Ts High Court: చనిపోయినవారికి యూఎల్సీ వర్తించదు

మరణించిన వ్యక్తులకు వ్యతిరేకంగా పట్టణ భూగరిష్ఠ పరిమితి (అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌-యూఎల్సీ) చట్టం కింద ప్రొసీడింగ్స్‌ జారీ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated : 10 May 2022 07:32 IST

ప్రభుత్వ అప్పీళ్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌: మరణించిన వ్యక్తులకు వ్యతిరేకంగా పట్టణ భూగరిష్ఠ పరిమితి (అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌-యూఎల్సీ) చట్టం కింద ప్రొసీడింగ్స్‌ జారీ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం పుప్పాలగూడలో సర్వే నం.340లోని 36,623 చదరపు మీటర్లకు, సర్వే నం.340, 341లలోని 62,636 చదరపు మీటర్లకు యూఎల్సీ ప్రొసీడింగ్స్‌ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ కొందరు పిటిషన్లు దాఖలు చేయగా సింగిల్‌ జడ్జి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీళ్లు దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ పుప్పాలగూడలోని సర్వే నం.335, 336, 338, 340, 341లలో 80.25 ఎకరాల కాందిశీకుల భూమి ఉందని, ఇందులోని స్థలాన్ని కాందిశీకుడైన వాసుదేవ్‌కు కేటాయించినట్లు తెలిపారు. ఆయన నుంచి 1968లో ఇద్దరు మహిళలు కొనుగోలు చేశారని, సర్వే నం.341లో కొనుగోలు చేసిన 11.05 ఎకరాల భూమిని యూఎల్సీ కింద మినహాయించాలని వారు దరఖాస్తు చేశారని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రభుత్వం.. వాసుదేవ్‌ యూఎల్సీ కింద కలిగి ఉన్న భూమిని స్వాధీనం చేసుకుంటూ 2006లో ప్రొసీడింగ్స్‌ జారీ చేసిందని తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. స్థలాన్ని వాసుదేవ్‌ నుంచి కొనుగోలు చేశామని, చనిపోయిన వ్యక్తికి వ్యతిరేకంగా ప్రొసీడింగ్స్‌ జారీ చేయరాదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం.. ఉత్తర్‌ప్రదేశ్‌ వర్సెస్‌ హరిరామ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరిస్తూ పిటిషన్లను అనుమతిస్తూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. చనిపోయిన వ్యక్తికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రొసీడింగ్స్‌ జారీ చేయరాదన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ ప్రభుత్వ అప్పీళ్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని