Published : 19 May 2022 03:07 IST

భారీగా పెరగనున్న బీఆర్క్‌ సీట్లు

దేశవ్యాప్తంగా స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ విభాగాలు
7 ఐఐటీలు, 7 ఎన్‌ఐటీల ఎంపిక
ఎన్‌ఐటీ వరంగల్‌కూ స్థానం

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(బీఆర్క్‌) సీట్లు భారీగా పెరగనున్నాయి. అందుకు 16 స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌(స్పా) విభాగాలను నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కార్యరూపంలోకి వస్తే వరంగల్‌ ఎన్‌ఐటీలో కూడా ఆర్కిటెక్చర్‌ విభాగం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కేవలం మూడు ‘స్పా’ విద్యా సంస్థలే ఉండటం గమనార్హం. దేశంలో  దిల్లీ, భోపాల్‌, విజయవాడలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ‘స్పా’ విద్యాసంస్థలున్నాయి. వాటిల్లో బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సులను అభ్యసించవచ్చు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గుర్తించిన మరో అయిదు కళాశాలల్లోనే బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌, బీటెక్‌ ప్లానింగ్‌ కోర్సులున్నాయి. ఐఐటీల్లో కేవలం ఖరగ్‌పూర్‌, రూర్కీల్లో మాత్రమే బీఆర్క్‌ సీట్లున్నాయి. నగరీకరణ శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ విద్యను అందించేందుకు దేశంలో 18 ‘స్పా’లను ఏర్పాటు చేయాలని 2018 ఫిబ్రవరి బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఐఐటీలు బొంబాయి, భువనేశ్వర్‌, దిల్లీ, గువహటి, జోధ్‌పుర్‌, బీహెచ్‌యూ, రోపర్‌, ఏడు ఎన్‌ఐటీలు వరంగల్‌, జలంధర్‌, పట్నా, జంషెడ్‌పుర్‌, అగర్తల, అలహాబాద్‌ (ప్రయాగ్‌రాజ్‌), సిల్చర్‌(అస్సాం)తోపాటు మహారాష్ట్ర, పుదుచ్చేరిలను ఇటీవలే ప్రాథమికంగా కేంద్రం ఎంపిక చేసింది. ‘ఎన్‌ఐటీ వరంగల్‌లో ‘స్పా’ విభాగం ఏర్పాటుకు మేం పంపిన ప్రతిపాదన షార్ట్‌లిస్ట్‌ అయినట్లు కేంద్రం నుంచి సమాచారం అందింది. ఒక్కో దాంట్లో బీఆర్క్‌, బీ ప్లానింగ్‌లో 100 సీట్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. మాకు రూ.200 కోట్ల నిధులతోపాటు ఆచార్యుల పోస్టులు కావాలని అడిగాం’ అని ఎన్‌ఐటీ వరంగల్‌ సంచాలకుడు ఆచార్య ఎన్‌వీ రమణారావు చెప్పారు. కొత్తగా మొదలుకానున్న ‘స్పా’లు 2023-24 విద్యాసంవత్సరానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని