Telangana News: వసతుల్లేక సతమతం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే కొనేందుకు సరైన ఏర్పాట్లు లేవు. కొన్నిచోట్ల వడ్లు శుభ్రంచేసే పరికరాలు, తేమ కొలిచే యంత్రాలు, తూకం వేసే కాంటాలు, టార్పాలిన్లు సరిపడా లేకపోవడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు.

Updated : 20 Apr 2022 05:08 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరత
తేమశాతం కొలిచే, ధాన్యం శుభ్రపరిచే పరికరాల లేమి
మార్కెటింగ్‌శాఖకు విన్నపాల వెల్లువ
ఇతర రాష్ట్రాల్లో కొనుగోలుకు యత్నం

ఈనాడు - హైదరాబాద్‌

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే కొనేందుకు సరైన ఏర్పాట్లు లేవు. కొన్నిచోట్ల వడ్లు శుభ్రంచేసే పరికరాలు, తేమ కొలిచే యంత్రాలు, తూకం వేసే కాంటాలు, టార్పాలిన్లు సరిపడా లేకపోవడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. వాటిని వెంటనే కొని పంపాలని పలు జిల్లాల యంత్రాంగాలు రాష్ట్ర మార్కెటింగ్‌శాఖకు ప్రతిపాదనలు పంపుతుండగా, వాళ్లు వాటిని ఆగ్రోస్‌కు పంపుతున్నారు. ఈ ప్రక్రియలో అవి సమకూరేందుకు జాప్యం జరిగే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ దఫా ధాన్యం కొనుగోలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థకు అప్పగించింది. ఆ శాఖ రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనాలంటూ..‘ఇందిరా క్రాంతి పథం’(ఐకేపీ) విభాగానికి చెందిన మహిళా సంఘాలు, సహకారశాఖకు చెందిన ‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల’కు ఆదేశాలిచ్చింది. వాటి దగ్గర అవసరమైన యంత్రాలు, టార్పాలిన్లు లేకపోవడంతో అవి మార్కెటింగ్‌శాఖకు చెందిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను అడుగుతున్నాయి. ఈ కమిటీలకు నేరుగా కొనే అధికారం లేనందున జిల్లా కమిటీలకు చెబుతున్నాయి. ఈ కమిటీలు లెక్కలన్నీ వేసి మార్కెటింగ్‌శాఖ సంచాలకుల రాష్ట్ర కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతున్నాయి. వాస్తవంగా యంత్రాలు కొనుగోలుచేసి జిల్లాలకు పంపేందుకు ‘రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ’(ఆగ్రోస్‌)ను రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. ఆ సంస్థ జిల్లా అధికారులు అడిగిన యంత్రాలను కొని ఏడు రోజుల్లోగా పంపాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఆయా ప్రతిపాదనలను మార్కెటింగ్‌ శాఖ ఆగ్రోస్‌కు పంపుతోంది

ఇప్పటికే కొన్నవి ఏమయ్యాయి?
గత నాలుగేళ్లలో 2.50 లక్షల టార్పాలిన్లు, సేకరణకు సరిపడా ఇతర యంత్రాలు కొని సేకరణ కేంద్రాలకు పంపామని, అవి ఎక్కడున్నాయో లెక్కలు చెప్పకుండా ఇప్పటికిప్పుడు కొత్తవి కావాలంటే ఎలాగని మార్కెటింగ్‌ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ‘‘ఈ దఫా 6,983 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ఇప్పటివరకూ 536 మాత్రమే తెరిచారు. తమకు 1,128 ధాన్యం శుభ్రపరిచే, తేమ శాతం కొలిచే యంత్రాలు కావాలంటూ ఆయా కేంద్రాల నిర్వాహకులు మార్కెటింగ్‌ శాఖకు ప్రతిపాదనలు పంపారు. ధాన్యంలో చెత్త, మట్టిని తొలగించే యంత్రాలను తయారుచేసే కంపెనీలు పంజాబ్‌లో ఉన్నాయి. అక్కణ్నుంచి ఆగ్రోస్‌ తెప్పిస్తోంది. తేమ శాతం కొలిచే యంత్రాలు రాజస్థాన్‌ లేదా గుజరాత్‌ నుంచి తెప్పించాలి. ఇప్పటికిప్పుడు సేకరించడం ఎలా సాధ్యమని’’ అధికారులు వాపోతున్నారు.


సమన్వయమేదీ?

ధాన్యం కొనుగోలు వ్యవహారం పలు ప్రభుత్వ విభాగాలతో ముడిపడి ఉండటం, వాటి మధ్య రాష్ట్రస్థాయిలో సమన్వయం లేకపోవడం వల్ల కూడా సమస్య తలెత్తుతోందనే విమర్శలున్నాయి. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, వాటిలో ఏఏ సదుపాయాలు ఉండాలనే అంశంపై ముందుగా అన్ని శాఖలు చర్చించుకుని అంచనాలు రూపొందిస్తాయి. కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉద్దేశంలేని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా తొలుత కసరత్తు చేయలేదు. ప్రభుత్వ ఆదేశానుసారం హడావుడిగా కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత యంత్రాలు, టార్పాలిన్ల గురించి యంత్రాంగం ఆలోచించడం మొదలుపెట్టడం సమస్యలకు కారణంగా కన్పిస్తోంది.


యంత్రాలేవీ?

ధాన్యంలో తేమ శాతం కొలిచిన తరవాత, దాని ఆధారంగా ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లిస్తుంది. అంటే ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ కొలిచే యంత్రాలు కీలకం. అవే లేవు. ‘అవి వచ్చేవరకూ ధాన్యం కొనేది లేదని కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో రోజుల తరబడి కేంద్రాల వద్దనే పడిగాపులు పడాల్సి వస్తోంది. ఈదురుగాలులతో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. టార్పాలిన్లు కూడా లేనిచోట వర్షం వచ్చి ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు’ అని రైతులు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని