ఓయూలో వద్దు

ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహల్‌గాంధీ ముఖాముఖి కార్యక్రమ నిర్వహణకు బుధవారం హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఠాగూర్‌ ఆడిటోరియంలో ఈనెల 7న కాంగ్రెస్‌ తలపెట్టిన విద్యార్థులు, నిరుద్యోగులతో రాహుల్‌ ముఖాముఖి కార్యక్రమానికి అ

Updated : 05 May 2022 05:25 IST

రాహుల్‌గాంధీ ముఖాముఖికి అనుమతి నిరాకరణ
యూనివర్సిటీ క్యాంపస్‌ను రాజకీయ వేదికగా వినియోగించరాదు
మార్గదర్శకాలు రూపొందించాలని రిజిస్ట్రార్‌కు హైకోర్టు ఆదేశం
పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహల్‌గాంధీ ముఖాముఖి కార్యక్రమ నిర్వహణకు బుధవారం హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఠాగూర్‌ ఆడిటోరియంలో ఈనెల 7న కాంగ్రెస్‌ తలపెట్టిన విద్యార్థులు, నిరుద్యోగులతో రాహుల్‌ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతిని నిరాకరిస్తూ రిజిస్ట్రార్‌ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమంది. క్యాంపస్‌లో రాజకీయ కార్యక్రమాలు నిషేధించేలా సమగ్ర, స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని సూచించింది. ఇతర యూనివర్సిటీలు సైతం నిబంధనలు తయారు చేయాలంది. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలంది. విద్య, శిక్షణ, విజ్ఞాన కేంద్రాలుగా యూనివర్సిటీలు ఉండాలని ఆకాంక్షించింది.విశ్వవిద్యాలయాల్లోకి బయటి వ్యక్తులను అనుమతించొద్దని పేర్కొంది. వీటిని రాజకీయ వేదికలుగా వినియోగించరాదంది. ఓయూ రిజిస్ట్రార్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మానవతా రాయ్‌ మరో ముగ్గురు అత్యవసరంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జి.కరుణాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ విద్యార్థులతో రాహుల్‌గాంధీ ముఖాముఖికి అనుమతి కోరామన్నారు. కార్యక్రమంలో రాజకీయ ప్రమేయం లేదని, విద్యార్థులకు చెందినదన్నారు. రిజిస్ట్రార్‌ అనుమతిని నిరాకరించడానికి చెప్పిన కారణాలు సరికావన్నారు. ఎంబీఏ పరీక్షలు జరుగుతున్నాయన్నారని, పరీక్ష కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఆడిటోరియం ఉందన్నారని చెప్పారు. రాజకీయ సమావేశాలకు అనుమతించరాదని గత ఏడాది పాలక మండలి సమావేశంలో తీర్మానం చేసినప్పటికీ గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారన్నారు. భారతీయ జనతా పార్టీ నిర్వహించిన మాక్‌ అసెంబ్లీకి కూడా అనుమతించారన్నారు. యూనివర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పరీక్షలు జరుగుతున్నాయని, అంతేగాకుండా సిబ్బంది ఎన్నికల నిర్వహణ కూడా ఉందన్నారు. ఎగ్జిక్యూటివ్‌ సమావేశ తీర్మానం ప్రకారం రాజకీయ సదస్సులకు అనుమతి లేదన్నారు. వీరు యూనివర్సిటీలో రెగ్యులర్‌ విద్యార్థులుకాదన్నారు. ఇలాంటి సమావేశాలకు అనుమతిస్తే బయటి వ్యక్తులు కూడా అనుమతులు కోరే అవకాశం ఉందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కొందరు రాజకీయ నేతల జన్మదిన వేడుకలకు అనుమతిస్తే వివక్ష ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుందని, భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వవద్దని రిజిస్ట్రార్‌ను హెచ్చరించింది. గతంలో అలా చేశారని చెప్పి ఇప్పుడు అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని