Updated : 18 May 2022 08:09 IST

Hyderabad News: రాజస్థాన్‌ టమాటా.. యూపీ పచ్చిమిరప

రాష్ట్రంలో కొరత.. ఇతర రాష్ట్రాల నుంచి రాక

కిలో రూ.100 దాటిన బీన్స్‌.. టమాటా రూ.70

రాజస్థాన్‌ అంటే అందరికీ ఎడారి గుర్తుకొస్తుంది. కానీ, ఆ రాష్ట్ర రాజధాని జైపుర్‌ మార్కెట్‌ నుంచి హైదరాబాద్‌కు టమాటాలు దిగుమతి అవుతున్నాయి. పంటలు అధికంగా పండే తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం కాయగూరలు కావాలంటే రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల మీద ఆధారపడాల్సి వస్తోంది. మంగళవారం జైపుర్‌ నుంచి టమాటాలు, యూపీలోని సంబాల్‌ మార్కెట్‌ నుంచి పచ్చిమిరప, మహారాష్ట్ర నుంచి క్యాలీఫ్లవర్‌ హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు నగరాలకు వచ్చినట్లు మార్కెటింగ్‌ శాఖ పరిశీలనలో తేలింది. శ్రీలంకలో సంక్షోభం కారణంగా తమిళనాడు, ఏపీ, కర్ణాటకల నుంచి ఆ దేశానికి టమాటాలు, ఇతర కూరగాయలు వెళుతుండటంతోనూ తెలంగాణలో ధరలు బాగా పెరిగాయని చెబుతున్నారు. పలు రకాల సాధారణ కూరగాయల ధరలు సైతం నెలక్రితంతో పోలిస్తే భారీగా పెరగడంతో సామాన్యులు అల్లాడుతున్నారు. నెలక్రితం కిలో రూ.10కి అమ్మిన టమాటా ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.70 పలుకుతోంది. ఇక బీన్స్‌ అయితే రూ.100 దాటింది. 2021 మే 17న రాష్ట్రంలోని అతిపెద్ద కూరగాయల టోకు మార్కెట్‌ బోయిన్‌పల్లిలో క్వింటా టమాటాల గరిష్ఠ ధర రూ.600 ఉండగా.. ఈ ఏడాది ఇదే తేదీన(మంగళవారం) ఏకంగా రూ.5,200కి చేరింది. బీన్స్‌ సైతం గతేడాది క్వింటా రూ.6 వేలుంటే ఇప్పుడు రూ.9,500కి చేరింది. పలు చిల్లర దుకాణాల్లో రూ.110 నుంచి 120కి అమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీలకు చేరి వడగాలులు వీస్తుండటంతో పాటు అక్కడక్కడ అకాల వర్షాలు పడుతున్నందున కొరత పెరుగుతోంది. సోమవారం అన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ నగరానికి 1,650 క్వింటాళ్ల క్యాబేజీ రాగా మంగళవారం కేవలం 829 క్వింటాళ్లే వచ్చింది. ఇలా తక్కువగా రావడం కూడా ధరల మంట పెరగడానికి ఓ కారణమవుతోంది. డీజిల్‌ ధరల పెరుగుదలతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల రవాణా కిరాయిలు బాగా పెంచేస్తున్నందున కూడా కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కూరగాయల పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి ఉద్యానశాఖ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడం రైతులకు శాపంగా మారింది.

- ఈనాడు, హైదరాబాద్‌

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts