Telangana News: నలుదిక్కులా వైద్యం

తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ(టిమ్స్‌) ఆసుపత్రుల పరంపరలో మరో అడుగు పడింది. రూ.2,679 కోట్లతో 3 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లో

Published : 22 Apr 2022 05:04 IST

3 టిమ్స్‌లకు రూ.2,679 కోట్లు

ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌లో రానున్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు

  పరిపాలన ఉత్తర్వుల జారీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ(టిమ్స్‌) ఆసుపత్రుల పరంపరలో మరో అడుగు పడింది. రూ.2,679 కోట్లతో 3 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లో రూ.900 కోట్లతో, హైదరాబాద్‌ జిల్లా సనత్‌నగర్‌లో రూ.882 కోట్లతో, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌లో రూ.897 కోట్లతో వీటిని నిర్మించడానికి ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నిర్మాణాలకు టెండర్లు పిలవాలని రోడ్డు భవనాల శాఖను ఆదేశించారు.

13,71,220 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో టిమ్స్‌

ఒక్కో టిమ్స్‌విస్తీర్ణాన్ని 13,71,220 చదరపు అడుగులుగా నిర్ణయించారు. ఇందులో 10,53,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి, 3,17,420 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనుబంధ భవనాన్ని నిర్మిస్తారు. ప్రతి భవనాన్ని ‘టర్న్‌కీ’ ప్రాతిపదికన నిర్మిస్తారు. అంటే భవననిర్మాణంలో సాధారణంగా కల్పించే విద్యుత్‌, శానిటేషన్‌ తదితర వసతులతో పాటు.. వైద్యసేవల్లో వినియోగించే అత్యాధునిక పరికరాల బిగింపునకు వీలుగా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికీ ఈ విధానాన్నే వర్తింపజేశారు.

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లపై తగ్గనున్న భారం

ప్రభుత్వ వైద్య సేవలకు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌ మహానగరంతో పాటు   రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల రోగులు నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపైనే ఆధారపడుతున్నారు. కొత్త ఆసుపత్రుల నిర్మాణంతో నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల రోగులకు మరింత సులభంగా, సత్వరమే స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందనున్నాయి. తద్వారా గాంధీ, నిమ్స్‌, ఉస్మానియా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది.

గోల్డెన్‌ అవర్‌లో చికిత్సకు అవకాశం

శివార్లలో ఏటా వేయికి పైగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల మంది మృత్యువాత పడుతున్నారు. చాలామంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ల్లోని అత్యవసర విభాగాలకు క్షతగాత్రులను చేర్చడానికి 3-4 గంటలకుపైనే పడుతోంది. కొత్త ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే.. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్‌ అవర్‌లో (ప్రమాదం జరిగిన వెంటనే) చికిత్స అందించడం ద్వారా ఎక్కువ మంది ప్రాణాలను కాపాడటానికి వీలవుతుంది.


హైదరాబాద్‌ చుట్టూ...

హైదరాబాద్‌ మహానగరం నలుదిక్కులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. కొవిడ్‌ సమయంలో గచ్చిబౌలి క్రీడా గ్రామంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(టిమ్స్‌) ఆసుపత్రికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్కడ 1500 పడకలు అందుబాటులోకి తెచ్చారు. తాజాగా మరో మూడింటికి పరిపాలన అనుమతులు ఇవ్వడంతో ప్రభుత్వ ప్రకటన ఆచరణలోకి రాబోతోంది. ఈ నాలుగింటికి ప్రభుత్వం స్వయంప్రతిపత్తి కల్పించింది. ఈ నాలుగు సూపర్‌ స్పెషాలిటీలను టిమ్స్‌ పేరిట కొనసాగించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని