TRS Plenary: పేదలను దంచాలి.. పెద్దలకు పంచాలి

కేంద్రం సెస్‌ల రూపంలో పన్నులు వసూలు చేయడం మానుకోవాలని, ఈ విధానంతో రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్లీనరీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి

Updated : 28 Apr 2022 06:52 IST

ఇదే భాజపా తీరు

రాష్ట్రాల ఆదాయానికి ‘సెస్‌’ గండి

తెరాస ప్లీనరీలో హరీశ్‌రావు ధ్వజం

కేంద్రం సెస్‌ల రూపంలో పన్నులు వసూలు చేయడం మానుకోవాలని, ఈ విధానంతో రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్లీనరీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం సంపదను పేదలకు పంచుతుంటే కేంద్రంలో భాజపా సర్కారు పేదలను దంచాలి..పెద్దలకు పంచాలి అన్నట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘‘జన్‌ధన్‌ ఖాతాలు తెరిపించారు.పేదల ఖాతాల్లో డబ్బులు వేశామన్నారు. ఒక్క రూపాయి వేయలేదు. నల్ల చట్టాలు తెచ్చి వడ్లు కొనబోమని రైతుల ఉసురుపోసుకుంటోంది కేంద్రం. వారి దృష్టిలో టీం ఇండియా అంటే భాజపా పాలిత రాష్ట్రాలే. గతంలో యూపీఏ హయాంలో 10 శాతం వరకూ సెస్‌ వసూలు చేస్తే ఇప్పుడు 20 శాతానికి పెంచారు. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41% వాటా రాష్ట్రానికి రావాల్సి ఉంటే సెస్‌ రూపంలో పరోక్షంగా కేంద్రం తీసుకుంటున్నదాన్ని తీసివేస్తే చివరికి 29.5 శాతమే వస్తున్నట్లు తేలింది. మరోవైపు భాజపా ప్రభుత్వం అమ్మిన ప్రభుత్వ రంగ సంస్థల విలువ రూ.మూడున్నర లక్షల కోట్లు. రైళ్లు, స్టేషన్లు, లైన్లు అమ్ముడు. ఉద్యోగాలు తీసుడు. భాజపా చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేదు.భాజపా సిద్ధాంతం అంటే బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రాలు.

రాష్ట్రానికో నీతి కేంద్రానికో రీతా?

అప్పులు ఎంత తీసుకోవాలనే అంశంపై ద్రవ్య వినిమయ చట్టం (ఎఫ్‌.ఆర్‌.బి.ఎం) పేరుతో పెట్టిన నిబంధన అమల్లో రాష్ట్రానికో నీతి కేంద్రానికో రీతి. కేంద్రం 9.5శాతం వరకూ రుణాలు తీసుకోవచ్చట....రాష్ట్రాలు మాత్రం 4 శాతం దాటొద్దట. దేశం ముందుకు వెళ్లాలి అంటే.. కేసీఆర్‌ నాయకత్వంలో ఎజెండా సిద్ధం కావాలి. తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్లు.. మిషన్‌ భగీరథ, కల్యాణలక్ష్మి వంటి పథకాలను ఇతర రాష్ట్రాల ప్రజలూ కోరుతున్నారు. పక్క రాష్ట్రాల భాజపా ఎమ్మెల్యేలు కూడా ఇవి కావాలని మాట్లాడుతున్నారు’’ అని హరీశ్‌రావు అన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని