Heavy Rain: మండువేసవిలో కుంభవృష్టి

రాష్ట్రంలో బుధవారం మండువేసవిలో కుంభవృష్టి కురిసింది. మంగళవారం రాత్రి 8 నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా హబ్సీపూర్‌ (సిద్దిపేట జిల్లా)లో 11.1 సెం.మీ., నల్గొండ జిల్లా పజ్జూర్‌లో

Updated : 05 May 2022 05:20 IST

 అత్యధికంగా హబ్సీపూర్‌లో 11.1 సెంటీమీటర్ల వర్షం
మే నెలలో గత పదేళ్లలో కురిసిన అత్యధిక వర్షపాతమిదే
ధాన్యం కేంద్రం వద్ద రైతు సహా పిడుగుపాటుకు ఇద్దరి మృతి 

 

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే బృందం: రాష్ట్రంలో బుధవారం మండువేసవిలో కుంభవృష్టి కురిసింది. మంగళవారం రాత్రి 8 నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా హబ్సీపూర్‌ (సిద్దిపేట జిల్లా)లో 11.1 సెం.మీ., నల్గొండ జిల్లా పజ్జూర్‌లో 9.8, కామారెడ్డిగూడెంలో 9.3, నెమ్మనిగ్రామంలో 8.8 నార్కట్‌పల్లిలో 7.8, యాదగిరిగుట్ట(యాదాద్రి)లో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్ర చరిత్రలో గత పదేళ్ల మే నెలలో అత్యధికం వర్షపాతం మహబూబ్‌నగర్‌లో 2016 మే 10న 11 సెం.మీ. కురిసినట్లు వాతావరణశాఖ రికార్డుల్లో ఉంది. పిడుగుపాటుకు వేర్వేరు చోట్ల ఇద్దరు మృతిచెందారు. గురు, శుక్రవారాల్లో సైతం రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయంది.

44 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ..
రాజధానిలో 44 ఏళ్ల తర్వాత మే నెలలో రికార్డు వర్షపాతం నమోదైంది. సీతాఫల్‌మండిలో అత్యధికంగా 8.68 సెం.మీ. వాన పడింది. గతంలో 1978లో మే 24న 7.9 సెం.మీ.. 2016 మే 6న 7.5సెం.మీ వర్షం కురిసింది. నగరంలో రోడ్లపై వరద ఉద్ధృతంగా ప్రవహించడంతో కొన్ని ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి.  

పిడుగుపాటుకు కుప్పకూలిన రైతన్న
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మశాలిగడ్డ పంచాయతీ పరిధిలోని నర్లెన్‌గడ్డకు చెందిన రైతు సౌడు పోచయ్య(65) పిడుగుపాటుకు మరణించారు. మృతుడి కుమారుడితో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని చెప్పారు.

ధాన్యాన్ని కాపాడుకునే యత్నంలో
నిల్వ చేసుకున్న ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునే యత్నంలో మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన రైతు సిద్దం వెంకటేష్‌ (47) భవనం పైనుంచి పడి మృత్యువాత పడ్డారు.  మేడపై గుమ్మిలో నిల్వ చేసుకున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు మంగళవారం రాత్రి ఆయన తన కుమారుడితో కలిసి పైకి వెళ్లారు. గుమ్మి చుట్టూ పాలిథిన్‌ కవర్‌ చుట్టి తాడుతో బిగించే క్రమంలో అకస్మాత్తుగా తాడు తెగిపోవడంతో భవనం పైనుంచి కింద పడిపోయి మరణించారు.

ద్విచక్రవాహనం నుంచి ఎగిరిపడి..
నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం మోదినిగూడేం గ్రామ శివారులోని తమ గొర్రెల మంద ఉన్న కొట్టం వద్దకు వెళ్లిన లింగరాజు(26) ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో వాహనం నుంచి ఎగిరి పక్కనే ఉన్న పొలంలో పడి అక్కడికక్కడే మృతిచెందారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్‌లో పిడుగుపాటుకు 36 గొర్రెలు, మేకలు, కాపలా కుక్క మృతి చెందాయి. గొర్రెల కాపరులు నెలవేని మహేష్‌, వేల్పుల రవి గాయపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు సంఘటనల్లో పిడుగుపాటుకు 10 పాడిగేదెలు మృతిచెందాయి.

రాజధానిలో 10 గంటల పాటు నిలిచిన విద్యుత్తు సరఫరా
బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో హైదరాబాద్‌ నగరంలో విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా మారింది. 400 ఫీడర్ల వరకు ట్రిప్పయ్యాయి. 2 చోట్ల ట్రాన్స్‌ఫార్మర్‌ గద్దెలు, 10కిపైగా స్తంభాలు ఒరిగిపోయాయి. 30చోట్ల చెట్లు కూలి తీగలపై పడ్డాయి. ఉదయం 5 గంటలకు నిలిచిపోయిన సరఫరా కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు పునరుద్ధరించగా.. మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు కూడా రాలేదని వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. కూకట్‌పల్లి అల్విన్‌కాలనీలో 14 గంటల పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. అంతరాయాలకు సంబంధించి టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ట్విటర్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు ఫిర్యాదులకు బదులిచ్చింది. ఈ ట్విటర్‌ ఖాతా పరిమితి మధ్యాహ్నం వరకే దాటిపోయిందంటే ఫిర్యాదుల తాకిడిని అర్థం చేసుకోవచ్చు. రాత్రి వరకు అన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించామని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని