KTR: ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ రండి!

రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలైన వరంగల్‌, నిజామాబాద్‌, నల్గొండ, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ వంటి ప్రాంతాలూ వ్యాపారానికి ఎంతో అనుకూలమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అక్కడా పెట్టుబడులకు ముందుకురావాలని పలు

Updated : 17 May 2022 06:01 IST

అక్కడా వ్యాపారానికి అనుకూల పరిస్థితులు

బెంగళూరుతో కాదు సింగపూర్‌, హాంకాంగ్‌తోనే మాకు పోటీ

హైదరాబాద్‌లో కొలియర్స్‌, శూరిఫై సంస్థల కార్యాలయాల ప్రారంభోత్సవంలో కేటీఆర్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలైన వరంగల్‌, నిజామాబాద్‌, నల్గొండ, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ వంటి ప్రాంతాలూ వ్యాపారానికి ఎంతో అనుకూలమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అక్కడా పెట్టుబడులకు ముందుకురావాలని పలు వ్యాపార సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం మైహోం ట్విట్జా ఐటీ భవనంలో స్థిరాస్తి, పెట్టుబడుల సలహాల సంస్థ కొలియర్స్‌, బీమా సేవల సంస్థ శూరిఫై ల్యాబ్‌, టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థల కార్యాలయాలను విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ..2012-13లో హైదరాబాద్‌లో ఏడాదికి కేవలం రెండు మిలియన్‌ చదరపు అడుగుల స్థలంలో వివిధ సంస్థల కార్యాలయాలు, వాణిజ్య అవసరాల కేంద్రాలను ఏర్పాటు చేసుకోగా గత ఏడాది 11 మిలియన్‌ చదరపు అడుగుల స్థలాన్ని వినియోగించుకున్నాయని తెలిపారు. పలు త్రైమాసికాల్లో ఆయా సంస్థలు అద్దెకు దిగిన స్థలం బెంగళూరును మించిపోయిందని చెప్పారు. తాము పోటీపడేది బెంగళూరుతో కాదని.. హాంకాంగ్‌, సింగపూర్‌, ఇతర ప్రపంచస్థాయి నగరాలతోనేనని కేటీఆర్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ సమయంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసి సంస్థలను నడిపారన్నారు. ఈ క్రమంలోనే పారిశ్రామికవేత్తలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శూరిఫై సంస్థ ఉద్యోగులు, అధికారులు సంప్రదాయ దుస్తుల్లో హాజరైన అంశాన్ని మంత్రి ప్రస్తావిస్తూ.. తాను ఐటీ కంపెనీకి వచ్చినట్లు లేదని, అందరం కలిసి దసరా, సంక్రాంతి పండగలు జరుపుకొంటున్నట్లు ఉందంటూ ఉద్యోగులను అభినందించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శనంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ను ఎనిమిదేళ్ల కాలంలోనే సింగపూర్‌ మాదిరిగా అభివృద్ధి చేశారన్నారు. శూరిఫై సీఈవో డస్టిన్‌ మాట్లాడుతూ.. తమ సంస్థ ఎనిమిదేళ్ల క్రితం ఒకరితో ఆరంభమై ప్రస్తుతం 320 మంది ఉద్యోగులతో నడుస్తోందన్నారు.

వారిలో 220 మంది హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారన్నారు. కొలియర్స్‌ ఇండియా సీఈవో, ఆసియా మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఎండీ రమేష్‌ నాయర్‌ మాట్లాడుతూ.. స్థిరాస్తి, పెట్టుబడుల్లో సలహాలు అందించే తమ సంస్థ 62 దేశల్లో కార్యకలాపాలు సాగిస్తోందని, 17వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, సైయంట్‌ సంస్థ వ్యవస్థాపకుడు బీవీఆర్‌ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఎనిమిదేళ్లలో గణనీయ ప్రగతి: కేటీఆర్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఎనిమిదేళ్లలో తెలంగాణ గణనీయ ప్రగతి సాధించిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)లో సీనియర్‌ ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారులకు మిడ్‌ కెరీర్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆ అధికారులతో నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి ప్రసంగించారు. జనాభా పరంగా దేశంలో అయిదో పెద్ద నగరంగా ఉన్న హైదరాబాద్‌ ఐటీ, ఫార్మా తదితర రంగాల్లో అగ్రస్థానంలో ఉందని చెప్పారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని