డయాబెటిస్‌ను వెల్లడించలేదంటూ పాలసీ తిరస్కరించొద్దు

పాలసీ తీసుకునే ముందు డయాబెటీస్‌ ఉందన్న వాస్తవాన్ని వెల్లడించకపోవడంతో బైపాస్‌ సర్జరీకి పాలసీ సొమ్ము చెల్లించకపోవడంపై ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌

Updated : 23 Apr 2022 07:09 IST

ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని తప్పుబట్టిన రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: పాలసీ తీసుకునే ముందు డయాబెటీస్‌ ఉందన్న వాస్తవాన్ని వెల్లడించకపోవడంతో బైపాస్‌ సర్జరీకి పాలసీ సొమ్ము చెల్లించకపోవడంపై ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తప్పుబట్టింది. డయాబెటీస్‌, అధిక ఒత్తిడిలు గుండె సమస్యలకు కారణం కాదని, వైద్య ఖర్చులు రూ.2.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2013లో రంగారెడ్డి జిల్లాకు చెందిన వి.హరిశ్చంద్రారెడ్డి రూ.5 లక్షలకు హెల్త్‌ పాలసీ తీసుకున్నారు. 2014లో బైపాస్‌ సర్జరీ చేయించుకోగా రూ.4.5 లక్షలు ఖర్చయింది. ఈ మొత్తానికి క్లెయిం కోరినా, వినతి పత్రం, నోటీసు ఇచ్చినా స్పందించకపోవడంతో అనైతిక వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతోందని, సేవాలోపమంటూ ఆయన జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. అన్ని రికార్డులను పరిశీలించిన జిల్లా ఫోరం రూ.2.5 లక్షలతో పాటు ఖర్చుల కింద రూ.3 వేలు చెల్లించాలని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అప్పీలు దాఖలు చేయగా.. రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ ఎమ్మెస్కే జైశ్వాల్‌, సభ్యులు మీనా రామనాథన్‌, కె.రంగారావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. బీమా కంపెనీ ఆసుపత్రి జారీ చేసిన డిశ్చార్జి వివరణపై ఆధారపడి, పాలసీ తీసుకోక ముందు నుంచి ఉన్న డయాబెటీస్‌, అధిక ఒత్తిడిల గురించి చెప్పలేదంటూ పాలసీని తిరస్కరించిందని తెలిపింది. అయితే గుండె సమస్యలకు డయాబెటీస్‌ కారణం కాదంది. అంతేగాకుండా పాలసీ తీసుకున్న ఏడాది తరవాత గుండె సమస్యలు ఎదురవడంతో తనంతట తానుగా ఆసుపత్రిలో చేరారన్నారు. అందువల్ల గతంలో ఉన్న డయాబెటీస్‌ను వెల్లడించలేదన్న ఒక్క కారణంగా పాలసీని తిరస్కరించరాదని తేల్చి చెప్పింది. జిల్లా ఫోరం ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు లేవంటూ అప్పీలును కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని