Andhra News: భగ్గుమన్న అసమ్మతి

ఏపీలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వైకాపాలో మంటలు రేపింది.  నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి  భగ్గుమంది. పార్టీలో తిరుగుబాటు జెండా ఎగిరింది. మంత్రి పదవులు లభిస్తాయని ఆశించిన పలువురు...

Updated : 11 Apr 2022 05:39 IST

వైకాపా అధిష్ఠానం తీరుపై ఆగ్రహం, ధిక్కారం..
రాస్తారోకోలు, ద్విచక్ర వాహనాల దహనాలు, ఆత్మహత్యాయత్నాలు, రాజీనామాలతో నిరసనలు

ఈనాడు-అమరావతి, యంత్రాంగం: ఏపీలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వైకాపాలో మంటలు రేపింది.  నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి  భగ్గుమంది. పార్టీలో తిరుగుబాటు జెండా ఎగిరింది. మంత్రి పదవులు లభిస్తాయని ఆశించిన పలువురు ఎమ్మెల్యేలు అవి దక్కకపోవటంతో బాహాటంగానే అధిష్ఠానం పట్ల ఆగ్రహం, నిరసన వ్యక్తం చేశారు. కొత్త మంత్రివర్గంలోనూ తమను కొనసాగిస్తారని భావించిన తాజా మాజీమంత్రులు కొందరికి ఆ అవకాశం లభించకపోవటంతో వారిలో పలువురు అధిష్ఠానంపై తీవ్రంగా మండిపడ్డారు.  రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఇలా ధిక్కారస్వరం వినిపించారు.

భగ్గుమన్న బాలినేని..  

కొత్త మంత్రివర్గంలో తనను కొనసాగించకపోవటంపై పట్ల బాలినేని శ్రీనివాసరెడ్డి భగ్గుమన్నారు. ఆయన అనుచరులు ఒంగోలులో సీఎం జగన్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు.  సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని బుజ్జగించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. బాలినేనిని కొనసాగించకపోవడాన్ని నిరసిస్తూ పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.

సజ్జలపై ఆగ్రహజ్వాలలు

గత మంత్రివర్గంలోని ఎస్సీ మంత్రులందర్నీ కొనసాగించి తననే తప్పించడంపై మేకతోటి సుచరిత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సుచరిత కుమార్తె రిషిత మీడియా ముందుకొచ్చి తన తల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, పార్టీకి చేయలేదని ప్రకటించారు. అంతకుముందు సుచరిత అనుచరులు ధర్నా చేపట్టారు. సజ్జల డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

సీఎంవో నుంచి ఫోన్‌ చేసినా స్పందించని పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో.. నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు  బస్టాండు కూడలికి చేరి కొంతసేపు రాస్తారోకో చేశారు. తమ పదవులకు రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. సీఎంవో నుంచి కార్యదర్శి ధనుంజయరెడ్డి... పిన్నెల్లికి ఫోన్‌ చేయగా ఆయన స్పందించలేదు.  రెంటచింతల-5 ఎంపీటీసీ సభ్యురాలు పాముల సంపూర్ణమ్మ ఆత్మహత్యకు యత్నించగా.. అక్కడున్నవారు ఆమెను అడ్డుకున్నారు.

కంటతడి పెట్టిన కోటంరెడ్డి..

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదనతో కంటతడి పెట్టుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు అన్నీ తానై చూసుకున్నానన్నారు. అంతకుముందు నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు తమ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. రాజీనామాలు వద్దని వారిని కోటంరెడ్డి వారించారు.

ఉదయభాను అనుచరుల ఆగ్రహజ్వాల

ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానుకు మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో  సారథి అనే కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. పక్కనున్న నాయకులు అతన్ని నిలువరించారు. పెనుగంచిప్రోలు మండలానికి చెందిన కార్యకర్తలు ముండ్లపాడు సమీపంలోని జాతీయ రహదారిపైకి చేరుకొని  టైర్లు వేసి కాల్చారు. తర్వాత ద్విచక్రవాహనంపై పెట్రోల్‌ చల్లుతున్న ఇద్దరు, పక్కనే ఉన్న మరో ఇద్దరికి మంటలు చుట్టుముట్టాయి. వెంటనే సహచరులు స్పందించి మంటలు ఆర్పారు.  
పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై  పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు  విజయవాడ ఎంజీ రోడ్డులోని పార్థసారథి కార్యాలయానికి చేరుకుని రహదారిపై ఆందోళనకు దిగారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి నిరసనగా ఆత్మకూరు పురపాలక సంఘం కౌన్సిలర్లు అయిదుగురు వారి పదవులకు రాజీనామా చేశారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి మంత్రిపదవి ఇవ్వనందుకు నిరసనగా నియోజకవర్గంలో వైకాపా నాయకులు ఆందోళన చేపట్టారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని ఆయన వర్గీయులు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు