Published : 19 May 2022 03:07 IST

హక్కున చేర్చుకోరూ!

గ్రామకంఠాలు, ఇతరత్రా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నోళ్ల తిప్పలు
పలు సమస్యలతో క్రమబద్ధీకరణకు దూరం
హక్కులు కల్పించాలని విన్నపాలు

ది మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని జవహర్‌నగర్‌. 350 ఎకరాల గ్రామకంఠానికి తోడు 750 ఎకరాల ప్రభుత్వ భూమిలో విస్తరించి ఉంది. 18 వేల ఆవాసాలున్నాయి. కేవలం గ్రామకంఠం పరిధిలోని గృహాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంది. 2014-16 మధ్య మొదటిసారి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసినా భూములపై స్పష్టత లేకపోవడంతో చేపట్టలేదు. పైగా చెల్లించిన రూ.7.50 కోట్ల మొత్తాన్నీ వెనక్కు ఇవ్వలేదు. ఈ ఏడాది మార్చిలోనూ కొందరు దరఖాస్తు చేశారు.

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామకంఠం పరిధి దాటి సర్కారు భూముల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి యాజమాన్య హక్కుల కల్పన అందని ద్రాక్షగా మారింది. సింగరేణి సంస్థ వెనక్కు ఇచ్చేసిన.. మాజీ సిపాయిలకు కేటాయించి తిరిగి తీసుకున్న.. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి ఏళ్ల తరబడి హక్కులు దక్కడం లేదు. క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పలు ఉత్తర్వులు జారీచేసినప్పటికీ క్షేత్రస్థాయిలోని సమస్యలతో ప్రజలు ఉపయోగించుకోలేక పోతున్నారు.

ఇక్కడ నోటరీయే హక్కు పత్రం

నగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని నగర పాలక, పురపాలికల్లో పెద్ద ఎత్తున నోటరీ పత్రాలపైనే లావాదేవీలు సాగుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారు ఒక్కో కాలనీలో వేల సంఖ్యలో ఉన్నారు. వారికి స్థలాలపై ఎలాంటి హక్కులు లేవు. గ్రామకంఠం పరిధిలోని గృహాలకు జారీచేసిన ఇంటి నంబర్లు, విద్యుత్తు, నాలా కనెక్షన్లను ఈ కాలనీల్లోనూ ఇస్తున్నారు. జగద్గిరిగుట్ట, రోడామిస్త్రీనగర్‌, శ్రీరాంనగర్‌, శ్రీనివాస్‌నగర్‌, లెనిన్‌నగర్‌, గిరినగర్‌, గాజులరామారంతో పాటు 35 కాలనీల్లోని 50 వేల నివాసాల్లో 25 వేల ఇళ్లకు హక్కులు రాలేదని అంచనాలున్నాయి. దుండిగల్‌, కొంపల్లి పురపాలక సంఘాలు, నిజాంపేట నగరపాలక సంస్థ పరిధిలోనూ 17 వేల ఇళ్లలో సగం వరకు హక్కులు లేనివే.

సింగరేణి ప్రాంతాల్లో రుసుం సమస్య

సింగరేణి సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికీ అనేక సమస్యలున్నాయి. కొత్తగూడెం, ఇల్లెందు, రామగుండం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి తదితర ప్రాంతాల్లో 2006, 08లలో క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2017, 18లలోనూ పలు జీవోల ద్వారా ఈ అవకాశాన్ని పొడిగించింది. కుటుంబ వివాదాలు, నల్లా, విద్యుత్తు కనెక్షన్ల ధ్రువీకరణ పత్రాలు లేనివారు దరఖాస్తు చేయలేకపోయారు. సింగరేణి ప్రాంతం వరకు ఇచ్చిన ప్రత్యేక జీవోలతో క్రమబద్ధీకరణకు చాలా తక్కువ రుసుం ఉంటుందని, జీవోలు 58, 59ల కింద ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోందని పలువురు చెబుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో 1970 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లకు హక్కుల కల్పన క్లిష్టంగా మారింది. ఏజెన్సీ చట్టం అమల్లోకి రాకముందు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి, వారి తదనంతరం వారసులకు మాత్రమే హక్కులు కొనసాగుతున్నాయి. గిరిజనేతరులకు చెందిన భూములకు రిజిస్ట్రేషన్లు లేవు. తరాల నుంచి నివాసం ఉంటున్న తమకు హక్కులు కల్పించాలని వారు కోరుతున్నారు. పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, భూపాలపల్లి, ఏటూరునాగారం, నిర్మల్‌, ఉట్నూరు తదితర పట్టణాల్లోనూ ఈ సమస్య ఉంది.

సర్కారు దృష్టి సారిస్తే..

నోటరీ స్థలాలు, సింగరేణి భూములు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమస్యలను తొలగిస్తే ప్రభుత్వానికి¨ కూడా రాబడి పెరిగే అవకాశాలున్నాయి. భూముల ధరలు పెద్దఎత్తున ఉన్న పట్టణాల్లో సులువుగా క్రమబద్ధీకరణ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే హక్కుల కల్పనతో పాటు ఆర్థికశక్తిని పెంచినట్లవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.  ప్రభుత్వ స్థలాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వారు నోటరీ పత్రాలపై లావాదేవీలు నిర్వహిస్తూనే ఉన్నారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని చెబుతున్నారు.

సర్వే నంబర్లు 141, 142, 143లలో కొత్తగూడెం పట్టణం విస్తరించింది. 22,631 గృహాలుండగా సగం స్థలాలకే హక్కులున్నాయి. మొదటి దశ క్రమబద్ధీకరణ ప్రక్రియలో 11,431 దరఖాస్తులు రాగా ఏడు వేల వరకు పట్టాలు జారీ చేశారు.ఈ ఏడాది మార్చిలోనూ నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రమైన గూడెంలో భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో నివాస స్థలాలన్నింటికీ సింగరేణి ప్రాంత జీవోల ఆధారంగా హక్కులు కల్పిస్తే రుణాలు తీసుకోవడానికి, పిల్లల వివాహాలు, చదువులకు తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని