GST: జీఎస్‌టీ వసూళ్లలో సరికొత్త రికార్డు

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. 2022 ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,67,540 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం వెల్లడించింది. మార్చిలో వసూళ్లయిన రూ.1,42,095 కోట్లతో పోలిస్తే

Updated : 02 May 2022 04:44 IST

 ఏప్రిల్‌లో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

తెలంగాణలో రూ.4,955 కోట్లు, ఏపీలో రూ.4,067 కోట్లు

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. 2022 ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,67,540 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం వెల్లడించింది. మార్చిలో వసూళ్లయిన రూ.1,42,095 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం రూ.25 వేల కోట్లు అధికం. 2021 ఏప్రిల్‌ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లతో పోల్చినా దాదాపు 20 శాతం పెరిగాయి. 2021 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు రెండు నెలలు మినహాయించి అన్ని నెలల్లో వసూళ్లు రూ.లక్ష కోట్లను మించాయి. ఒకనెల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లను దాటడం ఇదే తొలిసారి. మార్చిలో 97 లక్షల మంది వ్యాపారులు జీఎస్‌టీఆర్‌-3బి రిటర్నులు దాఖలు చేస్తే, ఏప్రిల్‌లో ఆ సంఖ్య 1.06 కోట్లకు పెరిగింది. అనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి తోడు వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల వసూళ్లు పెరిగినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.  

ఏపీలో 22%, తెలంగాణలో 16% వృద్ధి

జీఎస్‌టీ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లోనూ పెరిగాయి. 2021 ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో 22%, తెలంగాణలో 16% వసూళ్లు పెరిగాయి. ఏపీ వసూళ్ల వృద్ధి జాతీయ సగటు వృద్ధి 19.92 శాతానికి మించి ఉండగా తెలంగాణలో కాస్త తక్కువగా నమోదైంది. దక్షిణాదిలో పుదుచ్చేరి (21%), కర్ణాటక (19%), తెలంగాణ (16%), తమిళనాడు (10%), కేరళ(9%)తో పోలిస్తే వృద్ధిరేటులో ఏపీ తొలిస్థానంలో నిలిచింది.

2022 ఏప్రిల్‌ జీఎస్‌టీ వసూళ్ల తీరిదీ

గత నెలలో వసూలైన రూ.1,67,540 కోట్ల స్థూల వసూళ్లలో సీజీఎస్‌టీ కింద (కేంద్రానికి) రూ.33,159 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ కింద (రాష్ట్రాలకు) రూ.41,793 కోట్లు, ఐజీఎస్‌టీ కింద రూ.81,939 కోట్లు, సెస్‌ వాటా రూ.10,649 కోట్లుగా ఉంది. ఐజీఎస్‌టీలో వచ్చిన మొత్తంలో రూ.33,423 కోట్లు సీజీఎస్‌టీ కింద, రూ.26,962 కోట్లు ఎస్‌జీఎస్‌టీ సర్దుబాటుచేసింది. ఫలితంగా కేంద్రానికి రూ.66,582 కోట్లు, రాష్ట్రాలకు రూ.68,755 కోట్లు దక్కాయి. 

7.7 కోట్ల ఈవే బిల్లులు

ఈ ఏడాది మార్చిలో 7.7 కోట్ల ఈవే బిల్లులు ఉత్పత్తి అయ్యాయి. ఫిబ్రవరిలో ఉత్పత్తి అయిన 6.8 కోట్ల ఈవే బిల్లులకంటే ఇవి 13% అధికం. ఏప్రిల్‌లో 20వ తేదీన 9.58 లక్షల లావాదేవీల ద్వారా రూ.57,847 కోట్ల పన్ను వసూలైంది. ఒక్కరోజులో వసూలైన గరిష్ఠ మొత్తం ఇదే. గత ఏడాది ఒక్కరోజులో 7.22 లక్షల లావాదేవీల ద్వారా రూ.48 వేల కోట్లు వసూలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని