JP Nadda: తెలంగాణ రజాకార్‌ సమితి

తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌ అత్యంత అవినీతి ప్రభుత్వమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. అవినీతి రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తోందని, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు చుక్కనీరు అందించలేదని విమర్శించారు.

Updated : 06 May 2022 04:37 IST
తెరాసపై విరుచుకుపడిన జేపీ నడ్డా
రాష్ట్రంలో ఉన్నది అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపణ
గద్దె దింపుతామని వెల్లడి
కాళేశ్వరం ప్రాజెక్టు వారికి ఏటీఎంగా మారిందని వ్యాఖ్య
ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

దుబ్బాకలో ధమాకా జరిగింది. హుజూరాబాద్‌లో హుజూర్‌ పడిపోయారు. ఈ రెండు సంఘటనలతో కేసీఆర్‌ భయపడ్డారు. ఇవి వచ్చే ధమాకాలకు గుర్తులు. తెలంగాణ ప్రజలు భాజపా వెంట ఉన్నారు. ఇక్కడ మార్పు కోరుకుంటున్నారు. భాజపా ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల ఆశీర్వాదం ఉంది 

 -జేపీ నడ్డా


తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌ అత్యంత అవినీతి ప్రభుత్వమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. అవినీతి రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తోందని, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు చుక్కనీరు అందించలేదని విమర్శించారు. తెరాస అంటే తెలంగాణ రాష్ట్రసమితి కాదని..., తెలంగాణ రజాకార్‌ సమితి అని పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకేపార్టీ అధికారంలో ఉంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో తెలంగాణ అభివృద్ధి పథంలోకి వెళ్తుందన్నారు. కేసీఆర్‌ను గద్దెదింపాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే తెరాస ప్రభుత్వాన్ని భాజపా గద్దె దింపుతుందన్నారు. భాజపా సంగ్రామ యాత్రలో భాగంగా  గురువారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ‘‘జనంగోస.. భాజపా భరోసా’’ బహిరంగసభలో నడ్డా మాట్లాడారు. ఈ సందర్భంగా మొదటి సంగ్రామ యాత్రకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

మోదీది జవాబుదారీ ప్రభుత్వం..

‘‘మోదీది క్రియాశీలకమైన, జవాబుదారీ ప్రభుత్వం. కరోనాతో దేశం మొత్తం అతలాకుతలమైంది. వైద్యంలో మనకన్నా మెరుగైనవని భావించిన అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీలు విలవిల్లాడాయి. కానీ మోదీ... దేశంలోని 130 కోట్ల మంది ప్రజలను రక్షించారు. కరోనా టీకాలిచ్చి సురక్షా కవచంలా నిలిచారు. వంద దేశాలకు టీకాలు ఎగుమతి చేశారు. 48 దేశాలకు ఉచితంగా పంపిణీ చేశారు. మోదీ లాక్‌డౌన్‌ పెట్టినపుడు కేసీఆర్‌ రాష్ట్రంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘించారు. శాసనసభలో కరోనా గురించి తప్పుడు సమాచారమిచ్చారు. భారత్‌ మారుతోంది. గతంలో దిగుమతులపై ఆధారపడే దేశం ఎగుమతులు చేసేస్థాయికి ఎదిగింది. శాస్త్ర, సాంకేతిక, అభివృద్ధి రంగాల్లో ముందున్నాం. కరోనా సమయంలో దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు మోదీ ఉచితంగా రేషన్‌ అందించారు. రెండేళ్లలో 12 శాతం మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చారు.

నీటిపారుదల రంగంలో అవినీతి

నీటిపారుదల రంగంలో అవినీతి జరుగుతోంది. ఈ అవినీతి ప్రభుత్వం కారణంగా ప్రజలకు కష్టాలు ఎదురవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంగా, పాలిచ్చే ఆవుగా మారింది. రూ.20వేల కోట్ల ప్రాజెక్టు అంచనాల్ని రూ.1.20 లక్షల కోట్లకు పెంచింది. ఒక్క ఇంచు భూమికి సాగునీరు అందలేదు. పాలమూరు-రంగారెడ్డి, రాజోలిబండ, నెట్టెంపాడు, డిండి ప్రాజెక్టులు విఫలమయ్యాయి. రాష్ట్రంలో తప్పుడు వ్యక్తి కారణంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయి. తెలంగాణ ప్రజల గురించి మోదీ ఆలోచించి పత్తి క్వింటాలు మద్దతుధరను రూ.5200 నుంచి రూ.10 వేలకు పెంచారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద 3.11 కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందారు. కేసీఆర్‌ ప్రభుత్వం 24 లక్షల కుటుంబాలకు రూ.5లక్షల ఆరోగ్య బీమా లేకుండా చేసింది. ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో భాజపాకు ఓటు వేసి తెలంగాణకు ఆయుష్మాన్‌ భారత్‌ తీసుకురావాలి.

భగీరథలో ఇంటింటికీ నీళ్లు రాలేదు...

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలో అవినీతి జరిగింది. ఇంటింటికీ తాగునీరు రాలేదు. హరితహారంలోనూ అవినీతి చోటుచేసుకుంది. కేసీఆర్‌ ప్రభుత్వం లాండ్‌ మాఫియా చేస్తోంది. బుజ్జగింపు రాజకీయాలతో విభజించి పాలిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లుగా,  సమగ్ర శిక్ష అభియాన్‌కు మన ఊరు, మన బడిగా పేర్లు మార్చింది. ప్రధాని పంపిన డబ్బును, రాష్ట్రంలో సరిగా ఖర్చు చేయడం లేదు. రాష్ట్రంలో మార్పునకు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను అభివృద్ధిలోకి తీసుకెళ్తాం.


తెలంగాణకు ద్రోహం చేశారు: బండి

భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణకు నిజానికి 575 టీఎంసీల కృష్ణా జలాల వాటా రావాలన్నారు. అప్పట్లో చంద్రబాబుతో కుమ్మక్కై 299 టీఎంసీలకే అంగీకరించి సంతకం చేశారని ఆరోపించారు. పాలమూరులో వలసలు లేవని సీఎం కేసీఆర్‌ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని సవాలు విసిరానన్నారు. సీఎం కుటుంబం తన సవాలును స్వీకరించకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. గ్రూపు-1 పరీక్షను ఉర్దూలో రాసి ఉద్యోగాలు పొందిన వారిని భాజపా అధికారంలోకి రాగానే తొలగిస్తుందన్నారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి చరిత్ర అందరికీ తెలుసన్నారు. భూ కబ్జాలు, మట్టి, ఇసుక ద్వారా అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌, తెరాస ఒక్కటేనన్నారు. సభలు పెట్టుకుంటే బస్సులను అద్దెకు ఇవ్వడం లేదన్నారు. పోలీసు అనుమతులూ రావడం లేదన్నారు.

* భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో తెరాసను 13 శాసనసభ స్థానాల్లో గెలిపిస్తే.. ఎమ్మెల్యేలు ఇసుక, భూ దందాలు, అరాచకాలు సాగిస్తున్నారన్నారు. ఎదురు ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తున్నారన్నారు. ఉద్యోగిగా ఉన్నప్పుడు చేసిన అవినీతికి సస్పెండ్‌ అయిన విషయం మర్చిపోవద్దని మంత్రిని ఉద్దేశించి అన్నారు.

* బహిరంగ సభ అనంతరం జేపీ నడ్డా వెళుతూ.. శభాష్‌ సంజయ్‌.. యాత్రకు స్పందన బాగా ఉందని ప్రశంసించారు. మాజీ ప్రధాని పీవీ మనవడు,  భాజపా అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్‌కు ఫోన్‌చేసి తన ప్రసంగానికి, తెరాస ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు ప్రజల్లో స్పందన ఎలా ఉందని ఆరా తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని