Andhra News: కాళరాత్రి

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామంలోని పోరస్‌ కెమికల్స్‌ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు ఆసుపత్రికి

Updated : 15 Apr 2022 05:41 IST

 ఏలూరు జిల్లాలోని పోరస్‌ కెమికల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం  

పెద్ద శబ్దంతో పేలిన రియాక్టర్‌

ఆరుగురి మృతి..

  మృతుల్లో నలుగురు బిహారీలు.. ఇద్దరు తెలుగువారు

మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం

ఈనాడు డిజిటల్‌, ఏలూరు న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామంలోని పోరస్‌ కెమికల్స్‌ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు బిహార్‌ రాష్ట్రానికి చెందినవారు కాగా.. ఇద్దరు తెలుగు వారు.

అక్కిరెడ్డిగూడెంలో నివాసం ఉంటున్న బిహార్‌కు చెందిన మనోజ్‌కుమార్‌ (25), అభిదేశ్‌ రవిదాస్‌ (27), కారు రవిదాస్‌ (40), సుభాష్‌ రవిదాస్‌ (32), కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కుదపకు చెందిన కెమిస్ట్‌ కృష్ణయ్య (36) అక్కడికక్కడే మృతి చెందారు. అక్కిరెడ్డిగూడేనికి చెందిన బొప్పిడి కిరణ్‌కుమార్‌(30) ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించారు.

వెంటిలేటర్‌పై ఏడుగురు.. 

గాయపడినవారికి గొల్లపూడి ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో తీవ్రగాయాలైన ఏడుగురికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా మిగిలినవారికి ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. మూడు, నాలుగు రోజుల పరిశీలన తర్వాతే వారి పరిస్థితి ఏమిటనేది తెలుస్తుందని ఆంధ్రా ఆసుపత్రి వైద్యులు రవీంద్రనాథ్‌ తెలిపారు.

ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత..

గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపించింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించగా, శాశ్వతంగా మూసేయాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.ఎంపీ కోటగిరి శ్రీధర్‌, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు ఫ్యాక్టరీని సందర్శించారు. ఘటనపై విచారణ కమిటీని నియమిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. 

పేలుడా.. లీకేజీనా?..

ఫ్యాక్టరీలో 4 ఎంపీఐ అనే ఓ పౌడర్‌ తయారవుతుంది. దానిని మరో ప్రాంతానికి తరలించి అక్కడ పాలిమర్‌ బాల్స్‌ తయారు చేస్తారు. ఇందుకు బాగా మండే స్వభావమున్న మోనోమిథైల్‌ అమైన్‌ అనే గ్యాస్‌ను ఉపయోగిస్తారు. సిబ్బంది తప్పిదం కారణంగా గ్యాస్‌ లీకై.. ఆ వేడికి మంటలు రేగి ప్రమాదం సంభవించిందనేది ఓ వాదన. రెండో ఫ్లోర్‌లోని రియాక్టర్‌ పేలి.. దానివల్ల భారీగా మంటలు చెలరేగాయనే మరో వాదన వినిపిస్తోంది. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేసుకున్నారు. ఫ్యాక్టరీలో అయిదు బ్లాక్‌లు ఉండగా ప్రస్తుతం మూడే పనిచేస్తున్నాయి. డీ బ్లాక్‌లోని రెండో ఫ్లోర్‌లో పేలుడు జరిగిందని చెబుతున్నారు. ఆ బ్లాక్‌లో పనిచేస్తున్న వారంతా గాయపడ్డారు. కొందరు గోడ దూకి మంటలతోనే తోటల్లోకి పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పై ఫ్లోర్‌లో పనిచేస్తున్న వారిలో అయిదుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది.
పోరస్‌ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్ప గాయాలైనవారికి రూ.2 లక్షల చొప్పున సాయం అందించనున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.కంపెనీ తరపున మరో రూ.25 లక్షలు మృతుల కుటుంబాలకు ఇచ్చేలా వారితో మాట్లాడినట్లు బాధితులను పరామర్శించిన అనంతరం హోంమంత్రి తానేటి వనిత వెల్లడించారు.  అక్కిరెడ్డిగూడెం దుర్ఘటనలో నలుగురు బిహారీలు మృతి చెందడంపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీష్‌ కుమార్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు ఒక్కొక్కరి కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు