PM Modi: మీ తల్లిదండ్రుల కష్టాలు మీకు రానివ్వను

జమ్మూ-కశ్మీర్‌లో క్షేత్రస్థాయికి ప్రజాస్వామ్యం చేరుకుందని, గత రెండు మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ప్రాంతం ప్రగతి పథంలో పయనిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం’ సందర్భంగా

Updated : 25 Apr 2022 06:02 IST

కశ్మీర్‌ యువతకు ప్రధాని భరోసా

పల్లీ(సాంబా): జమ్మూ-కశ్మీర్‌లో క్షేత్రస్థాయికి ప్రజాస్వామ్యం చేరుకుందని, గత రెండు మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ప్రాంతం ప్రగతి పథంలో పయనిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం’ సందర్భంగా ఆదివారం మోదీ.. జమ్మూ-కశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని పల్లీ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ 500 కిలోవాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో ఆ గ్రామం దేశంలోని తొలి కర్బన రహిత పంచాయతీగా నిలిచింది. గ్రామవాసులకు ప్రధాని అభినందనలు తెలిపారు. అక్కడి నుంచే దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. 2019లో జమ్మూ-కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించే 370వ అధికరణం ఉపసంహరించిన తర్వాత మోదీ ఈ ప్రాంతంలో పూర్తిస్థాయిలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సుమారు రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. జమ్మూ-శ్రీనగర్‌ మధ్య దూరాన్ని తగ్గించే బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ మార్గాన్ని పల్లీ గ్రామం నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు. చీనాబ్‌ నదిపై రెండు జల విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. భూమిపై యాజమాన్య హక్కులు కల్పించే ‘స్వామిత్ర’ కార్డులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌ లోయలోని యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ తల్లిదండ్రులు, తాతలు ఎన్నో కష్టాలు పడ్డారు. మీకు ఆ కష్టాలు రానివ్వను. నాదీ భరోసా’’ అని ప్రధాని హామీ ఇచ్చారు. త్వరితగతిన జరుగుతున్న అభివృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పెట్టుబడులకు కశ్మీర్‌ స్వర్గధామంగా మారిందని అన్నారు. గత ఏడు దశాబ్దాల్లో రూ.17 వేల కోట్ల పెట్టుబడులు వస్తే.. గడిచిన రెండేళ్లలోనే రూ.38 వేల కోట్లు వచ్చాయని చెప్పారు. 370వ అధికరణ రద్దుతో ప్రజలకు మేలు కలిగించే 175 కేంద్ర చట్టాలు జమ్మూ-కశ్మీర్‌లో అమలయ్యేలా చూశామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని