Beer: బీరే కదా అనుకోవద్దు.. ఆరోగ్యంతో ఆటలొద్దు!

ఎండలు మండిపోతుండడంతో.. ఉపశమనం కోసం అత్యధికులు బీరు తెగ తాగేస్తున్నారు. గత ఏడాది తొలి నాలుగు నెలల్లో 1,06,42,143 పెట్టెల బీరు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి- ఏప్రిల్‌ వరకూ రాష్ట్రంలో 1,49,17,004 పెట్టెల సీసాలు అమ్ముడయ్యాయి. అంటే 45 శాతానికిపైగా బీరు విక్రయాలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Updated : 02 May 2022 06:33 IST

 డీహైడ్రేషన్‌, మానసిక అసమతుల్యత సమస్యలు

స్థూలకాయం, కాలేయానికి ముప్పు తప్పదంటున్న నిపుణులు

గతేడాదితో పోల్చితే 45 శాతానికి  పైగా పెరిగిన అమ్మకాలు

ఈనాడు - హైదరాబాద్‌

ఎండలు మండిపోతుండడంతో.. ఉపశమనం కోసం అత్యధికులు బీరు తెగ తాగేస్తున్నారు. గత ఏడాది తొలి నాలుగు నెలల్లో 1,06,42,143 పెట్టెల బీరు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి- ఏప్రిల్‌ వరకూ రాష్ట్రంలో 1,49,17,004 పెట్టెల సీసాలు అమ్ముడయ్యాయి. అంటే 45 శాతానికిపైగా బీరు విక్రయాలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మేం తాగేది బ్రాందీ కాదు.. బీరే కదా అని చాలామంది సమర్థించుకుంటారు. కానీ బీరులోనూ ఆల్కహాల్‌ ఉంటుంది. 650 మి.లీ.లో 5-7.5 శాతం, బ్రాందీ, విస్కీలలో 42.8 శాతం, వైన్‌లో 6-24 శాతం వరకూ ఆల్కహాల్‌ ఉంటుంది. ఇలాంటప్పుడు బీరే కదాని పరిమితికి మించి తాగేస్తే.. ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. రోజుకు 90 ఎంఎల్‌ కంటే ఎక్కువ ఆల్కహాల్‌ తీసుకుంటే అది కాలేయంపై నేరుగా ప్రభావం చూపుతుంది. కాలేయం పరిమాణం కుంచించుకుపోయి పనితీరు దెబ్బతింటుంది. దీన్నే ‘లివర్‌ సిర్రోసిస్‌’ అంటారు. ఇప్పటికే కాలేయ సమస్యలున్నవారు, అధిక కొవ్వు, బరువు, మధుమేహంతో బాధపడుతున్నవారు.. అదేపనిగా ఆల్కహాల్‌ తీసుకుంటే ఇంకా త్వరగా కాలేయ జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో జిగురు పొరను ఆల్కహాల్‌ దెబ్బతీస్తుంది. ఫలితంగా అల్సర్లు ఏర్పడి, రక్త వాంతులు.. విరేచనాల సమస్యలు ఎదురవుతాయి. కడుపులో మంట, ఛాతీలోకి ఆమ్లం ఎగబాకడం వంటి పరిస్థితులూ ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. వేసవిలో శీతల పానీయాలు కూడా ఎక్కువగా తాగుతుంటారు. వీటితో రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఊబకాయం బారినపడతారు. కాబట్టి బీర్లు, శీతల పానీయాలు మోతాదుకు మించి తీసుకోవడం అనారోగ్యకరమేనని నిపుణులు చెబుతున్నారు.


మాత్రలపైనా దుష్ప్రభావం

- డాక్టర్‌ జగదీశ్‌కుమార్‌, సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌, కిమ్స్‌

బీరుకు బానిసలవ్వడం వల్ల స్థూలకాయులుగా మారతారు. నాడీ వ్యవస్థపై ఆల్కహాల్‌ ప్రభావం పడుతుంది. ‘సెరబెలామ్‌’పై దుష్ప్రభావం పడి శరీర కదలికలను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడుపై దుష్ప్రభావం చూపడంతో ఆలోచనాశక్తి తగ్గిపోతుంది. కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదమూ ఉంటుంది. ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకున్న వారికి.. వారు వాడుతున్న మందుల ప్రభావం తగ్గిపోతుంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో ‘మిథైల్‌ డొపిన్‌’ వంటి బీపీ మాత్రలపై ఆల్కహాల్‌ దుష్ప్రభావం చూపి, ఆ మాత్రల ప్రభావాన్ని తగ్గిస్తుంది. బీపీ స్థాయి పెరిగి.. గుండె లయ తప్పుతుంది. బీరు ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలోని నీరు, సోడియం, పొటాషియం.. మూత్రం ద్వారా బయటకు పోతాయి. ఫలితంగా డీహైడ్రేషన్‌కు దారితీసే ప్రమాదముంది. గ్లూకోజ్‌ ఉత్పత్తిపై ఆల్కహాల్‌ ప్రభావం చూపుతుంది. ఫలితంగా మధుమేహుల్లో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గి.. ‘హైపోగ్లేసిమియా’ అనే ప్రమాదకరస్థితిలో కోమాలోకి వెళ్లే ప్రమాదముంది. వేసవిలో పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు, ఉప్పు, చక్కెరతో కలిపినపానీయాన్ని తాగాలి. ఎండాకాలంలో నిమ్మరసాన్ని మించింది లేదు.


అపరిమితంగా బీరు తాగితే కనిపించే సమస్యలివి

* మానసిక అసమతుల్యం ఏర్పడుతుంది.

* అదేపనిగా తాగితే శ్వాసవ్యవస్థపై ప్రభావం పడి.. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.

* అసహనానికి లోనవుతారు.

* ఏ పనిచేయాలో.. చేయకూడదో నిర్ణయించుకునే విచక్షణ కోల్పోతారు.

* వాహనం నడిపితే.. ప్రమాదాలు జరగడానికి   అవకాశాలెక్కువ.

* మానసిక ఆందోళన, కుంగుబాటు సమస్యలుంటే.. మరింత ఎక్కువవుతాయి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని