Kishan Reddy: ‘ఈనాడు’ను అనుసరించాలి

ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్‌ సందర్భంగా ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనాలను కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అభినందించారు. అమృత్‌ మహోత్సవాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు

Updated : 14 Apr 2022 05:21 IST

అజ్ఞాత సమరయోధుల గురించి మంచి కథనాలు ప్రచురిస్తున్నారు

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశంస

ఈనాడు, దిల్లీ: ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్‌ సందర్భంగా ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనాలను కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అభినందించారు. అమృత్‌ మహోత్సవాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు రెండ్రోజులుగా అమృత్‌సమాగమ్‌ పేరుతో ఇక్కడ నిర్వహిస్తున్న సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.‘‘దేశవ్యాప్తంగా స్వాతంత్య్రం కోసం పోరాడిన అజ్ఞాతయోధులను వెలుగులోకి తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందుకు ప్రజాభాగస్వామ్యమూ అవసరం. దేశంలో అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న పత్రికల్లో ఒకటైన ‘ఈనాడు’ ప్రతి రోజూ ఒక కథనాన్ని ప్రచురిస్తోంది. మిగతా రాష్ట్రాల్లోనూ అక్కడి ప్రాంతీయ, జాతీయపత్రికలు ఇదే తరహాలో ప్రచురించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహోన్నత వ్యక్తుల సమాచారాన్ని వెలికితీసి విస్తృత ప్రచారం కల్పించాలి. ‘నా గ్రామం-నా వారసత్వం’ పేరుతో పల్లెలకున్న వారసత్వ గొప్పతనాన్ని కూడా దేశం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజునే దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌నూ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 75 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో యోగా ఉత్సవాలుంటాయన్నారు. ఆగస్టు 15న ప్రతి వ్యక్తీ 75వ స్వాతంత్య్రదినోత్సవాల్లో పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంటి మీదా త్రివర్ణపతాకం ఎగరేసి జాతీయగీతం ఆలపించాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు.

ఇకనైనా రాజకీయ డ్రామాలకు తెరదించాలి

కల్వకుంట్ల కుటుంబం ఇప్పటికైనా రాజకీయ డ్రామాలు ఆపాలని, లేదంటే ప్రజలే వారి డ్రామాలకు తెరదించేస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ధాన్యం సేకరణ పేరుతో కేసీఆర్‌ రాజకీయ నాటకమాడారు. అందులో భాగంగా రైతు దీక్షలు పెట్టారు. అవి రాజకీయ దీక్షలుగా మారిపోయాయి. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల తరహాలో తెలంగాణ సీఎం కూడా వ్యవహరించి ఉంటే హుందాగా ఉండేది. కానీ ఆయన అందుకు విరుద్ధంగా దిల్లీకొచ్చి కేంద్రంపై సత్యాగ్రహం చేసి రాజకీయ లబ్ధిపొందాలని ప్రయత్నించారు. రైతులు వాస్తవాలు తెలుసుకోవడం వల్ల వారి ఉద్యమాల్లో భాగస్వాములు కాలేదు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని