KTR: హ్యాట్రిక్‌ ఖాయం

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వదని ఇప్పటికే తేలిపోయిందని, వారిపై ఆశలు వదులుకున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తామే సొంతంగా ఉద్యోగాల కల్పనకు ప్రయత్నాలు...

Updated : 09 May 2022 04:18 IST

వచ్చే ఎన్నికల్లోనూ తెరాసదే విజయం
కేంద్రం నిరర్ధకం.. ఆశలు వదులుకున్నాం
రాహుల్‌ అమేఠీలో గెలిచి మాట్లాడాలి
ట్విటర్‌లో ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వదని ఇప్పటికే తేలిపోయిందని, వారిపై ఆశలు వదులుకున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తామే సొంతంగా ఉద్యోగాల కల్పనకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణకు ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ఎన్‌ఐడీ, ఐఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ఒక్కటి కూడా కేటాయించలేదని, మున్ముందు ఇస్తుందనే నమ్మకం లేదని పేర్కొన్నారు. ట్విటర్‌లో ‘కేటీఆర్‌ను అడగండి’ శీర్షికన ఆదివారం నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు కాంగ్రెస్‌, భాజపా సహా పలు ప్రతిపక్షాల నుంచి పోటీ ఉంటుందన్నారు. అయినా ప్రజల ఆశీర్వాదంతో తమ సుపరిపాలన కొనసాగేలా హ్యాట్రిక్‌ విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కన్నా గట్టిగా భాజపా, ప్రధాని మోదీ విధానాలను కేసీఆర్‌ నాయకత్వంలో తెరాస నిలదీస్తోందని చెప్పారు. ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ట్విటర్‌ ఇండియా ట్రెండింగ్‌లో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. కేటీఆర్‌ ఇచ్చిన సమాధానాలు ఆయన మాటల్లోనే..

పెట్రో ధరల్లో మోదీ సర్కారు ప్రపంచ రికార్డు

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల్లో మోదీ సర్కారు ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది. పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించాలని ప్రధానమంత్రి మాట్లాడటం... ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోంది.

గ్యాస్‌ సిలిండర్‌ ధర 2014లో రూ. 410 ఉండగా, ఇప్పుడు వెయ్యి రూపాయలు దాటింది. ఇది కేవలం మోదీ పాలనలోనే సాధ్యమైంది. అచ్ఛే దిన్‌ అంటే ఇలానే ఉంటాయని భాజపా చెబుతోంది. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 50 పెరిగినప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించిన స్మృతి ఇరానీ ఇప్పుడు కేంద్రమంత్రిగా స్పందించకపోవడం హిపోక్రసీ. కేంద్రంలో నిరర్ధక ప్రభుత్వం ఉంది. దానివల్ల భాజపాయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కేంద్రంపై ఈ రాష్ట్రాలు కలిసికట్టుగా పోరాడాలి.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్ముతున్న బీజేపీ అంటే ‘బేచో జనతాకీ ప్రాపర్టీ’ (ప్రజల ఆస్తులు అమ్మెయ్‌). రూ. 2500 కోట్లు ఇచ్చి కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి కొనుక్కోమని చెప్పారన్న ఆ రాష్ట్ర భాజపా ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెట్టాయి.

రాహుల్‌గాంధీ ముందు అమేఠీలో గెలిచి మాట్లాడాలి.

సీఎం కేసీఆర్‌ తర్వాత దేశంలో నాకు అత్యంతమైన ఇష్టమైన నాయకుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం.

రాష్ట్రంలో హత్యలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలుంటాయి. భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసే మాధ్యమాలపై చర్యలు తప్పవు.

వైద్యరంగంలో పురోగమనం

కరోనా సంక్షోభం తర్వాత ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు టిమ్స్‌ ఆస్పత్రులను నిర్మిస్తోంది. వీటిపాటు మొత్తం 33 జిల్లాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రారంభం కానున్నాయి.

భవన నిర్మాణ క్రమబద్ధీకరణ పథకం (బీఆర్‌ఎస్‌) హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. దాన్ని త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. హైదరాబాద్‌లో త్వరలోనే వంద శాతం మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్లు స్థాపిస్తాం. తద్వారా హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువుల్లో కాలుష్యం తగ్గుతుంది. నాగోల్‌ ఫ్లైఓవర్‌ ఆగస్టు నాటికి ప్రారంభమవుతుంది.


తండ్రిగా గర్వపడుతున్నా

నా కుమారుడు హిమాన్ష్‌ తను చదివే పాఠశాలలో క్రియేటివ్‌ యాక్షన్‌ ప్లాన్‌కి ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉంది. ఒక తండ్రిగా గర్వపడుతున్నా.


ఏదైనా జరగొచ్చు

తెరాసను జాతీయస్థాయిలో విస్తరించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు.. ‘భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చ’ని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ‘మీ సేవలు, మీ నాయకత్వం జాతీయస్థాయిలో కావాలని’ మరో నెటిజన్‌ అడగ్గా.. తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో సంతోషంగా ఉన్నానని మంత్రి తెలిపారు.


త్వరలోనే డబుల్‌ డెక్కర్‌ బస్సులు

హైదరాబాద్‌ నగరంలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఈకో సిస్టం అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తుంది. డబుల్‌ డెక్కర్‌ బస్సులకు సంబంధించిన ఏర్పాట్లపై హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఆర్‌టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.


క్రికెట్‌ మ్యాచ్‌లపై గంగూలీ, జైషాలే జవాబివ్వాలి

హైదరాబాద్‌లో ఐపీఎల్‌, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎందుకు నిర్వహించడం లేదో బీసీసీఐ పెద్దలు సౌరవ్‌ గంగూలీ, జైషాలు సమాధానమివ్వాలి. రాష్ట్రంలో అన్ని రకాల క్రీడలకు సహకారమిస్తూ నూతన విధానాన్ని సిద్ధం చేస్తున్నాం.

గ్రూపు-1పై అపోహలొద్దు

తెలుగు భాషలాగే ఉర్దూను రాజ్యాంగం గుర్తించింది. చాలా రాష్ట్రాలు ఉర్దూలో పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. గ్రూపు-1లో ఉర్దూపై కొన్ని పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు.


నిమ్జ్‌తో పెట్టుబడుల వెల్లువ

హీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి రాష్ట్రానికి కీలకమైంది. ఇప్పటికే పెద్దఎత్తున పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ జరుగుతోంది. ఒకప్పుడు కరవు కాటకాలతో తల్లడిల్లిన పాలమూరు జిల్లా పచ్చగా మారడం సంతోషంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని