవేతలు జరిగాయి. ఈ నెల 11న దిల్లీలో తెలంగాణభవన్‌ వేదికగా భారీఎత్తున ధర్నాకు సిద్ధమవుతోంది. దీని కోసం శుక్రవారం నుంచి ఏర్పాట్లు మొదలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని