Telangana News: కొట్టుకుపోయిన కష్టం

రాష్ట్రవ్యాప్తంగా  పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను కష్టాలపాలు చేశాయి. కొనుగోలు కోసం తెచ్చి.. కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. కోతకొచ్చిన వరిపైర్లు నేలవాలాయి. మామిడి, కూరగాయల తోటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు

Updated : 05 May 2022 05:16 IST

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటిపాలు
పరదాలు లేవు.. తడిస్తే కొనేవారు లేరు
వర్ష సూచనలున్నా జాగ్రత్తలు శూన్యం
ఈనాడు - హైదరాబాద్‌, జిల్లాల యంత్రాంగం

రాష్ట్రవ్యాప్తంగా  పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను కష్టాలపాలు చేశాయి. కొనుగోలు కోసం తెచ్చి.. కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. కోతకొచ్చిన వరిపైర్లు నేలవాలాయి. మామిడి, కూరగాయల తోటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనధికారిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ గత వారం రోజులుగా హెచ్చరిస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. అమ్మకానికి తెచ్చి ఆరబోసిన ధాన్యం కొంత నీటిలో కొట్టుకుపోయింది. మిగిలింది తడిసిపోయింది. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు 608 ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ధాన్యం రాశుల చుట్టూ వరదలా నీరు నిలవడంతో రైతులకు కన్నీరే మిగిలింది. కొనుగోలు కేంద్రాలను పొలాల్లో ఎలాంటి రక్షణ లేనిచోట్ల ఏర్పాటు చేయడంతో చిన్నవర్షం పడినా బురదగా మారి ధాన్యం పాడవుతోంది. మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, మేడ్చల్‌, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్‌, కుమురంభీం, కామారెడ్డి తదితర జిల్లాల్లో రైతులకు అధిక నష్టాలు సంభవించాయి. కొన్ని ప్రాంతాల్లో గంట నుంచి 4 గంటల వ్యవధిలో నిరంతరాయంగా 5 నుంచి 11 సెంటీమీటర్ల వర్షం కురవడంతో కళ్లముందే ధాన్యం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎంత ధాన్యం నీటిలో కొట్టుకుపోయిందనే లెక్కలను అధికారులెవరూ ప్రకటించలేదు.

మూడు గంటల పాటు బీభత్సం
ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి దాదాపు 3గంటల పాటు కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోని సుమారు 70 కొనుగోలు కేంద్రాల్లో 10 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయిందని అంచనా. చిట్యాల, హాలియా, తిప్పర్తి, మోత్కూరు, నిడమనూరు, నల్గొండ మండల కేంద్రాల్లోని ఐకేపీ కేంద్రాల్లో సరిపడినన్ని టార్పాలిన్లు లేకపోవడంతో ధాన్యం వర్షంలోనే ఉండిపోయింది. కొన్ని చోట్ల తూకం వేసిన ధాన్యం బస్తాలు ముద్దముద్ద అయ్యాయి.  మునుగోడు, మోత్కూరు మండలాల్లోని దాదాపు 150 ఎకరాల్లో వరిపైరు ఈదురుగాలులకు నేలకొరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 5వేల ఎకరాల్లో వరికి నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ఈ జిల్లా అదనపు కలెక్టరు (రెవెన్యూ) చంద్రశేఖర్‌ ‘ఈనాడు’కు వెల్లడించారు.
*  కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, లింగంపేట, బిచ్కుంద మండలాల్లో ఈదురుగాలులు, భారీవర్షంతో సుమారు 300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా.
*   జగిత్యాల, కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో అన్నదాతలు అరిగోస పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలను వాన నుంచి కాపాడలేక ఆవేదన చెందారు. సారంగాపూర్‌ మండలంలో 6.4 సెం.మీ. వర్షం కురవడంతో కల్లాలన్నీ చెరువుల్ని తలపించాయి. కోతకు వచ్చిన పంటలు ఈదురుగాలులకు నేలకొరిగాయి.  
*   ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జనగామ, భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోయింది. కోతకొచ్చిన వరి పంట నేలవాలింది.
*   మంచిర్యాల జిల్లాలోని 13 మండలాల్లో 4800 ఎకరాల మేర వరి, 800 ఎకరాల మేర మామిడి పంటలు నష్టపోయినట్టు అంచనా.

 500 టన్నులకు పైగా మామిడి నేలపాలు
అకాల వర్షాలకు వరితో పాటు మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఈ సీజన్‌లో మామిడి దిగుబడి సరిగా లేక ఇప్పటికే రైతులు నష్టపోగా మిగిలిన కాసింత పంటను తెగుళ్లు, వర్షాలు కాలరాస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో వీచిన ఈదురుగాలులు, వర్షాలకు 500 టన్నులకు పైగా మామిడికాయలు తోటల్లోనే నేలరాలినట్లు ఉద్యానశాఖ అంచనా. హైదరాబాద్‌ చుట్టుపక్కల యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌ తదితర జిల్లాల్లో కురిసిన వర్షాలకు కూరగాయల తోటల్లో పూత, కాత రాలిపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నారాయణపూర్‌, నూతన్‌కల్‌, మోత్కూరు, మద్దిరాల మండలాల్లోని దాదాపు 200 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. గురువారం ఎండలు కాస్తే పంటలకు పెద్దగా నష్టం ఉండదని అధికారులు చెబుతున్నారు.


సగం వడ్లు కోల్పోయాం
-రేణుక, గంగాధర, కరీంనగర్‌ జిల్లా

తొమ్మిది ఎకరాల్లో వరిసాగు చేశాం. రెండు రోజుల కిందట కోసి పది ట్రాక్టర్లలో ధాన్యాన్ని తెచ్చి మల్లాపూర్‌లో ఆరబోశాం. నాలుగైదు ట్రాక్టర్ల ధాన్యం కొట్టుకుపోయింది. టార్పాలిన్లు కప్పినా, గాలికి ఎగిరిపోయాయి. కొన్ని వడ్లు ఏరి తెచ్చుకొని ఆరబోసుకుంటున్నాం. ఎండల్ని లెక్కచేయకుండా కష్టపడి పంట పండిస్తే చివరకు మా పరిస్థితి ఇలా అయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని