Congress: ధరణి పోర్టల్‌ ఎత్తేస్తాం

వరంగల్‌ రైతు సంఘర్షణ సభ వేదికగా కాంగ్రెస్‌ ‘రైతు డిక్లరేషన్‌’ను ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని తెలిపింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో

Updated : 07 May 2022 07:50 IST

ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం
అన్ని పంటలకు గిట్టుబాటు ధర
వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం
వరంగల్‌ సభలో కాంగ్రెస్‌ ‘రైతు డిక్లరేషన్‌’

ఈనాడు, వరంగల్‌, ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: వరంగల్‌ రైతు సంఘర్షణ సభ వేదికగా కాంగ్రెస్‌ ‘రైతు డిక్లరేషన్‌’ను ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని తెలిపింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ డిక్లరేషన్‌ను సభలో ప్రకటించారు. రైతులకు  రుణమాఫీతో పాటు ధరణి పోర్టల్‌ను తొలగిస్తామన్నారు. వరితో సహా వాణిజ్య పంటలైన పత్తి, మిర్చికి సైతం గిట్టుబాటుధరలు కల్పిస్తామనిపేర్కొన్నారు.  

డిక్లరేషన్‌ అంశాలు

అధికారంలోకి వచ్చాక ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ

ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెస్తాం. భూమి కలిగిన, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం

ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సహాయం

వరి, పత్తి, చెరకు, పసుపు.. ఇలా అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇస్తాం. చివరి గింజ వరకు కొనుగోలు

తెలంగాణలో మూతపడిన చెరకు కర్మాగారాలను తెరిపిస్తాం. పసుపుబోర్డును ఏర్పాటు చేస్తాం

మెరుగైన పంటల బీమా పథకంతో ప్రకృతి విపత్తులు లేదా మరో కారణంగా నష్టపోయిన రైతుకు సత్వర పరిహారం.

రైతు కూలీలకు, భూమి లేని రైతులకు రైతుబీమా వర్తింపు. ఉపాధిహామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం.

పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ బిడ్డలకు యాజమాన్య హక్కు పట్టాలు. ఎసైన్డ్‌ భూములు కేటాయించిన దళితులు, గిరిజనులకు భూమిపై యాజమాన్య హక్కులు కల్పించి క్రయవిక్రయాలకు అవకాశం.

రైతు పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్‌ను రద్దు చేసి అన్ని వర్గాల ప్రజల భూములకు రక్షణ కల్పించేలా ఈ ప్రక్రియను సరళతరం చేస్తూ సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు.

వరంగల్‌, ఖమ్మం ప్రాంతంలో లక్షల ఎకరాల్లో పంట నష్టంతో వందలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైన నకిలీ పురుగు మందులు, విత్తనాల నియంత్రణకు కఠిన చట్టం. ఇందుకు కారణమైన సంస్థలు, వ్యక్తుల ఆస్తులు జప్తు. పీడీ యాక్టు నమోదు. వారి ఆస్తుల నుంచి రైతులకు పరిహారం.  

రాష్ట్రంలో ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వంటి పెండింగ్‌ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి చివరి    ఎకరాకు సాగునీరు.

రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్‌ ఏర్పాటు.

రాష్ట్రంలో భూముల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా నూతన వ్యవసాయ విధానం.. పంటల ప్రణాళికలను రూపొందించి వ్యవసాయాన్ని లాభసాటిగా..పండుగగా మార్చే బాధ్యత.


మద్దతు ధర పెంచుతాం

ప్రస్తుతం వరి మద్దతు ధర రూ.1,960. కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రూ.2,500 చేస్తాం. మొక్కజొన్న క్వింటా ధరను రూ.1,870 నుంచి రూ.2,200కు పెంచుతాం. కందులు రూ.6,300 నుంచి రూ.6,700కు..పత్తి క్వింటా రూ.6,025 ఉండగా దానిని రూ.6,500కు.. మిర్చి రైతులు మోసపోకుండా క్వింటాకు రూ.15,000.. పసుపు రూ.12,000..  ఎర్రజొన్న రూ.3,500.. చెరకు రూ.4,000.. క్వింటా జొన్నలకు రూ.3,050 చెల్లిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని