CM KCR: జిల్లాల వారీగా పంటల ప్రణాళిక

రాష్ట్ర వ్యవసాయ రంగం బలోపేతానికి, జిల్లావారీ వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలను  తయారుచేయాలని సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా సాగు విస్తీర్ణం ఉండేలా యంత్రాంగం దృష్టిసారించాలని, ముఖ్యంగా లాభదాయక పంటల సాగు

Updated : 20 Apr 2022 05:58 IST

ఈ వానాకాలం నుంచే అమలు..
ఖరీఫ్‌ సాగుకు ఎరువులు, విత్తనాలు సిద్ధం చేయాలి
 మరింత వేగవంతంగా ‘దళితబంధు’
సమీక్షలో సీఎం కేసీఆర్‌


వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న భారత దేశంలో ఆ రంగం అభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, దాన్ని కుదేలుచేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తోంది. దేశంలో పంటల దిగుబడిని పెంచే దిశగా కాకుండా, ఉత్పత్తిని తగ్గించేలా అపసవ్య విధానాలను అమలు చేస్తుండడం బాధాకరం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుంది. ఆ దిశగా వానాకాలం పంటల సాగుకు ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి, అధికారులకు సూచిస్తున్నా.

- సీఎం కేసీఆర్‌


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవసాయ రంగం బలోపేతానికి, జిల్లావారీ వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలను  తయారుచేయాలని సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా సాగు విస్తీర్ణం ఉండేలా యంత్రాంగం దృష్టిసారించాలని, ముఖ్యంగా లాభదాయక పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రణాళిక తయారీ, అమలులో జిల్లా కలెక్టర్లను, ఆర్డీఓలను కూడా భాగస్వాములను చేయాలని మార్గదర్శనం చేశారు. ఈ వానాకాలం నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. వానాకాలం పంటలకు సంబంధించి ఎరువులు, విత్తనాలు సహా వ్యవసాయశాఖ చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లు, సన్నద్ధతపై ప్రగతి భవన్‌లో మంగళవారం సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పురోగతిపైనా అధికారులను ఆరాతీశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘‘క్రమం తప్పకుండా వరిసాగు చేయడం వల్ల భూసారం తగ్గిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పంట మార్పిడి విధానం అనుసరించేలా రైతులను చైతన్యపరచాలి. ఒకే పంటను సంవత్సరాల తరబడి వేయడం వల్ల నేల సహజ స్వభావం, భూసారం తగ్గుతుందనే విషయాన్ని రైతులకు చెప్పాలి.

లాభదాయక పంటల వైపు మళ్లించాలి
కరోనా అనంతర పరిస్థితులతో చైనా తదితర దేశాల్లో పత్తి దిగుబడి తగ్గిపోతోంది. ఈ క్రమంలో ప్రపంచ మార్కెట్లో తెలంగాణ పత్తికి గిరాకీ పెరుగుతోంది. క్వింటా పత్తి రూ.10 వేల నుంచి 13 వేలదాకా ధర పలుకుతోంది. రానున్న కాలంలో మరింతగా గిరాకీ పెరిగే అవకాశం ఉంది. ఈ సాగు దిశగా రైతులను మరింత ప్రోత్సహించాలి. మిరపకు కూడా ఊహించని రీతిలో క్వింటాకు రూ.42 వేలకు పైగా ధర పలకడం గొప్ప విషయం. మార్కెట్లో డిమాండ్‌ ఉన్నందున కందిసాగు వైపూ రైతులను ప్రోత్సహించాలి. పొద్దు తిరుగుడు సాగు విస్తీర్ణాన్ని పెంచాలి. మొత్తంగా లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలను సిద్ధంచేయాలి.

వ్యవసాయ శాఖ సిబ్బందికి జాబ్‌చార్ట్‌..
జిల్లాస్థాయి వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలి. గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారులు నిరంతరం పొలాల్లో, గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు తగు సూచనలు అందించాలి. ఆ దిశగా వారికి అవగాహన పెంపొందించేందుకు అన్నిస్థాయుల్లో వ్యవసాయ అధికారులకు నిరంతరం శిక్షణ తరగతులను నిర్వహించేలా వ్యవసాయశాఖ మంత్రి చొరవ చూపాలి. వ్యవసాయాధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణపై జాబ్‌చార్ట్‌ తయారుచేయాలి’’ అని సీఎం మార్గదర్శనం చేశారు. కల్తీ విత్తన తయారీదారుల మూలాలను గుర్తించి కట్టడి చేయాలని, అందుకోసం పోలీసు యంత్రాంగం సహకారం తీసుకోవాలని వ్యవసాయశాఖకు సీఎం సూచించారు. ఇప్పట్నుంచే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలన్నారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా వున్న దేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, ఆ రంగాన్ని కుదేలుచేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తోందని ఓ సందర్భంలో సీఎం ఆరోపించారు. దేశంలో పంటల దిగుబడిని పెంచే దిశగా కాకుండా, ఉత్పత్తిని తగ్గించేలా అపసవ్య విధానాలను అమలు చేస్తుండడం బాధాకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు.

దళిత బంధుతో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా అందించే చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టంచేశారు. రోజుకు 400 మందికి చొప్పున ఇప్పటివరకు 25,000 మంది అర్హులైన లబ్ధిదారులకు దళితబంధును అందించామని సీఎం కార్యదర్శి రాహుల్‌ బొజ్జా నివేదిక అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఏడాదికి రెండు లక్షల కుటుంబాలకు దళిత బంధు సాయం అందించేలా చూడాలని ఆదేశాలిచ్చారు. ఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలుచేసేందుకు త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ‘‘దళితబంధు అమలుతో ఊహించినదానికంటే మెరుగైన ఫలితాలు అందుతాయి. పథకం కోసం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి సామాజిక పెట్టుబడిగా మారి వ్యాపార, వాణిజ్యాల పెంపుదలకు దోహదం చేస్తుంది. తద్వారా తిరిగి వచ్చే లాభాలు రాష్ట్ర జీఎస్‌డీపీని పెంపొందించడంలో దోహదపడతాయని’’ సీఎం అన్నారు. ఎరువుల దుకాణాలు వంటి ప్రభుత్వం లైసెన్స్‌ ఇచ్చే ప్రతి విభాగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించి అవకాశాలు మెరుగుపరచాలని మార్గదర్శనం చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
* ధాన్యం సేకరణ పుంజుకుందని, గోనె సంచులు, హమాలీలు, రవాణా వాహనాలు, నిల్వ కేంద్రాలు తదితరాలు సమకూర్చుకున్నామని ధాన్యం సేకరణపై జరిగిన సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ సీఎంకు వివరించారు.  


మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు 

విపరీతమైన ఎరువులు, పురుగుమందుల వాడకంతో భూములు పాడవుతాయి. కొంతమంది రైతులు ఎరువులు ఎక్కువవేస్తే దిగుబడి పెరుగుతుందని అనుకుంటున్నారు. ఎరువు ఏదైనా తగిన మోతాదులోనే వాడాలి. మనం వండిన అన్నమంతా ఒకేసారి తినం కదా. పంటలు కూడా మానవ శరీరం లాంటివే. వాటికి ఎంత ఆహారం అవసరమో అంతే తీసుకుంటాయి. అతిగా తింటే మనుషులకు రోగాలు వచ్చినట్టే, అవసరానికి మించి ఎరువులు చల్లితే ఏపుగా ఎదగాల్సిన పంట ఆగమైతది.  

వెదజల్లే విధానంతో ఖర్చులు తగ్గుతాయి 

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు రానున్న ఏడాదిలో పూర్తవుతాయి. భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయరంగానికి కరవు అనే సమస్యే ఉత్పన్నం కాదు. అందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ నిరంతరం చురుగ్గా ఉండాలి. వ్యవసాయాధికారులు రైతువేదికల ద్వారా రైతులను సమావేశపరిచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వరిసాగులో వెదజల్లే విధానాన్ని మరింతగా ప్రోత్సహించడం ద్వారా రైతుకు అన్ని విధాలుగా ఖర్చు తగ్గించవచ్చు. ఆ పద్ధతిని ప్రోత్సహించాలి.’’ 

- సీఎం కేసీఆర్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని