TTD: ఇక టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనం

టోకెన్లు లభిస్తాయో లేదోనన్న ఆతృతతో భక్తులు క్యూలైన్లలోకి దూసుకెళ్లడంతోనే మంగళవారం తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద గందరగోళం ఏర్పడిందని.. తాము అప్రమత్తమై అరగంటలోనే సమస్యను

Updated : 14 Apr 2022 05:08 IST

అప్రమత్తతతోనే అరగంటలో సమస్య పరిష్కరించాం

తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

ఈనాడు, తిరుపతి: టోకెన్లు లభిస్తాయో లేదోనన్న ఆతృతతో భక్తులు క్యూలైన్లలోకి దూసుకెళ్లడంతోనే మంగళవారం తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద గందరగోళం ఏర్పడిందని.. తాము అప్రమత్తమై అరగంటలోనే సమస్యను పరిష్కరించామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం 15వేల టోకెన్లు జారీచేసే వరకూ ఇబ్బంది లేదని.. 10 గంటల సమయంలో మొదట శ్రీనివాసం కేంద్రం వద్ద సమస్య తలెత్తడంతో భక్తులను నియంత్రించడం కష్టమవుతోందని అధికారులు సమాచారమిచ్చారని తెలిపారు. వెంటనే టోకెన్ల జారీ నిలిపివేసి భక్తులను తిరుమలకు తరలించి వైకుంఠం-2లో పెట్టి దర్శనం చేయించాలని సూచించినట్లు వెల్లడించారు. అరగంటలోనే క్యూలైన్ల నుంచి భక్తులను తరలించినట్లు వెల్లడించారు. ఇకపై టోకెన్లు లేకుండా నేరుగా శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు. బుధవారం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు.

9, 10, 11 తేదీల్లో రద్దీ దృష్ట్యా 8వ తేదీనే టోకెన్లు జారీ చేశాం. మూడు రోజులు ఇచ్చినందున కౌంటర్లు మూసేశాం. తిరిగి మంగళవారం రోజున బుధ, గురు, శుక్రవారాలకు లక్ష టోకెన్లు ఇవ్వాలనుకున్నాం. శనివారం టోకెన్లు దొరకని కొందరు తిరుపతిలోనే ఉండిపోయారు. నాలుగు రోజులు సెలవులుండటంతో మరికొందరు వచ్చారు. మొత్తం మూడు ప్రదేశాల్లో 20వేల మంది ఉన్నారు. శ్రీనివాసంలో రెండు లైన్లున్నాయి. ఒక లైను నుంచి టోకెన్‌ తీసుకుని మరోలైను నుంచి బయటకు రావాలి. భక్తులు బయటకు వెళ్లే లైన్‌లోకి ప్రవేశించి టోకెన్‌ ఇవ్వాలన్నారు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. అందరినీ తీసుకొస్తే 12 కంపార్ట్‌మెంట్లలోనే ఉన్నారు. మంగళవారం ఉక్కపోతకు 15-20 నిమిషాలు ఇబ్బందిపడి ఉంటారు. పాత పద్ధతిలో సర్వదర్శనాన్ని అమలుచేస్తే.. 20, 30, 40 గంటలు ఇబ్బంది పడాలి. ముందస్తు ఏర్పాట్లు చేయకుంటే భక్తులను ఇలా తరలించి దర్శనం చేయించే ఏర్పాట్లు జరిగేవా? మంగళవారం మధ్యాహ్నం నుంచి వచ్చినవాళ్లలో 35వేల మందికి ఎస్‌ఎస్‌డీ దర్శనం చేయించాం. టైమ్‌స్లాట్‌ టోకెన్‌ ద్వారా ఎప్పుడు దర్శనం ఉంటుందో తెలుస్తుంది. గతంలో ఒకోసారి దర్శనానికి 72 గంటలూ పట్టేది. అంతవరకూ క్యూ/కంపార్ట్‌మెంట్లలో ఉండాలి. భక్తులకు మరింత మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ వ్యవస్థను పటిష్ఠం చేయాలని ప్రయత్నించాం. భక్తులకు స్వామివారిని దూరం చేశామనడం తప్పు. ప్రస్తుతం వీఐపీ బ్రేక్‌లను రద్దుచేశాం. వ్యక్తిగతంగా వచ్చే ప్రముఖులకే ఇస్తున్నాం. బుధవారం గంటన్నరలోనే వీఐపీ బ్రేక్‌ పూర్తిచేశాం. శ్రీవారి మెట్టుమార్గాన్ని ఈ నెల 30న  ప్రారంభిస్తాం’ అని ధర్మారెడ్డి చెప్పారు.

30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనానికి తితిదే సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులను అనుమతిస్తుండడంతో పెద్దఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు సర్వదర్శనం టోకెన్లు లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి వచ్చిన దాదాపు 15వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. యాత్రికుల సంఖ్య మేరకు 15 నుంచి 20 గంటల సమయం దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనం క్యూలైన్లను లేపాక్షి కూడలి నుంచి తిరుమల లగేజీ కౌంటర్‌ వరకు పొడిగించారు. లేపాక్షి కూడలి నుంచి సర్వదర్శనం క్యూలైన్లలోకి భక్తులను అనుమతిస్తున్నారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలను తితిదే అన్నప్రసాద విభాగం అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని