TS Exams 2022: 2 శాఖలు.. 677 పోస్టులు

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ పరంపర కొనసాగుతోంది. రవాణా, ఆబ్కారీశాఖల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి గురువారం రెండు వేర్వేరు

Updated : 29 Apr 2022 05:51 IST

ఆబ్కారీ, రవాణాశాఖల్లో కానిస్టేబుళ్ల భర్తీకి శ్రీకారం

పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ పరంపర కొనసాగుతోంది. రవాణా, ఆబ్కారీశాఖల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి గురువారం రెండు వేర్వేరు ప్రకటనలు జారీ చేసింది. రవాణాశాఖలో ప్రధాన కార్యాలయం (హెచ్‌.ఒ.)లో 6, లోకల్‌ క్యాడర్‌ (ఎల్‌.సి.)లో 57 మొత్తం 63 పోస్టుల భర్తీకి మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. ఆబ్కారీశాఖలో 614 పోస్టుల భర్తీకి మరో ప్రకటన విడుదల చేశారు. రెండు శాఖల్లో కలిపి 677 పోస్టులు భర్తీ చేయనున్నారు. కానిస్టేబుల్‌ పోస్టులన్నింటికీ వయసు, విద్యార్హతలు పోలీసుశాఖలో మాదిరిగానే అంటే 18 ఏళ్లు నిండి, 22 ఏళ్లు మించకుండా, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. మిగతా అర్హతలు కూడా పోలీసు కానిస్టేబుల్‌కు వర్తించేవే వీటికీ ఉంటాయి. అయితే రవాణాశాఖలో కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి లైట్‌ మోటార్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. కంటిచూపు పూర్తిస్థాయిలో ఉండాలి. రవాణా, ఆబ్కారీశాఖల్లో కానిస్టేబుల్‌ పోస్టులకు స్థానిక ఓసీ, బీసీ కులాల వారైతే రూ.800, ఎస్సీ ఎస్టీలైతే రూ.400, స్థానికేతరులు ఎవరైనా రూ.800 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఇతర వివరాలన్నీ www.tslprb.in వెబ్‌సైట్లో పొందుపరిచామని శ్రీనివాసరావు వెల్లడించారు. దరఖాస్తు చేసుకొనే ముందు అన్ని వివరాలు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని, ముఖ్యంగా ఆయా పోస్టులకు తగిన అర్హతలున్నవారే దరఖాస్తు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు కూడా మే 2 నుంచి 20వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రకటనలతో పోలీసు నియామక మండలి జారీ చేయనున్న ఉద్యోగ ప్రకటనల ప్రక్రియ పూర్తయింది. పోలీసు, జైళ్లు, ప్రత్యేక భద్రతా దళం, అగ్నిమాపక శాఖల్లో ఖాళీల భర్తీకి గత సోమవారం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని