Tirumala: భక్తకోటికి కొండంత కష్టం

తిరుమల వేంకటేశ్వరస్వామిని కళ్లారా దర్శించి తరించాలని సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు... తితిదే అధికారుల ఘోర వైఫల్యంతో మంగళవారం నరకం కనిపించింది. వేలసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో శ్రీవారి

Updated : 13 Apr 2022 04:40 IST
తిరుమలలో భక్తుల అవస్థలు 
సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట
అయిదుగురికి గాయాలు
అధికారుల నిర్వాకంపై విమర్శలు
ఎట్టకేలకు టోకెన్లు లేకుండా దర్శనానికి తితిదే అనుమతి

ఈనాడు-తిరుపతి,  తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల వేంకటేశ్వరస్వామిని కళ్లారా దర్శించి తరించాలని సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు... తితిదే అధికారుల ఘోర వైఫల్యంతో మంగళవారం నరకం కనిపించింది. వేలసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీకేంద్రాల వద్ద భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గోవిందరాజస్వామి సత్రాల వద్ద టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో అయిదుగురు గాయపడ్డారు. పలువురు భక్తులు స్పృహ కోల్పోయారు. వారిని అంబులెన్సులలో రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. భూదేవి కాంప్లెక్స్‌ వద్ద కూడా తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఊపిరాడక విలవిల్లాడిపోయారు. కొందరు సొమ్మసిల్లిపోయారు. వారిని 108లలో ఆస్పత్రులకు తరలించారు. నిప్పులు చెరుగుతున్న ఎండలో, దాహంతో తడారిపోతున్న గొంతులతో, ఏడుస్తున్న పిల్లా, పాపలతో గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడం... అంతసేపు ఎదురుచూసినా టోకెన్లు దొరుకుతాయో లేదో తెలియని సందిగ్ధత భక్తుల్ని తీవ్ర అసహనానికి గురిచేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలకొద్దీ భక్తులు క్యూలైన్లలో వేచి చూస్తున్నా, తీరిగ్గా ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించారు. చూస్తుండగానే భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. వారు వేచి ఉండేందుకు తగిన ఏర్పాట్లు లేవు. ఎంతసేపటికీ క్యూలైన్లు తరగక సహనం కోల్పోయిన భక్తులు తోసుకురావడంతో... తితిదే భద్రతా సిబ్బంది వారిని నియంత్రించలేకపోయారు. పోలీసులు వచ్చేసరికే పరిస్థితి అదుపు తప్పింది.

రెండు రోజుల నుంచీ వేచి ఉన్నారని తెలిసినా..

తిరుపతిలోని శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌, గోవిందరాజస్వామి సత్రాల్లో ఉచిత దర్శన టోకెన్లు జారీచేస్తున్నారు. రేపటి దర్శనానికి ముందురోజు టోకెన్లు ఇస్తున్నారు. భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటే... ఎల్లుండి దర్శనానికీ ఈరోజు అర్ధరాత్రి నుంచే టోకెన్లు ఇస్తున్నారు. అలా సోమవారం వరకూ టోకెన్లను శనివారమే ఇచ్చేశారు. ఆది, సోమవారాల్లో టోకెన్ల జారీ నిలిపివేశారు. ఆ విషయాన్ని తితిదే ప్రకటించినా... విషయం తెలియని చాలామంది భక్తులు ఆది, సోమవారాల్లో తిరుపతికి చేరుకున్నారు. వారంతా టోకెన్ల కోసం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌తో పాటు గోవిందరాజస్వామి సత్రాల వద్ద వేచి ఉన్నారు. రెండు రోజులపాటు టోకెన్లు జారీ చేయకపోవడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం టోకెన్లు జారీ చేస్తారని తెలిసి.. మరింతమంది తిరుపతి వచ్చారు. ఇలా మూడు రోజుల్లో వచ్చిన భక్తులతో తిరుపతి మంగళవారం కిటకిటలాడిపోయింది. టోకెన్ల జారీ కేంద్రాలకు జనం పోటెత్తారు. చూస్తుండగానే క్యూలైన్లు కిలోమీటర్ల మేర పెరిగిపోయాయి. భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌ వద్ద ప్రవేశమార్గం పూర్తిగా కూలిపోయే పరిస్థితికి చేరింది. పోలీసులు తాడు సాయంతో పడిపోతున్న ఆ ప్రవేశమార్గాన్ని నిలబెట్టారు. భక్తులు ఆగ్రహంతో బారికేడ్లు పీకేశారు. జాలీల్ని తొలగించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచీ టోకెన్లు జారీచేయాల్సి ఉండగా, ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టారు. భక్తులు వేల సంఖ్యలో ఉన్నారని తెలిసినా, తొక్కిసలాట జరగొచ్చని ఊహించడంలో తితిదే అధికారులు విఫలమయ్యారు. బందోబస్తు కోసం పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. పరిస్థితి చేయి దాటుతుండటంతో టోకెన్లు లేకుండానే భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఉదయం 11.30 గంటలకు తితిదే ప్రకటించింది. దాంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు బస్సులు, సొంత వాహనాలు, టాక్సీల్లో కొండపైకి వెళ్లారు.  

అనూహ్య రద్దీతో స్లాటెడ్‌ విధానం రద్దు

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో మంగళవారం అనూహ్య రద్దీ నెలకొనడంతో స్లాటెడ్‌ టోకెన్లను రద్దుచేసి నేరుగా సర్వదర్శనానికి అనుమతించామని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనూహ్య రద్దీతో 2020కి పూర్వం ఉన్న విధానంలోనే టోకెన్లు లేకుండా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి భక్తులను అనుమతించామని తెలిపారు. దర్శనానికి 20-30 గంటల పాటు వేచి ఉండాల్సి ఉంటుందని, తదనుగుణంగా భక్తులు తిరుమలకు రావాలని సూచించారు.


ఆదివారం వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు

శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు తిరుపతిలో సర్వదర్శనం కౌంటర్ల వద్ద భక్తుల రద్దీతో తోపులాటలు చోటుచేసుకున్న నేపథ్యంలో తితిదే బుధవారం నుంచి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దుచేసింది. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసి కొవిడ్‌కు పూర్వం ఉన్న విధానాన్ని పునరుద్ధరించింది. మంగళవారం మొదట టోకెన్లు ఉన్నవారిని, వారి తర్వాత టోకెన్లు లేనివారిని కంపార్ట్‌మెంట్లలోకి అనుమతించారు. టోకెన్ల విధానం తీసేసిన నేపథ్యంలో తిరుమలకు పెద్దసంఖ్యలో చేరుకునే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు తితిదే అధికారులు చర్యలు చేపట్టారు. క్యూలైన్‌లోని వారికి అల్పాహారం, తాగునీరు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తితిదే అధికారులు తెలిపారు.


తలనీలాలైనా సమర్పించుకుంటాం

కొవిడ్‌ కారణంగా ఎప్పటి నుంచో మొక్కులు తీర్చుకోలేదని, తమను తిరుమలకు అనుమతిస్తే స్వామి దర్శనం దొరక్కపోయినా, కనీసం మొక్కులైనా తీర్చుకుంటామని భక్తులు అధికారులను వేడుకున్నారు. వారిలో కొందరు నడకమార్గం ద్వారా కొండపైకి వస్తామని మొక్కుకోగా మరికొందరు తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని