KTR: అయిదేళ్లు కరవొచ్చినా ఢోకా లేదు

సహజసిద్ధంగా అన్ని అనుకూలతలున్న హైదరాబాద్‌ నగరాన్ని భవిష్యత్తు తరాలకు గొప్పగా అందించాలనే ముందుచూపుతో వెళ్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 15 May 2022 05:29 IST

భాగ్యనగర నీటి అవసరాలకు పూర్తి భరోసా
వచ్చే 15 ఏళ్లలో.. దిల్లీ తర్వాత అతి పెద్ద నగరం మనదే  
సుంకిశాల ప్రాజెక్టు భూమి పూజలో కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, పెద్దవూర: సహజసిద్ధంగా అన్ని అనుకూలతలున్న హైదరాబాద్‌ నగరాన్ని భవిష్యత్తు తరాలకు గొప్పగా అందించాలనే ముందుచూపుతో వెళ్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో ఇతర మహానగరాల్లో రకరకాల కారణాల వల్ల ఇబ్బందికర పరిస్థితులున్నాయి... ఇందుకు భిన్నమైనది హైదరాబాద్‌ అని అన్నారు. నగరానికి తాగునీటిని అందించేందుకు రూ.1,450 కోట్లతో నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో జలమండలి చేపడుతున్న సుంకిశాల ప్రాజెక్టు పనులకు పలువురు మంత్రులతో కలిసి ఆయన శనివారం భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

2072 నాటికి 71 టీఎంసీలు అవసరం

‘‘సుంకిశాల ప్రాజెక్టుతో భాగ్యనగరానికి పుష్కలంగా నీళ్లు అందనున్నాయి. కాళేశ్వరంతో మరో 65 టీఎంసీల నీటికుండ ఎప్పుడూ నగర నెత్తి మీద ఉన్నట్లే. వరుసగా 5 ఏళ్లు కరవు వచ్చినా.. నగర తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వచ్చే 15 ఏళ్లలో దిల్లీ తర్వాత హైదరాబాద్‌ అతి పెద్ద నగరంగా అవతరిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎయిర్‌ ట్రాఫిక్‌లో నాలుగో స్థానంలో ఉన్నాం. హైదరాబాద్‌ తెలంగాణ రాజధాని కావచ్చు.. కానీ భారత జాతి సంపద. భవిష్యత్తు తరాలకు నగరాన్ని మంచి ఆస్తిగా అందించాలనేది సీఎం ఆలోచన. ప్రస్తుతం జలమండలి ఆధ్వర్యంలో రూ.6 వేల కోట్లతో ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ప్రస్తుత హైదరాబాద్‌ నీటి అవసరాలు 37 టీఎంసీలు. 2072 నాటికి 71 టీఎంసీలు కావాలని అంచనా. రీజనల్‌ రింగ్‌రోడ్డు ఏర్పడిన తర్వాత 100 కిలోమీటర్ల వరకు హైదరాబాద్‌ విస్తరించనుంది. అందుకే సుంకిశాలలో ఈ ప్రాజెక్టు చేపట్టాం. దీనిద్వారా ప్రస్తుతం 16.5 టీఎంసీలు తరలించవచ్చు. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్‌ 4, 5లకు సరిపడా సివిల్‌ పనులు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడే సిద్ధం చేస్తున్నాం. రాబోయే వేసవి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి హైదరాబాద్‌కు అత్యవసర పంపింగ్‌ లేకుండా నీటి సరఫరా చేయవచ్చు. కాళేశ్వరంలో భాగంగా కొండపోచమ్మ సాగర్‌ నుంచి ఘన్‌పూర్‌ వరకు ఒక పైపులైన్‌ ద్వారా అదనంగా గోదావరి నీటినీ తరలించనున్నాం. 

త్వరలో అవుటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ 158 కిలోమీటర్ల మేర రింగ్‌మెయిన్‌ వేయనున్నాం. దీనివల్ల నగరంలో ఏ మూలకైనా నీళ్లు అందించే అవకాశం ఉంటుంది. నాయకులు ఎంతసేపు విమర్శలు.. ఎన్నికలే కాదు.. భవిష్యత్తును చూడాలి. రాష్ట్రంలో వందేళ్ల విజన్‌ ఉన్న నాయకుడు ఒకవైపు.. వంద రోజుల ముందు చూపున్న నాయకులు ఒకవైపు ఉన్నారు.  కార్పొరేటర్ల నుంచి ఎంపీల వరకు ఇక్కడకు ఆహ్వానిద్దాం. పక్కనే బుద్ధవనం ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒకవైపు అభివృద్ధి పర్యాటకం, మరోవైపు ఆధ్యాత్మిక టూరిజం కలిసేలా పర్యాటక శాఖ ఒక ప్యాకేజీ చేపట్టాలి’ అని కేటీఆర్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని