సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా సీహెచ్‌.రమేశ్‌బాబు

రాష్ట్రవ్యాప్తంగా 55 మంది జిల్లా జడ్జీలను బదిలీచేస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం కామారెడ్డి 9వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జిగా ఉన్న సీహెచ్‌.రమేశ్‌బాబును సీబీఐ ప్రత్యేక ప్రధాన కోర్టు జడ్జిగా బదిలీ చేసింది.

Updated : 30 Apr 2022 05:32 IST

55 మంది జిల్లా న్యాయమూర్తులను బదిలీ చేసిన హైకోర్టు
జగన్‌ కేసుల్లో విచారణ మళ్లీ మొదటికి?

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా 55 మంది జిల్లా జడ్జీలను బదిలీచేస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం కామారెడ్డి 9వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జిగా ఉన్న సీహెచ్‌.రమేశ్‌బాబును సీబీఐ ప్రత్యేక ప్రధాన కోర్టు జడ్జిగా బదిలీ చేసింది. ఆ స్థానంలో ఉన్న బి.ఆర్‌.మధుసూదన్‌రావును వ్యాట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఇ.తిరుమలదేవి జ్యుడిషియల్‌ అకాడమీకి బదిలీ అయ్యారు. సంగారెడ్డి జిల్లా జడ్జి బి.పాపిరెడ్డి..నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా, ప్రస్తుతం జ్యుడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న సి.హెచ్‌.కె.భూపతి రంగారెడ్డి జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. బదిలీ అయిన వారంతా 4వతేదీ లోగా ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలను ఇతరులకు అప్పగించి కొత్త బాధ్యతలను తీసుకోవాలంటూ రిజిస్ట్రార్‌ (విజిలెన్స్‌) ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మళ్లీ మొదలా?

జగన్‌ అక్రమాస్తుల కేసులను విచారిస్తున్న బి.ఆర్‌.మధుసూదన్‌రావు బదిలీ అయిన నేపథ్యంలో విచారణ మళ్లీ మొదటికి రానుంది. ప్రజాప్రతినిధులకు చెందిన కేసులపై సత్వరం విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సీబీఐ కోర్టులో రోజువారీ విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం 11 కేసుల్లో ఉన్న పలువురు నిందితుల డిశ్ఛార్జి పిటిషన్‌లపై వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఒక్కదానిలోనూ వాదనలు పూర్తికాలేదు. 2012లో నమోదైన కేసులన్నీ డిశ్ఛార్జి పిటిషన్‌లు, అభియోగాల నమోదు ప్రక్రియలోనే ఉన్నాయి. మరోవైపు 2019 ఫిబ్రవరిలో సీబీఐ కోర్టు జడ్జిగా నియమితులైన బి.ఆర్‌.మధుసూదన్‌రావు జగన్‌ కేసులపై ప్రతి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో పలు కేసుల తాలూకూ డిశ్ఛార్జి పిటిషన్‌లలో నిందితుల తరఫు వాదనలు పూర్తయ్యాయి. సీబీఐ వాదనలు వినాల్సి ఉంది. ఈ దశలో న్యాయమూర్తి బదిలీ కావడం విచారణపై ప్రభావం చూపనుంది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంతోపాటు ఓబుళాపురం గనులు, ఎమ్మార్‌ వివాదంపై సీబీఐ నమోదు చేసిన కేసులతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదుచేసిన వాటిపైనా విచారణ మొదటికొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని