Updated : 08 May 2022 06:07 IST

KTR: పది అవకాశాలిస్తే ఏం వెలగబెట్టారు?

ప్రధానినీ సోనియా రిమోట్‌తో ఆడించారు

గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించారు

రైతు డిక్లరేషన్‌ పాత చింతకాయ పచ్చడే

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయలేదెందుకు?

రాహుల్‌పై మంత్రి కేటీఆర్‌ ధ్వజం

ఈనాడు, వరంగల్‌: ‘వరంగల్‌ రైతు సంఘర్షణ సభలో రాహుల్‌ గాంధీ ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగారు. ప్రజలు ఇప్పటికే పది అవకాశాలు ఇచ్చినా కాంగ్రెస్‌ ఏం వెలగబెట్టింది? మీది రైతు ప్రభుత్వమే అయితే పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయారు?’ అని రాహుల్‌ గాంధీపై మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం వరంగల్‌ జౌళి పార్కులో కైటెక్స్‌ పరిశ్రమ, రూ.100 కోట్లతో మిషన్‌ భగీరథ పైపులైన్‌ నిర్మాణానికి శంకుస్థాపన, గణేశ ఎకోపెట్‌ పరిశ్రమ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి దయాకర్‌రావు ఇంట్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. శుక్రవారం వరంగల్‌ కాంగ్రెస్‌ సభలో రాహుల్‌ గాంధీ తెరాసపై చేసిన విమర్శలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. ‘‘రాహుల్‌ గాంధీకి అసలు ఏ పదవి ఉందో నాకు తెలీదు. మమ్మీ అధ్యక్షురాలు కాగా, డమ్మీగారు ఏ హోదాలో రైతు డిక్లరేషన్‌ చేశారో తెలియదు. మీరు చెప్పిన మాటలు వినడానికి ఇది 10 జనపథ్‌ కాదు.. తెలంగాణ జనపథం.  రాహుల్‌ ఒక్క ఛాన్స్‌ ఇవ్వమంటున్నారు. ప్రజలు 50 ఏళ్లుగా పది అవకాశాలు ఇచ్చినా  కాంగ్రెస్‌ ప్రజలకు ఏం చేసింది? తెలంగాణలో రిమోట్‌ కంట్రోల్‌ పాలన ఉందని అంటున్నారు. రిమోట్‌ కంట్రోల్‌ పాలన మీ కాంగ్రెస్‌దే. సోనియా గాంధీ రిమోట్‌ పట్టుకొని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఆడించారు. అవినీతిపై మన్మోహన్‌ తెచ్చిన ఆర్డినెన్స్‌ను చెత్త బుట్టల్లో పడేసింది రాహుల్‌గాంధీయే. ఒకరొచ్చి మేము కాంగ్రెస్‌కు బీ టీం అని, మరొకరు భాజపాకు సీ అంటూ కారుకూతలు కూస్తున్నారు. మేం ఎవరికీ బీ, సీ టీం కాదు.. తెలంగాణకు తెరాస ఏ టీం. అవినీతిలో కాంగ్రెస్‌ పార్టీకే స్కాంగ్రెస్‌ అనే పేరుంది. స్పెక్ట్రమ్‌, హెలికాప్టర్‌, బొగ్గుగని కుంభకోణాలు.. ఇలా అన్నీ చేసింది మీరే. రాహుల్‌ తన వెంట దొంగను పెట్టుకుని తిరుగుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఓటుకు నోటు కుంభకోణంలో దొరికిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని రాజు అంటున్నారు. నిజంగా రాచరిక పాలనే చేస్తే సీఎంపై పీసీసీ అధ్యక్షుడు మాట్లాడే మాటలకు ఆయన బయట   తిరిగేవారేనా? మీ ముత్తాత మోతీలాల్‌నెహ్రూ నుంచి  రాజీవ్‌గాంధీ వరకు చేసింది రాచరికపు పాలన. తాము పొత్తులు పెట్టుకోమని రాహుల్‌గాంధీ అంటున్నారు. అసలు మీతో పొత్తు పెట్టుకునే పార్టీ దేశంలో ఏదైనా ఉందా? గాంధీ భవన్‌ను గాడ్సే చేతిలో పెట్టారు. స్క్రిప్ట్‌ రాసిస్తే చదివే అమాయకుడు రాహుల్‌’’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

అత్యల్ప ఆత్మహత్యలు తెలంగాణలోనే..

ఏడు దశాబ్దాల్లో వ్యవసాయాన్ని కాంగ్రెస్‌ పాతర వేయగా కేసీఆర్‌ జాతరగా మార్చారని కేటీఆర్‌ అన్నారు. 2014లో 45 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే 2021లో 1.41 కోట్ల టన్నులను ప్రభుత్వం కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అత్యల్ప రైతు ఆత్మహత్యలున్న రాష్ట్రం ఏదని రేవంత్‌రెడ్డి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు తెలంగాణయేనని ఎన్‌డీఏ ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. ‘‘ఏఐసీసీ అంటే ఆల్‌ ఇండియా క్రైసిస్‌ పార్టీ. వరంగల్‌లో రాహుల్‌ చేసిన డిక్లరేషన్‌ పాత చింతకాయ పచ్చడి. రూ.2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఎందుకు చేయలేదు.  తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ అంటున్నారు. మరి భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చింది బ్రిటిష్‌వాళ్లు. గొప్పదనం వాళ్లదా, కొట్లాడి తెచ్చుకున్న భారతీయులదా? తెలంగాణపై నిజంగా ప్రేమే ఉంటే ధాన్యం కొనాలంటూ దిల్లీలో మేం మొరపెట్టుకుంటే రైతుల కోసం రాహుల్‌ ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు.  వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టొద్దని ఎప్పుడైనా మాట్లాడారా? కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం. ప్రజలెవరూ కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దు’’ అని కేటీఆర్‌ అన్నారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని