Updated : 10 May 2022 05:34 IST

FRBM: ఇంత దారుణమా!

బడ్జెట్‌ వెలుపలి అప్పులనూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో పరిగణిస్తారా!
ఇవేం కక్ష సాధింపు చర్యలు?
ఇది తెలంగాణపై వివక్షే  
కేంద్ర ఆర్థికశాఖ సమావేశంలో రాష్ట్రం నిరసన
అప్పులకు వెంటనే అనుమతివ్వాలని ప్రభుత్వం డిమాండ్‌
ఈనాడు - హైదరాబాద్‌

ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను అనుసరిస్తూ కేంద్ర మార్గదర్శకాల మేరకు జీఎస్‌డీపీ పరిధిలో ఎంతో ఆర్థిక నిబద్ధతతో రుణాలు తీసుకుంటున్నా.. ఆంక్షలు విధించడం దారుణం. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయకపోయినా కేంద్రం అకస్మాత్తుగా బడ్జెట్‌ వెలుపలి రుణాలను కూడా రాష్ట్రాల అప్పులుగా చెప్పడం కక్షపూరిత చర్యే. నిబంధనల పేరుతో ప్రతిబంధకాలు సృష్టించడం తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్షగానే భావించాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం అప్పుల కోసం ఏ నిబంధనలు పాటిస్తుందో వాటినే తెలంగాణ ప్రభుత్వమూ పాటిస్తోంది. ఎలాంటి ఆంక్షలు, వివక్ష లేకుండా రాష్ట్రం అప్పులు తీసుకోవడానికి వెంటనే అనుమతులు ఇవ్వాలి. లేదంటే అభివృద్ధికి అవరోధంగా మారే ప్రమాదం ఉంది.

- కేంద్ర ఆర్థికశాఖ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ వాదన

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుల విషయంలో వివక్షాపూరితంగా వ్యవహరించడం సరికాదని తీవ్ర అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర ఆర్థిక వనరులను దెబ్బతీసేలా కేంద్ర చర్యలు ఉన్నాయని ఆక్షేపించింది. కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రాలతో సోమవారం నిర్వహించిన కీలక సమావేశం ఇందుకు వేదికైంది. బడ్జెట్‌ వెలుపల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలను బడ్జెట్‌ పరిధిలోని రుణాలుగానే పరిగణిస్తామని కేంద్రం చెప్పడం పూర్తి కక్షసాధింపు చర్య అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా రుణాల సమీకరణకు అనుమతించకపోవడం దారుణమని మండిపడింది. అప్పులకు వెంటనే అనుమతి ఇవ్వాలని కోరింది.

సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్‌ అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖలతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. ఇందులో తెలంగాణ తరఫున రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సలహాదారు జీఆర్‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా రుణాల సమీకరణను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేయడంతోపాటు రాష్ట్రాల అప్పులపై సమగ్ర వివరాలను కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ పరిధిలో, బడ్జెట్‌ వెలుపల రుణాల వివరాలను కేంద్రానికి అందించింది. ఆ వివరాలపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమావేశం వాడీవేడిగా సాగింది. ఆ వివరాలపై రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ప్రకటన విడుదల చేశారు.

ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండగా ఇవేం చర్యలు

ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితులకు అదనంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా రాష్ట్రాలు సమకూర్చుకుంటున్న అప్పులను కూడా రాష్ట్రాల అప్పులుగానే భావిస్తామని ఈ సమావేశంలో కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.రాష్ట్రం ఇచ్చిన హామీలు మూలధన వ్యయం(పెట్టుబడి వ్యయం)కు సంబంధించినవని తెలిపింది. ప్రధానంగా కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ కార్పొరేషన్‌ ద్వారా మిషన్‌ భగీరథ, తెలంగాణ వాటర్‌ రిసోర్సెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని.. ఈ ప్రాజెక్టులు పూర్తయితేనే రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో పొందిన రుణాలను తీర్చడానికి సాధ్యమవుతుందని వివరించింది. కరోనా అనంతరం ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న రాష్ట్ర ఆర్థిక వనరులను దెబ్బతీసేలా కేంద్రం చర్యలు ఉన్నాయని పేర్కొంది. కొత్త నిబంధనలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి కాకుండా 2020-21 నుంచి అమలు చేయడం అత్యంత దారుణమైన అంశమని తెలిపింది.

కొన్ని అలా... కొన్ని ఇలానా?

రాష్ట్రాల బడ్జెట్‌ వెలుపలి రుణాల్లో కొన్నింటిని ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో చూపకపోవడం.. కొన్నింటిని చూపడం సరికాదని తెలంగాణ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన హడ్కో, ఎన్‌సీడీసీలు ఇచ్చే రుణాలను రాష్ట్రాల అప్పులు పరిధిలోకి తీసుకురాకుండా ఇతర అప్పులను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో చూపడం వివక్షా పూరితమని ధ్వజమెత్తింది. మరోవైపు రాష్ట్రాలకు కేంద్రం మూలధన వ్యయం కింద 2020-21లో రూ.12 వేల కోట్లు, 2021-22లో రూ.15 వేల కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన లక్ష కోట్ల రుణాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రావని కేంద్రం స్పష్టంచేసింది. ఇంకా ఈ సమావేశంలో మూల ధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల రుణాలపై మార్గదర్శకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల కోసం నోడల్‌ ఏజెన్సీ నమూనా తదితర అంశాలపై చర్చించారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts