Telangana News: కార్మికులు కావలెను

రాష్ట్రంలో పారిశ్రామికవాడలు కళకళలాడుతున్నాయి. డీజిల్‌, పెట్రోల్‌ ధరల ప్రభావం ఉన్నా.. కరోనా అనంతరం ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 157 పారిశ్రామికవాడల్లో 7.5 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలున్నాయి.

Updated : 14 Apr 2022 04:33 IST

పారిశ్రామికవాడల్లో మానవ వనరుల కొరత

పెద్దసంఖ్యలో ‘వాంటెడ్‌’ బోర్డులు

ప్రస్తుతం పనిచేస్తున్నవారు 10.5 లక్షల మంది

ఇంకా కావాల్సినవారు 5 లక్షల మంది

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో పారిశ్రామికవాడలు కళకళలాడుతున్నాయి. డీజిల్‌, పెట్రోల్‌ ధరల ప్రభావం ఉన్నా.. కరోనా అనంతరం ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 157 పారిశ్రామికవాడల్లో 7.5 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలున్నాయి. గత నాలుగేళ్లలో ప్రభుత్వం కొత్తగా 56 పారిశ్రామిక పార్కులను ప్రారంభించింది. అవసరమైన మేరకు మానవ వనరులు అందుబాటులో లేక పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడుతున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ప్రస్తుతం 10.5 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. మరో 5 లక్షల మంది అవసరం. ఒక్కో చిన్న పరిశ్రమలో ఒకరి నుంచి 20 మంది దాకా కావాలి. వారి కోసం పలు పరిశ్రమల ఎదుట ‘వాంటెడ్‌’ బోర్డులు పెడుతున్నారు.

కనీస విద్యార్హతలుంటే చాలు..

ప్రైవేట్‌ సంస్థలు కావడంతో నియామక వ్యవస్థ లేదు. నేరుగా వచ్చినవారిని, పరిచయం ఉన్నవారిని తీసుకుంటున్నారు. ఏడో తరగతి, ఆపై చదివిన వారికి పరిశ్రమలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఉత్పత్తులు, మెషిన్ల పేర్లు తెలిసేలా, ముద్రించేలా ఆంగ్ల పరిజ్ఞానం ఉండాలి. నెల రోజులపాటు యాజమాన్యాలే పని నేర్పిస్తాయి. ఆ సమయంలో రూ.10 వేల వరకు వేతనం చెల్లిస్తాయి. పనిలో కుదురుకునే కొద్దీ జీతం పెంచుతాయి. మహిళలకూ సూక్ష్మ, చిన్న పరిశ్రమలు అవకాశాలిస్తున్నాయి. గతంలో బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన కార్మికులు పెద్దసంఖ్యలో ఉండేవారు. కరోనా నేపథ్యంలో వారి సంఖ్య కొంచెం తగ్గుతోంది. దీంతో స్థానికులకు అవకాశాలు కల్పించాలని పరిశ్రమల యజమానులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆశించిన స్పందన రావడం లేదంటున్నారు.

10 శాతం మందే పరిశ్రమల్లోకి..

రాష్ట్రంలో 202 పారిశ్రామిక శిక్షణ సంస్థలున్నాయి. మరో 60 పాలిటెక్నిక్‌ కళాశాలలున్నాయి. వీటిలో ఏటా 3 లక్షల మంది ఉత్తీర్ణులవుతున్నారు. వీరిలో 10 శాతం మంది మాత్రమే పరిశ్రమల్లో చేరుతున్నారు

పెద్దఎత్తున ఆర్డర్లు..

రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఫ్యాన్లు, కూలర్లు, గృహోపకరణాలు తదితరాలు పెద్దఎత్తున ఉత్పత్తవుతున్నాయి. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఈసీఐఎల్‌, హిందూస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ వంటివి రాష్ట్రంలోని చిన్న పరిశ్రమలకు పెద్దఎత్తున ఆర్డర్లు ఇస్తున్నాయి. మూడు షిప్టులూ పనిచేస్తున్నా కార్మికుల కొరతతో ఉత్పత్తిలో కొంతమేర జాప్యం జరుగుతోంది. వెల్డింగ్‌, లేత్‌ మిషన్‌ ఆపరేటర్లు, ఇతర సాంకేతిక నిపుణుల కొరత ఉందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.


హెల్పర్లు కావలెను.. వెల్డర్లు, మెషినిస్టులు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, టెక్నీషియన్లు కావలెను.. రాష్ట్రంలోని పారిశ్రామికవాడల్లో ఇలా వందల సంఖ్యలో బోర్డులు కనిపిస్తున్నాయి. పారిశ్రామికరంగం పుంజుకుంటున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో కార్మికులకు భారీగా డిమాండ్‌ ఉంది. ఒక్క చర్లపల్లి పారిశ్రామికవాడలోనే తక్షణం 2 వేల మంది అవసరం.

విష్ణు.. హైదరాబాద్‌లోని చర్లపల్లి పారిశ్రామికవాడలో పారిశ్రామికవేత్త. నెల రోజులుగా పెద్దఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. అవసరమైనంత మంది కార్మికులు లేరు. హెల్పర్లు కావాలంటూ బోర్డు పెట్టారు. అయినా నెల రోజుల నుంచి ఒక్కరూ రావడం లేదు.

శ్రీనివాస్‌ గాంధీనగర్‌లోని తన ప్లాస్టిక్‌ పరిశ్రమను విస్తరించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచి వచ్చిన ఆర్డర్‌ దృష్ట్యా మూడు షిప్టులు నడుపుతున్నారు. 10 మంది కార్మికులున్నారు. మరో 10 మంది అవసరం. హనుమకొండలోని శివరాజ్‌ ప్యాకేజింగ్‌ పరిశ్రమకు ఆర్డర్లు బాగా వస్తున్నా కార్మికుల కొరతతో సకాలంలో ఉత్పత్తులను అందించలేకపోతున్నారు.


జీవితంలో స్థిరపడతాననే నమ్మకం కలిగింది

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివాను. ఉద్యోగం కోసం గల్ఫ్‌ వెళ్లాలని మిత్రులు సూచించారు. అక్కడికి వెళ్లి చిన్న, చిన్న పనులు చేసేకంటే ఇక్కడే స్థిరపడాలనుకున్నాను. గాంధీనగర్‌ పారిశ్రామికవాడలోని ఇంజినీరింగ్‌ పరిశ్రమలో ఇంజినీరుగా చేరాను. మంచి వేతనం లభిస్తోంది. వారం రోజుల్లోనే పని నేర్చుకున్నాను. రెండేళ్లుగా పనిచేస్తున్నాను. మంచి అనుభవం గడించాను. జీవితంలో స్థిరపడతాననే నమ్మకం కలిగింది.

- ఎం.మహేందర్‌


యువతకు మార్గనిర్దేశం చేయాలి

చైనా తరహాలో విద్యార్థులకు పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించాలి. సాంకేతిక విద్యకు పెద్దపీట వేయాలి. పరిశ్రమలు అక్షయపాత్ర వంటివి. ఎందరొచ్చినా ఉద్యోగాలుంటాయి. ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.

- డి.ప్రభాకర్‌, అధ్యక్షుడు, అక్షయ పారిశ్రామిక యజమానుల సంఘం, బాలానగర్‌  


సాంకేతిక విద్యాసంస్థలను అనుసంధానం చేయాలి

ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పారిశ్రామికరంగం పెద్దఎత్తున అభివృద్ధి చెందుతోంది. వేల మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. కొన్ని గంటలు మాత్రమే పనిచేసే అవకాశమున్న సేవారంగం వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పారిశ్రామిక రంగంలోకి ఎక్కువ మంది రావడం లేదు. ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇతర సాంకేతిక విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానం చేయాలి. చదువులో భాగంగా పరిశ్రమల్లో ప్రయోగ శిక్షణ ఇప్పించాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌, ఇతర సంస్థల ద్వారా శిక్షణ ఇప్పిస్తోంది. అలా శిక్షణ పొందిన వారందరూ పరిశ్రమల్లో పనిచేయాలి.

- సుధీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని