
CJI: కొలీజియం అత్యుత్తమం
ఇంతకు మించిన ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంటుందనుకోను
భిన్నత్వాన్ని స్వీకరిస్తేనే సమర్థత పెరుగుతుంది
గొంతులేనివారి సాధికారతకు అస్త్రం ‘పిల్’
65 ఏళ్లకే పదవీ విరమణ చాలా తొందరే
రిటైరైనంత మాత్రాన ప్రజా జీవితంలో లేనట్లు కాదు
నా శక్తి సామర్థ్యాలను ప్రజాసేవకు ధారపోసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా
ఆన్‌లైన్ సదస్సులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
ఈనాడు, దిల్లీ: న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరైనా రాజ్యాంగాన్ని అనుసరించి వెళ్లాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఆయన సోమవారం ఆన్‌లైన్ వేదికగా జరిగిన ‘2వ కంపారిటివ్ కాన్‌స్టిట్యూషనల్ లా కన్వర్జేషన్’ సదస్సును ఉద్దేశించి అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్టీఫెన్ బ్రేయెర్‌తో కలిసి మాట్లాడారు. ‘న్యాయమూర్తి పని రాజకీయాలు కాదు. ఒకసారి రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజకీయాలు అన్నవి అప్రస్తుతం. రాజ్యాంగమే మనల్ని నిర్దేశిస్తుంది. ఎక్కడైనా ఇదే సూత్రం అమలవుతుంది’ అని పేర్కొన్నారు.
మహిళా న్యాయమూర్తులకు పెద్దపీట
‘‘సుప్రీంకోర్టు ఏర్పడిన 40 ఏళ్ల తర్వాత తొలి మహిళా న్యాయమూర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం నలుగురు మహిళా న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు. ఇప్పటివరకూ ఇదే అత్యధికం. ఇది సరిపోదని నాకు తెలుసు. ఇటీవల జరిపిన నియామకాల్లో సమ్మిళితత్వంపై విస్తృత చర్చ జరగడం సంతోషకరం. భారతదేశ జనాభా దాదాపు 140 కోట్లు. 120కిపైగా భాషలు, వేల యాసలు ఉన్నాయి. ఈ సామాజిక, భౌగోళిక భిన్నత్వం న్యాయవ్యవస్థలోని అన్ని స్థాయిల్లో ప్రతిఫలించాలి. విస్తృతమైన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ప్రజలు న్యాయవ్యవస్థను తమ సొంత వ్యవస్థగా భావించేందుకు అవకాశం ఉంటుంది. భిన్నత్వం సామర్థ్యాన్ని పెంచుతుంది. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన న్యాయమూర్తులు తమ వైవిద్ధ్యమైన అనుభవంతో ధర్మాసనాలకు పరిపూర్ణత తీసుకొస్తారు. మా కొలీజియం దృక్పథం చాలా అభ్యుదయంగా ఉండటం నాకు చాలా సంతోషం కల్గిస్తోంది. ఇటీవల జరిపిన 9 మంది న్యాయమూర్తుల నియామకాల్లో ముగ్గురు మహిళలున్నారు.
ప్రజాప్రయోజన వ్యాజ్యాలతో సానుకూల ఫలితం
ప్రజాప్రయోజన వ్యాజ్యం అన్నది భారత సుప్రీంకోర్టు కనుగొన్న నూతన విధానం. అణగారిన వర్గాలు కొన్నిసార్లు తమ సమస్య గురించి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయంలో అందరికీ న్యాయాన్ని అందించేలా ప్రోత్సహించడమే ఈ ఆలోచన వెనుక ఉద్దేశం. విస్తృతమైన ప్రజాసమస్యలపై విచారణ చేపట్టడానికి ఒక పోస్ట్‌కార్డు చాలు. సుప్రీంకోర్టు సానుకూల వైఖరి కారణంగా పిల్ అన్నది గొంతులేని వారి సాధికారతకు ఆయుధంగా మారింది. అది ప్రజల్లో హక్కులపట్ల అవగాహనను కల్పించింది. అధికార దుర్వినియోగాన్ని అరికట్టి అవినీతికి అడ్డుకట్ట వేసి, జవాబుదారీతనానికి బీజం వేసింది. దానికి పరిమితులున్నాయన్న అంశంతో ఏకీభవిస్తా. అందుకే దీని దుర్వినియోగాన్ని ఆపడానికి కోర్టులు కొన్ని పరిమితులు విధించాయి. ఫలితం సానుకూలంగానే ఉంది.
జడ్జీలే జడ్జీలను నియమించుకుంటున్నారన్నది తప్పు
రాజ్యాంగం మూడు వ్యవస్థల మధ్య అధికారాలను వికేంద్రీకరించింది. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల పనితీరును సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఇచ్చింది. అందుకే న్యాయవ్యవస్థ స్వతంత్రత విషయంలో రాజీకి తావులేదు. ప్రజల ప్రాథమిక హక్కులు, చట్టాలకు రక్షణ కల్పించేది కోర్టులే. ఈ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజలు న్యాయవ్యవస్థను నమ్ముతారు. ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెంపొందించే లక్ష్యంతోనే నియామకాల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాలు తీసుకొంది. కార్యనిర్వాహక వ్యవస్థ పరిధి దాటినప్పుడు మాత్రమే న్యాయమూర్తుల నియామకం విషయంలో ఉన్న రాజ్యాంగపరమైన నిబంధనలను సుప్రీంకోర్టు సమీక్షించింది. భారత్‌లో న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకుంటారన్న భావన తప్పు. ఈ నియామకాల సమయంలో సుదీర్ఘ సంప్రదింపులు జరుగుతాయి. అందులో ప్రధానమైన భాగస్వామి కార్యనిర్వాహక వ్యవస్థకూడా. ఉదాహరణకు హైకోర్టు న్యాయమూర్తులనే తీసుకుంటే ఒక ప్రతిపాదన హైకోర్టు చేస్తే, దాన్ని సుప్రీంకోర్టుకు పంపేముందు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తాయి. సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్లు అయిన ముగ్గురు న్యాయమూర్తులు పరిశీలిస్తారు. సుప్రీంకోర్టులో అదే రాష్ట్రానికి చెందిన, లేదంటే ఇదివరకు వారితో కలిసి పనిచేసిన ఇతర న్యాయమూర్తుల అభిప్రాయాలు కూడా స్వీకరిస్తాం. చాలామందికి ఈ విషయం తెలియదు. విభిన్న మార్గాలనుంచి విస్తృతమైన అభిప్రాయాలు సేకరించిన తర్వాతే కొలీజియం ఒక అభిప్రాయానికి వస్తుంది. ఎంపికకు ఇంతకు మించిన ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంటుందని నేను అనుకోను. అంతిమంగా రాష్ట్రపతి పేరుమీద న్యాయమూర్తులను నియమించేది ప్రభుత్వమే. ఇక్కడ ప్రజల నమ్మకమే న్యాయవ్యవస్థకు చోదక శక్తి.
ప్రజల మనిషిని.. వారి మధ్య ఉండడం ఇష్టం
65 ఏళ్లకే న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడం చాలా తొందర అన్నది నా అభిప్రాయం. భారతీయ న్యాయవ్యవస్థలో చేరేటప్పుడే మా రిటైర్‌మెంట్ వయస్సు తెలిసిపోతుంది. నాకు ఇంకా మంచి శక్తి ఉంది. నేను ప్రాథమికంగా ప్రజల మనిషిని. ప్రజల్లో ఉండటాన్ని ఇష్టపడతాను. విద్యార్థి దశనుంచీ నాది అదే గుణం. ప్రజల కోసం నా శక్తి సామర్థ్యాలను ధారపోయడానికి నాకు సరైన అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాను. న్యాయవ్యవస్థ నుంచి పదవీవిరమణ చేసినంత మాత్రాన ప్రజాజీవితం నుంచి పదవీ విరమణ చేసినట్లు కాదు. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, పదవీ విరమణ అనంతరం ఏం చేయాలన్న ఆలోచించే తీరిక ఇప్పుడు లేదు’’ అని జస్టిస్ రమణ చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Antonio Guterres: ఆహార కొరత.. ప్రపంచానికి మహా విపత్తే : ఐరాస చీఫ్ హెచ్చరిక
-
India News
50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Sports News
Bizarre Dismissals: క్రికెట్లో విచిత్రమైన ఔట్లు.. వీటిపై ఓ లుక్కేయండి..!
-
General News
cardiac arrest: అకస్మాత్తుగా గుండె ఆగిపోయినపుడు ఏం చేయాలి..?
-
Politics News
Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
-
World News
Pakistan: పాక్‌లో తీవ్ర పేపర్ కొరత.. విద్యార్థుల పుస్తకాలు ముద్రించలేమని ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Covid Endemic: కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు వచ్చినట్లేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే
- Maharashtra: హోటల్ నుంచి పారిపోయి వచ్చా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- Social Look: నయన్- విఘ్నేశ్‌ల ప్రేమ ‘క్లిక్’.. వేదిక పంచ్!
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- Pawan kalyan: బాలినేనీ.. మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి: పవన్ కల్యాణ్
- Droupadi Murmu: గృహహింసను దాటుకొని, అత్యున్నత పదవికి పోటీలో నిలిచి..!