Updated : 11 May 2022 05:29 IST

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ కేసు

మాజీమంత్రి నారాయణ, మరి కొందరిపై కూడా..  
ఏపీ రాజధాని ప్రణాళిక, రింగ్‌రోడ్డు, రహదారుల అలైన్‌మెంట్‌లలో అక్రమాలు జరిగాయని ఆరోపణ
గత నెల 27న వైకాపా ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు
ఈ నెల 6న అందిన విచారణ నివేదిక.. 9న కేసు

ఈనాడు, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీమంత్రి పొంగూరు నారాయణ, మరికొందరిపైనా ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరానికి సంబంధించిన బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, దాన్ని అనుసంధానించే ఆర్టీరియల్‌ రహదారుల అలైన్‌మెంట్‌ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయంటూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ ఎఫ్‌ఐఆర్‌ ప్రతులు మంగళవారం వెలుగుచూశాయి. ఏప్రిల్‌ 27న ఫిర్యాదు ఇవ్వగా.. దానిపై ప్రాథమిక విచారణ నివేదిక ఈ నెల 6న అందిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేశామని సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఐపీసీ 120బీ, 420, 34, 35, 36, 37, 166, 167, 217లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2) రెడ్‌విత్‌ 13 (1) (ఎ) కింద నిందితులపై అభియోగాలు మోపింది.

ఫిర్యాదు సారాంశం ఇదీ

‘‘2014-19మధ్య ప్రభుత్వంలో ఉన్నతస్థాయి అధికారులు రాజధాని బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారు. అవినీతీ జరిగింది. తద్వారా ఆ ప్రభుత్వంలో నిర్ణయాధికారం కలిగిన వారితో సంబంధమున్న కొంతమంది వ్యక్తులు, కొన్నిసంస్థలకు అనుచిత లబ్ధి కలిగించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. మోసానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారని ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది.

ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొంది వీరినే..

1. చంద్రబాబునాయుడు, అప్పటి ముఖ్యమంత్రి, సీఆర్‌డీఏ ఛైర్మన్‌, 2. పొంగూరు నారాయణ, అప్పటి మంత్రి, సీఆర్‌డీఏ వైస్‌ ఛైర్మన్‌, 3. లింగమనేని రమేష్‌, 4. లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్‌, 5. కేపీవీ అంజనీకుమార్‌ అలియాస్‌ బాబీ- రామకృష్ణ హౌసింగ్‌ డైరెక్టర్‌, 6. హెరిటేజ్‌ ఫుడ్స్‌, 7. ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌, 8. ఎల్‌ఈపీఎల్‌ ఇన్ఫోసిటీ, 9. ఎల్‌ఈపీఎల్‌ స్మార్ట్‌ సిటీ, 10. లింగమనేని అగ్రికల్చర్‌ డెవలపర్స్‌, 11. లింగమనేని ఆగ్రో డెవలపర్స్‌, 12. జయని ఎస్టేట్స్‌, 13. రామకృష్ణ హౌసింగ్‌, 14. ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తులు, ఇతరులు

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts