Telangana News: రబ్బర్‌ స్టాంపును కాను

చెప్పిన వెంటనే సంతకం చేసేందుకు తాను రబ్బర్‌ స్టాంపును కానని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై స్పష్టీకరించారు. తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్లు, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఏడాది పూర్తయిన సందర్భంగా తమిళిసై తన ప్రస్థానం గురించి రాసిన పుస్తకాన్ని మంగళవారం చెన్నైలో ఆవిష్కరించారు.

Updated : 20 Apr 2022 05:06 IST

తెలంగాణలో విధుల నిర్వహణ సవాలే
ఇద్దరు సీఎంలతో కలసి పనిచేస్తున్నా
నా కన్నా సమర్థులెవరు?: తమిళిసై

చెన్నై, న్యూస్‌టుడే: చెప్పిన వెంటనే సంతకం చేసేందుకు తాను రబ్బర్‌ స్టాంపును కానని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై స్పష్టీకరించారు. తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్లు, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఏడాది పూర్తయిన సందర్భంగా తమిళిసై తన ప్రస్థానం గురించి రాసిన పుస్తకాన్ని మంగళవారం చెన్నైలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలనాదక్షత అనేది సాధారణ విషయం కాదని, ఇద్దరు సీఎంలతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. తెలంగాణ సీఎంతో పనిచేయడం సవాల్‌తో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పనిచేస్తే ఎక్కడైనా సులభంగా పనిచేయవచ్చని చమత్కరించారు. గవర్నర్‌, ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని చెప్పడానికి పుదుచ్చేరి నిదర్శనమన్నారు. సీఎం, గవర్నర్‌ మధ్య విభేద] వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని చెప్పడానికి తెలంగాణను ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. రాష్ట్రంలో తాను వెళ్లే ప్రాంతాలకు కలెక్టర్‌, ఎస్పీ కూడా రావడం లేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన కొందరు సీఎంలు నియంతృత్వ బాటలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది తగదని ఆమె హితవు పలికారు. తెలంగాణ సర్కార్‌కు వ్యతిరేకంగా తాను ఏ విధంగానూ వ్యవహరించలేదని చెప్పారు.

ఆ వార్తలు అవాస్తవం: తనను వేరే రాష్ట్రానికి మార్చవచ్చని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదని ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళిసై పేర్కొన్నారు. తన బాధ్యతను నిర్వర్తించడంతో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయని  తెలిపారు. ప్రజలను తరచూ కలవటాన్ని విమర్శిస్తున్నారని, వాటిని దులిపేసుకుని ప్రజాసేవ చేస్తున్నానని పేర్కొన్నారు. సత్తా కలిగిన ఒకరిని తెలంగాణకు గవర్నర్‌గా నియమించనున్నట్టు వదంతులు వ్యాపింపజేస్తున్నారని, మహిళ అంటే బలవంతురాలు కాదా? అని తమిళిసై ప్రశ్నించారు. తన కన్నా సమర్థంగా పనిచేయగల వారిని చూపించగలరా అంటూ ఆమె సవాల్‌ విసిరారు. రాజకీయనేతగా విమర్శలు ఎదుర్కొన్నానని, గవర్నర్‌గా ఉన్నప్పుడూ తప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని