Bandi Sanjay: వడ్లు కొనాల్సిందే.. లేదంటే గద్దె దిగాల్సిందే!

రాష్ట్రంలో యాసంగి పంట ‘వడ్లు కొనాల్సిందే.. లేదంటే గద్దె దిగాల్సిందే’నంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. ప్రతి బియ్యం గింజను కొనేందుకు....

Updated : 12 Apr 2022 05:22 IST

దిల్లీలో కాదు.. గల్లీలో తేల్చుకుందాం
కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌

ఈనాడు, హైదరాబాద్‌, రాంనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో యాసంగి పంట ‘వడ్లు కొనాల్సిందే.. లేదంటే గద్దె దిగాల్సిందే’నంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. ప్రతి బియ్యం గింజను కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. వడ్లు సేకరించి ఇచ్చే దమ్ముందా అని సీఎంను నిలదీశారు. కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ టికెట్‌ ధరలు, రిజిస్ట్రేషన్ల ఖర్చులను పెంచిన సీఎం.. ప్రజల తిరుగుబాటుకు భయపడి.. వారి దృష్టి మళ్లించేందుకు వడ్ల రాజకీయానికి దిగారని ఎద్దేవా చేశారు. కొనుగోలు కేంద్రాలు మూసేసి.. దిల్లీలో దీక్షలు చేపట్టడం దేనికి? గల్లీలో తేల్చుకుందాం.. అంటూ సవాల్‌ విసిరారు. ధాన్యం కొనకుండా రైతులను దగా చేస్తున్న కేసీఆర్‌ వైఖరికి నిరసనగా సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో భాజపా చేపట్టిన రైతు దీక్షనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘సింహాల్లాంటి మా కార్యకర్తల గర్జనలతో సీఎంను ఫాంహౌస్‌ నుంచి ధర్నాచౌక్‌కు.. తర్వాత దిల్లీకి గుంజుకొచ్చిన ఘనత మాదే. ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని ప్రచారం చేసి ఇప్పుడెందుకు యాసంగి ధాన్యం కొనడంలేదో ప్రజలకు జవాబు చెప్పి తీరాలి. రైతులు పండించిన వడ్లను ఎందుకు కొనడంలేదు..? కమీషన్లకు అలవాటుపడి బ్రోకర్ల చేతిలో రైతులు బలి అయ్యేలా చేస్తున్నారు. కేంద్రాన్ని బద్నాం చేసేందుకు వారిని అరిగోస పెడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని వడ్ల కొనుగోలు సమస్య తెలంగాణలోనే ఎందుకు వచ్చింది’’అని సంజయ్‌ ప్రశ్నించారు. భూసార పరీక్షలు, వివిధ సబ్సిడీల కింద ఎకరానికి రూ.65 వేల వరకూ కేంద్రం అందిస్తుంటే.. వాటిని దారిమళ్లించి భూదందా, పాస్‌పోర్టు మోసాల మాదిరే కాజేశారని ధ్వజమెత్తారు. దొంగ దీక్షలు, యాస, భాషలతో ప్రజల్ని ఎన్నాళ్లు మోసగిస్తావని ఆక్షేపించారు. గడీలను పగులగొట్టి.. ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో తాగునీరు కలుషితమై ఇద్దరు మృతి చెందారు.. ఇదేనా మున్సిపల్‌ శాఖ మంత్రి పనితీరు అంటూ భాజపా మధ్యప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు ప్రశ్నించారు. సమస్యలు ఎక్కడుంటే అక్కడ పోరాడాలి.. కానీ దిల్లీలో దీక్షలతో వచ్చేది ఏముందని పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ‘‘తానే చక్రవర్తిలా ఉండాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. రాజ్యాంగంపై గౌరవం లేని వ్యక్తి సీఎం పదవిలో ఉండడానికి అనర్హుడు’’అని ధ్వజమెత్తారు. రైతు దీక్షలో ఎంపీలు బాపురావు, అర్వింద్‌, ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రఘునందన్‌రావు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, సీనియర్‌ నేతలు విజయశాంతి, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి మోహన్‌రావు, వివేక్‌ వెంకటస్వామి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, తమిళనాడు సహ ఇన్‌ఛార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు చంద్రశేఖర్‌, సుద్దాల దేవయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, టీఎస్‌పీఎస్‌సీ మాజీ సభ్యుడు విఠల్‌ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.


కేసీఆర్‌ అంటే..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కాదు.. కరప్షన్‌ రావు, కమీషన్‌ రావు. కమీషన్‌ లేనిదే ఏ పని చేయరు. ఇప్పుడు కూడా మిల్లర్లు, బ్రోకర్లు, వ్యాపారులతో కుమ్మక్కై రైతులు రూ.1300లకే క్వింటాలు ధాన్యం అమ్ముకునేలా చేస్తున్నారు. దేశాన్ని మిస్‌ లీడ్‌ చేస్తూ ‘చీఫ్‌ మిస్‌ లీడర్‌’ అయ్యారని ట్విటర్‌లో ట్రెండింగ్‌ అవుతోంది.

- మురళీధరన్‌, కేంద్ర సహాయమంత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని