తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనా పిల్లలకు వారసత్వ ఉద్యోగం

ఎవరైనా సింగరేణి ఉద్యోగి అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి అనర్హులైతే సదరు ఉద్యోగి జీవిత భాగస్వామి ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా వారి వారసులకు సింగరేణిలో మళ్లీ

Updated : 21 Apr 2022 10:18 IST

కార్మిక సంఘాలతో సింగరేణి తాజా ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: ఎవరైనా సింగరేణి ఉద్యోగి అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి అనర్హులైతే సదరు ఉద్యోగి జీవిత భాగస్వామి ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా వారి వారసులకు సింగరేణిలో మళ్లీ ఉద్యోగం ఇవ్వడానికి సంస్థ అంగీకరించింది. ఇంకా 8 ఇతర అంశాలపై సహాయ కార్మిక కమిషనర్‌ లక్ష్మణ్‌ సమక్షంలో సింగరేణి యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు మధ్య బుధవారం హైదరాబాద్‌లో చర్చల అనంతరం తాజాగా ఒప్పందం కుదిరింది. ఇటీవల కార్మిక సంఘాల సమ్మె నోటీసుపై దశలవారీగా జరుగుతున్న చర్చలు బుధవారం నాడు సఫలీకృతమయ్యాయి. ఒప్పంద పత్రంపై గుర్తింపు పొందిన యూనియన్‌ టీబీజీకేఎస్‌, ప్రాతినిధ్య సంఘం ఏఐటీయూసీ, జాతీయ సంఘాలైన ఐఎస్టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, బీఎంఎస్‌ నాయకులు, సింగరేణి యాజమాన్యం తరఫున సంచాలకుడు ఎన్‌.బలరామ్‌, జీఎం ఆనందరావు సంతకాలు చేశారు.


ఒప్పందంలోని ప్రధాన అంశాలు  

* తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర బొగ్గుశాఖ మంత్రిని కోరేందుకు ఈ నెలాఖరున లేదా మే మొదటి వారంలో దిల్లీకి వెళ్లే కార్మిక సంఘాల నాయకులకు సహకారం అందించేందుకు యాజమాన్యం సమ్మతి తెలిపింది.

* కరోనా సమయంలో ఏడాదిన్నర పాటు మెడికల్‌ బోర్డు పరీక్షలు నిర్వహించనందువల్ల ఆ సమయంలో 35 ఏళ్లు దాటిన వారసులకు కారుణ్య నియామకంలో ఉద్యోగం ఇస్తారు.

* మణుగూరు ఓపెన్‌ కాస్టు గనిలో డంపర్‌ ప్రమాదం ఘటనలో డిస్మిస్‌ అయిన ఇ.పి. ఆపరేటర్‌ రకీబ్‌ను తిరిగి కిందిస్థాయి ఉద్యోగంలో నియమించేందుకు హామీ ఇచ్చింది.\

* ఎవరైనా సింగరేణి ఉద్యోగి అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి అనర్హులైతే సదరు ఉద్యోగి జీవిత భాగస్వామి ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా వారి వారసులకు సింగరేణిలో మళ్లీ ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించింది.

* మారుపేర్లతో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారి పేర్లను మార్చుకునే అంశాన్ని న్యాయశాఖ సలహా అనంతరం సానుకూల రీతిలో పరిష్కరిస్తామని యాజమాన్యం పేర్కొంది.

* ఈపీ ఆపరేటర్లు, గనుల సిబ్బంది, ట్రేడ్‌మెన్‌లు అనారోగ్య కారణాలతో అనర్హులైతే.. గనుల్లో కాకుండా ఉపరితల కార్యాలయాల్లో అదే ఉద్యోగం ఇచ్చే అంశాన్ని కంపెనీ అంతర్గత కమిటీ పరిశీలనకు పంపి 60 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సంస్థ హామీ ఇచ్చింది.

* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో వేతన ఖాతాలున్న సింగరేణి ఉద్యోగులు ప్రమాదాల్లో మృతిచెందిన పక్షంలో వారి కుటుంబీకులకు రూ.40లక్షల పరిహారం ఇచ్చేలా ఎస్‌.బి.ఐ.తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. పొరుగుసేవల విభాగంలో పనిచేస్తూ కరోనా వల్ల మృతిచెందిన వారి కుటుంబీకులకు రూ.15లక్షల పరిహారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది.

* ఎన్టీపీసీ ప్లాంట్లకు నిరాటంకంగా బొగ్గు సరఫరా చేయాలని ఆ సంస్థ అధికారులు చేసిన వినతిని సింగరేణి సమ్మతించింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని