Congress: హస్తవాసి మారేలా

రాష్ట్ర కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపేలా కార్యాచరణ మొదలైంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనకు పార్టీ శ్రీకారం చుట్టింది. రానున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించనుంది. హనుమకొండ వేదికగా

Updated : 06 May 2022 05:35 IST

పార్టీ బలోపేతంపై కాంగ్రెస్‌ దృష్టి
ఎన్నికల కార్యాచరణ షురూ
హనుమకొండ వేదికగా వ్యవసాయ విధానం
నేడు, రేపు రాష్ట్రంలో రాహుల్‌గాంధీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపేలా కార్యాచరణ మొదలైంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనకు పార్టీ శ్రీకారం చుట్టింది. రానున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించనుంది. హనుమకొండ వేదికగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించనుంది. శనివారం గాంధీభవన్‌లో జరిగే విస్తృత స్థాయి పార్టీ సమావేశంలో నాయకులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సుమారు మూడేళ్ల తర్వాత రాష్ట్రానికి వస్తున్న రాహుల్‌ రెండ్రోజుల పాటు రాష్ట్ర కాంగ్రెస్‌పై ప్రత్యేకదృష్టి సారించనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత రాహుల్‌ తొలి పర్యటన ఇది. తెరాస ప్రభుత్వ విధానాలపై పోరాట కార్యాచరణకు ఈ పర్యటన కీలకం కానుంది.  శాసనసభ ఎన్నికలపై దృష్టిసారించిన కాంగ్రెస్‌ పార్టీ వర్గాల వారీగా సమస్యలపై పోరాడాలని నిర్ణయించింది. ప్రతి రెండున్నర నెలలకోసారి రాహుల్‌ రాష్ట్రానికి వచ్చేలా కాంగ్రెస్‌ ప్రణాళిక రూపొందించింది. రైతుల సమస్యల అనంతరం విద్యార్థులు-నిరుద్యోగులు, మహిళలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ బడుగు బలహీనవర్గాల సమస్యలపై సభలను నిర్వహించనుంది. అదే వేదికపై  సంబంధిత వర్గాలకు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమలు చేసే విధానాలను స్పష్టం చేయనుంది. ఈ నేపథ్యంలోనే నేటి తొలి సభలో వ్యవసాయ విధానాన్ని ప్రకటించనుంది. మరోవైపు అంతర్గతంగా పార్టీలోని సమస్యలను కొలిక్కి తెచ్చి నేతలందరినీ ఒకే తాటిపై నిలిపేలా అధిష్ఠానం దృష్టిసారించింది.  

ఏర్పాట్లు పూర్తి

ఈనాడు, వరంగల్‌: హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాలలో శుక్రవారం రాహుల్‌గాంధీ హాజరయ్యే రైతు సంఘర్షణ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు 5 లక్షల మందిని తరలించాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, భూపాలపల్లి మార్గాల గుండా వచ్చే వాహనాల కోసం నాలుగు పార్కింగ్‌ స్థలాలను ఆయా రూట్లలో ఏర్పాటుచేశారు. ప్రముఖ నేతల కోసం ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియం వద్ద వీవీఐపీ పార్కింగ్‌ సిద్ధం చేశారు. మైదానంలో మూడు వేదికలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. మధ్య వేదికపై రాహుల్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మరో ముగ్గురు ప్రసంగిస్తారు.  

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఓరుగల్లు డిక్లరేషన్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: రైతుల్ని ఆదుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ తీసుకొనే నిర్ణయాలపై రాహుల్‌ ఓరుగల్లు వేదికగా స్పష్టమైన డిక్లరేషన్‌ చేయనున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీనేతలు మధుయాస్కీ, మల్లు రవి ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్‌ రూపొందించిన గాంధీ కుటుంబ త్యాగాల వీడియోను ‘జనం వాయిస్‌’ పేరుతో బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో గురువారం ప్రదర్శించారు. కార్యక్రమానికి రేవంత్‌తో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ యాదాద్రిని రూ.రెండు వేలకోట్లతో పునర్నిర్మిస్తే చిన్నపాటి వర్షానికి ఎలా అతలాకుతలమైందో ప్రజలు గమనించాలన్నారు.‘రాహుల్‌..ఎందుకు వస్తున్నావు?’అంటూ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా ఖండించారు. రాహుల్‌ను విమర్శించే స్థాయి హరీశ్‌కు లేదన్నారు.  

జైళ్ల శాఖ డీజీకి వినతి..

నారాయణగూడ, న్యూస్‌టుడే: చంచల్‌గూడ జైలులో ఉన్న విద్యార్థులను పరామర్శించేందుకు రాహుల్‌గాంధీకి అనుమతి ఇవ్వాలని రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం జైళ్ల శాఖ డీజీ జితేందర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించింది. ఆర్ట్స్‌ కళాశాలలో రాహుల్‌గాంధీ ముఖాముఖి కార్యక్రమ అనుమతి కోసం వీసీని కలిసేందుకు వెళ్లిన ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు బల్మూరి వెంకట్‌తో సహా 17 మందిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి చంచల్‌గూడ జైలులో ఉంచారన్నారు. వారిని రాహుల్‌గాంధీ పరామర్శించేందుకు అనుమతి కోరుతూ జైలు సూపరింటెండెంట్‌ను కలిశామని, డీజీని కలవాలని చెప్పడంతో ఆయనకూ వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. 


రాహుల్‌ పర్యటన ఇలా..
మొదటి రోజు (శుక్రవారం)

* సాయంత్రం 4.50 గంటలకు రాహుల్‌ గాంధీ శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుంటారు. 5.45 గంటలకు వరంగల్‌ గాబ్రియల్‌ స్కూలు గ్రౌండ్‌కు వెళతారు.

* 6.05 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ బహిరంగసభలో పాల్గొంటారు.

* రాత్రి 8 గంటలకు బయల్దేరి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ చేరుకుంటారు.  

రెండో రోజు (శనివారం)

* మధ్యాహ్నం 12.50 గంటలకు సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు.దివంగత ఉమ్మడి ఏపీ సీఎం, ఏఐసీసీ అధ్యక్షుడు సంజీవయ్యకు నివాళి అర్పిస్తారు.

* మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల వరకు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు.

* 2.50 నుంచి 3.50వరకు సభ్యత్వ నమోదు సమన్వయకర్తలతో ఫొటో కార్యక్రమం.

* సాయంత్రం 5.40 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దిల్లీ బయల్దేరతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని