దరఖాస్తుకు వేళాయె

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. తెలంగాణ తొలి గ్రూప్‌-1, పోలీస్‌, ఇతర విభాగాల యూనిఫాం పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. గ్రూప్‌-1 పోస్టులకు మే 2 నుంచి 31 వరకు, పోలీసు,

Published : 01 May 2022 03:15 IST

రేపటి నుంచి గ్రూప్‌-1, పోలీస్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో స్వీకరణ
గ్రూప్‌-1కు మే నెలాఖరు, యూనిఫాం పోస్టులకు 20 వరకు గడువు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. తెలంగాణ తొలి గ్రూప్‌-1, పోలీస్‌, ఇతర విభాగాల యూనిఫాం పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. గ్రూప్‌-1 పోస్టులకు మే 2 నుంచి 31 వరకు, పోలీసు, ఇతర యూనిఫాం పోస్టులకు మే 2 నుంచి 20 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. ఆన్‌లైన్లో దరఖాస్తులను స్వీకరించేందుకు టీఎస్‌పీఎస్సీ, పోలీస్‌ నియామక బోర్డు ఏర్పాట్లు చేస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు లింకును అందుబాటులోకి తీసుకురానున్నాయి. దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే ఉద్యోగ ప్రకటనల్లో స్పష్టత ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ జారీచేసిన ఉద్యోగాల ప్రకటనలకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఓటీఆర్‌లో సవరణ చేసుకున్న, కొత్తగా నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే అర్హులని కమిషన్‌ తెలిపింది. శనివారం నాటికి 2.2 లక్షల ఓటీఆర్‌లు నమోదయ్యాయి. ఓటీఆర్‌లో, దరఖాస్తు ప్రక్రియలో వివరాలన్నీ సక్రమంగా నమోదు చేయాలని, పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలని సూచించింది.

గ్రూప్‌-1 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇలా...

503 గ్రూప్‌-1 పోస్టులకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో లింకు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం సవరణ చేసిన, కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసిన టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ నమోదు చేయాలి. అనంతరం మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన వెంటనే దరఖాస్తు చేసేందుకు అవకాశం వస్తుంది.

ఓటీఆర్‌ డేటాబేస్‌ ప్రకారం పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, కమ్యూనిటీ తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. ఈ వివరాలు సరైనవేనని నిర్ధారిస్తే ‘కన్ఫర్మ్‌’పై క్లిక్‌ చేయాలి. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉన్నాయని భావిస్తే ‘నో’పై క్లిక్‌ చేయాలి. దీంతో ఓటీఆర్‌ విండో తెరుచుకుంటుంది. అందులో వివరాలు నమోదు చేసి, సబ్మిట్‌ చేస్తే తిరిగి అప్లికేషన్‌ వస్తుంది. ఆ తరువాత ‘కన్ఫర్మ్‌’పై క్లిక్‌ చేయాలి.

ఓటీఆర్‌ వివరాలకు అదనంగా నోటిఫికేషన్‌ ప్రకారం విద్యార్హతలు, ప్రాధాన్యక్రమంలో పరీక్ష కేంద్రాల నమోదు.. విద్యార్హతలు, వయోపరిమితి ఆధారంగా పోస్టుల ప్రాధాన్యం తదితర వివరాలు పూర్తి చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తును ‘సేవ్‌’ చేసి, ‘కన్ఫర్మ్‌’పై క్లిక్‌ చేయాలి. ఈ ప్రక్రియ అనంతరం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రాసెస్‌ రుసుము, పరీక్ష ఫీజు..

అభ్యర్థులందరూ తప్పనిసరిగా దరఖాస్తు ప్రాసెస్‌ రుసుము రూ.200, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. పరీక్ష ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు టీఎస్‌పీఎస్సీ మినహాయింపు ఇచ్చింది. 18-44 ఏళ్లలోపు నిరుద్యోగ అభ్యర్థులూ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే తాము నిరుద్యోగులమంటూ డిక్లరేషన్‌ సమర్పించాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు లేదని కమిషన్‌ స్పష్టం చేసింది. దరఖాస్తు ప్రాసెస్‌ రుసుము, పరీక్ష ఫీజును నెట్‌బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, టీ-వ్యాలెట్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన అనంతరం దరఖాస్తు ‘పీడీఎఫ్‌’ కాపీని భద్రపరచుకోవాలి. దరఖాస్తు రిఫరెన్స్‌ ఐడీ తదుపరి సంప్రదింపులకు ఉపయోగపడుతుంది.

ప్రిలిమినరీకి 12 పరీక్ష కేంద్రాలు..

ప్రిలిమినరీ పరీక్షకు ప్రతి అభ్యర్థి 12 జిల్లా పరీక్ష కేంద్రాలను ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఈ పరీక్ష అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. పరీక్ష కేంద్రాల కేటాయింపు అధికారం కమిషన్‌కు ఉంటుంది. ఒకసారి కేటాయించిన తరువాత మార్పులకు అవకాశం ఉండదు.

పోలీస్‌ ఉద్యోగాలకు..

పోలీస్‌, ఎస్పీఎఫ్‌, ఫైర్‌, జైల్‌, ఎక్సైజ్‌, రవాణా శాఖల్లోని ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న జారీ అయిన నాలుగు నోటిఫికేషన్లతోపాటు 28న జారీ అయిన రెండు నోటిఫికేషన్లకు సంబంధించి 17,291 పోస్టుల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు మే 2 ఉదయం 8 గంటల నుంచి మే 20 రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు సూచించారు. దరఖాస్తుల కోసం ‌www.tslprb.in  వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts