Yadadri: వైభవంగా యాదాద్రి శివాలయ ఉద్ఘాటన

యాదాద్రిలో స్మార్త ఆగమశాస్త్రం ప్రకారం పునర్నిర్మించిన శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటన పర్వం సోమవారం వైభవోపేతంగా నిర్వహించారు. ఆరు రోజులుగా శివాలయంలో నిర్వహిస్తున్న మహాకుంభాభిషేకంలో

Updated : 26 Apr 2022 04:08 IST

మహాకుంభాభిషేకంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ దంపతులు
మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో క్రతువు

ఈనాడు, నల్గొండ- న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట: యాదాద్రిలో స్మార్త ఆగమశాస్త్రం ప్రకారం పునర్నిర్మించిన శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటన పర్వం సోమవారం వైభవోపేతంగా నిర్వహించారు. ఆరు రోజులుగా శివాలయంలో నిర్వహిస్తున్న మహాకుంభాభిషేకంలో చివరి రోజైన సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌, శోభ దంపతులు పాల్గొన్నారు. శ్రీరాంపురం(తొగుట) పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ఉద్ఘాటన పర్వాలు చేపట్టారు. ఆలయ ప్రధాన రాజగోపురం, విమాన గోపురం, ఉపాలయాలు, కల్యాణ మండపంపై స్వర్ణకలశాల ప్రతిష్ఠతో పాటు ప్రధానాలయ ముఖమండపంలో స్ఫటికలింగ ప్రతిష్ఠాపన చేశారు. స్ఫటికలింగానికి కేసీఆర్‌ దంపతులు పంచామృతంతో అభిషేకం చేశారు. బిల్వపత్రాలతో స్వామికి అర్చన చేశారు. శివాలయ పూజారులు ముఖ్యమంత్రి దంపతులను పట్టువస్త్రాలతో సత్కరించి.. వేదాశీర్వచనం చేశారు.

కనులపండువగా శోభాయాత్ర

అంతకుముందు శివాలయ బాలాలయం నుంచి ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర మొదలైంది. పునర్నిర్మితమైన ఆలయం వరకు కనులపండువగా సాగింది. శోభాయాత్ర ఆలయానికి చేరడంతో మాధవానంద సరస్వతి స్వామి ఉద్ఘాటన మహాక్రతువుకు శ్రీకారం చుట్టారు. మహాకుంభాభిషేక మహోత్సవం మహాపూర్ణాహుతితో ముగిసింది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు విప్‌, స్థానిక ఎమ్మెల్యే సునీత పాల్గొన్నారు. మాధవానంద సరస్వతికి ముఖ్యమంత్రి దంపతులు గురువందనం చేశారు. ఆలయం పక్షాన సత్కరించారు. ఆలయ ప్రధాన స్థపతి అయిన బాలసుబ్రహ్మణ్యంకు కేసీఆర్‌ స్వర్ణకంకణ ధారణ చేశారు. ఉద్ఘాటన క్రతువు ముగిశాక శాంతి కల్యాణం, ప్రదోష పూజ నిర్వహించి భక్తులను స్వామి దర్శనాలకు అనుమతించారు. ఆలయ గోపురాలపై చేపట్టిన ప్రతిష్ఠాపర్వంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డితో పాటు విప్‌ సునీత, ఎంపీ సంతోష్‌కుమార్‌, జడ్పీ ఛైర్మన్‌ సందీప్‌రెడ్డి, దేవాదాయ కమిషనర్‌ ఆనిల్‌కుమార్‌, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కలెక్టర్‌ పమేలా సత్పతి, రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, యాడా వైస్‌ఛైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ఈవో గీత, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్త, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వయంభువులను దర్శించుకున్న సీఎం

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి యాదాద్రికి చేరుకున్నారు. తొలుత ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు వెళ్లి అక్కడి నుంచి సంప్రదాయ దుస్తుల్లో సతీసమేతంగా కొండపైకి చేరుకున్నారు. తొలుత గర్భాలయంలోని పంచనారసింహుల స్వయంభువులను దర్శించుకున్నారు. స్వర్ణ పుష్పార్చనతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మహాముఖ మండపంలో సీఎం దంపతులకు పండితులు, పూజారులు వేదాశీర్వచనం చేశారు. శివాలయ ఉద్ఘాటన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో భోజనం చేసి.. మధ్యాహ్నం 3.15 గంటలకు వ్యవసాయ క్షేత్రానికి తిరుగుపయనమయ్యారు.

సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆటో కార్మికులతో పాటు పలు వర్గాలవారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

కాన్వాయిలో వాసాలమర్రి సర్పంచి

రాష్ట్రంలోనే తొలిసారి దళితబంధు పథకం ప్రారంభించిన తన దత్తత గ్రామం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి మరో పది రోజుల్లో వస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్లు తెలిసింది. వ్యవసాయ క్షేత్రం నుంచి యాదాద్రికి వస్తూ మార్గంమధ్యలో వాసాలమర్రి సర్పంచి పోగుల ఆంజనేయులును తన కాన్వాయ్‌లో యాదాద్రికి తీసుకొచ్చారు. గ్రామాభివృద్ధికి ఇంకా ఏం చేయాలో క్షేత్రస్థాయిలో పర్యటించి నాలుగైదు రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతిని ఆదేశించినట్లు తెలిసింది. పది రోజుల్లో గ్రామంలో పర్యటించి మిగిలిఉన్న పనులనూ పూర్తి చేసుకుందామని సర్పంచితో ఆయన చెప్పినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని