CM KCR: విపక్ష రాష్ట్రాలపై వివక్ష

కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తుతూ త్వరలోనే భాజపాయేతర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలని తెలంగాణ, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, హేమంత్‌ సోరెన్‌లు

Updated : 29 Apr 2022 05:56 IST

భాజపా రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యం..

దీనిపై ఎదురుదాడి చేయాల్సిందే

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల అభ్యర్థి ప్రతిపాదన

ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఝార్ఖండ్‌ సీఎం సోరెన్‌ల భేటీలో చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తుతూ త్వరలోనే భాజపాయేతర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలని తెలంగాణ, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, హేమంత్‌ సోరెన్‌లు నిర్ణయించినట్లు తెలిసింది. భాజపా పాలిత రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యమిస్తుందని.. ఇతర పార్టీలు అధికారంలో ఉన్నచోట అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని వారు చర్చించుకున్నట్లు సమాచారం. దీనిపై భాజపాయేతర రాష్ట్రాలు ఏకమై కేంద్రాన్ని ఎదిరించాల్సిందేనని మాట్లాడుకున్నట్లు తెలిసింది. దీంతో పాటు రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల తరఫున అభ్యర్థిని నిలిపి, సత్తా చాటాలని చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం హైదరాబాద్‌ వచ్చిన ఝార్ఖండ్‌ సీఎం సోరెన్‌... సాయంత్రం ప్రగతిభవన్‌కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, భవిష్యత్తు కార్యాచరణ సహా ఇతర అంశాలపై ఇరువురూ చర్చించారు. గత నెల 4న ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో కేసీఆర్‌ పర్యటించి సోరెన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే.

భాజపా వ్యతిరేక వైఖరే ఎజెండా
ఈ సందర్భంగా కేంద్రంలోని భాజపా వైఖరి గురించి విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తోన్నారని, దేశంలోని ఇతర పార్టీలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని, నిధులు, ప్రాజెక్టుల విషయంలోనూ దారుణంగా వివక్ష చూపుతున్నారని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రధాని హోదాను మరిచి రాష్ట్రాలను బద్నాం చేసేందుకు ప్రయత్నించడం గతంలో దేశ చరిత్రలో ఎప్పుడూ లేదని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ల ద్వారా పెత్తనం చెలాయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం కేసీఆర్‌ మాట్లాడుతూ ‘‘దేశహితం కోసం గాకుండా ప్రధాని సొంత ఎజెండాను పార్టీ ఎజెండాగా తెరమీదికి తెచ్చి దేశంలో కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ఏ ఒక్క నిర్ణయం జాతికి అనుకూలంగా లేదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు వెళ్లి తమ పార్టీ గెలవాలనే సంకల్పంతో రూ.వేల కోట్లతో పనులు చేపడుతున్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుదలకు కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. సెస్‌ల రూపంలో ప్రజలపై పెనుభారం వేశారు. నిజాన్ని అంగీకరించకుండా రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని చెప్పడం సిగ్గుచేటు. యూపీ, సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఇంధన ధరలు పెరగకపోవడానికి నిజమైన కారణాలను మోదీ జాతికి సమాధానం చెప్పాలి. రైతుల బాగు గురించి మోదీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణలో ధాన్యం రైతుల సమస్య సందర్భంగా రుజువైంది’’ అని పేర్కొన్నట్లు తెలిసింది. హేమంత్‌ మాట్లాడుతూ ‘‘మోదీలో అధికార కాంక్ష తప్ప మరొకటి కనిపించడం లేదు. ఇలాంటి ప్రధాని ఉండడం దేశానికి మేలు చేయదు. కేంద్రం మద్దతు వల్ల భాజపా పాలిత రాష్ట్రాల్లో మతపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి’ అని పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రాలను నష్టపరుస్తున్న కేంద్రం వైఖరిపై ఎదురుదాడి చేయాలని.. దీనిపై సమగ్ర కార్యాచరణ అవసరమని, భాజపాయేతర రాష్ట్రాలు గళం విప్పితేనే కేంద్రం దుందుడుకు విధానాలు, చర్యలకు అడ్డుకట్ట పడుతుందనే భావాన్ని ఇద్దరూ వ్యక్తంచేసినట్లు సమాచారం. ఎన్డీయేకు సంపూర్ణ మెజారిటీ లేదు. విపక్షాల బలమే ఎక్కువగా ఉందని, తామందరం రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే భాజపా కంగుతింటుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. భాజపాయేతర సీఎంల సమావేశంపై త్వరలోనే ఆయా సీఎంలతో మాట్లాడాలనే అభిప్రాయం వ్యక్తమైంది. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ గురించి చర్చ జరిగినట్లు తెలిసింది. దేశ పరిణామాలపై కాంగ్రెస్‌ అనుకున్న రీతిలో స్పందించడం లేదని, సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. అంతకు ముందు హేమంత్‌ ప్రగతిభవన్‌కు వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. పోచంపల్లి శాలువాతో సత్కరించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని