Updated : 19 May 2022 05:15 IST

TRS: తెరాస రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస రాజ్యసభ అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, హెటిరో ఛైర్మన్‌ బండి పార్థసారథిరెడ్డి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా తెరాస నేత, గ్రానైట్‌ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)లను అభ్యర్థులుగా ఆయన ప్రకటించారు. బుధవారం ప్రగతిభవన్‌లో వారికి బి-ఫారాలను అందజేశారు. వీరిలో ఎమ్మెల్సీగా ఎన్నికై రాజీనామా చేసిన బండా ప్రకాశ్‌ స్థానం కోసం జరగనున్న ఉపఎన్నికకు ఈ నెల 19న వద్దిరాజు రవిచంద్ర నామినేషన్‌ వేయనున్నారు. రెండేళ్ల పదవీ కాలం ఉంది. గతంలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ప్రకాశ్‌ సైతం వరంగల్‌ జిల్లా వారే. కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల పదవీ విరమణతో ఖాళీ అయ్యే రెండు స్థానాలకు దామోదర్‌రావు, పార్థసారథిలు నామినేషన్లు వేయనున్నారు. ఈనెల 24 నుంచి 31 వరకు గడువు ఉంది. మూడు స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కొన్ని రోజులుగా కేసీఆర్‌ ముమ్మర కసరత్తు చేశారు. ఉద్యమ సహచరుడైన దామోదర్‌రావు, పారిశ్రామికవేత్త పార్థసారథిరెడ్డి, బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్రలను ఎంపిక చేశారు.


అభ్యర్థి : బండి పార్థసారథిరెడ్డి

పుట్టిన తేదీ : 1954, మార్చి6

స్వగ్రామం : ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు

విద్యాభ్యాసం : ఆర్గానిక్‌ కెమిస్ట్రీ (ఓయూ)లో ఎంఎస్సీ, సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ

కుటుంబం : భార్య, కుమారుడు

వృత్తి జీవితం: సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పార్థసారథిరెడ్డి డిగ్రీ అనంతరం ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూనే హెటిరో సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఇప్పుడు దేశంలోని టాప్‌ 10 కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది. 18 వేల మంది యువతకు ఉద్యోగాలిచ్చింది. హెటిరో సంస్థ బాధ్యతలను నిర్వహిస్తూనే.. భారత ప్రభుత్వానికి చెందిన డ్రగ్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డ్‌, బల్క్‌ డ్రగ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ అసోసియేషన్‌, జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సభ్యునిగా పనిచేశారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా కొనసాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2017లో ఇచ్చిన బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు పొందారు. సాయి స్ఫూర్తి ట్రస్ట్‌ ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు.. గ్రామీణ నీటిసరఫరా కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి కేటీఆర్‌కు సన్నిహితుడు.


అభ్యర్థి : దీవకొండ దామోదర్‌రావు

పుట్టిన తేదీ : 1958 ఏప్రిల్‌ 1

స్వగ్రామం : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు

విద్యాభ్యాసం : ఎల్‌ఎల్‌బీ (ఉస్మానియా)

కుటుంబం : భార్య, కుమార్తె, కుమారుడు

వృత్తి జీవితం : కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆయన వెంట నడిచిన వ్యక్తుల్లో ఒకరు. 2001 నుంచి తెరాసలో పలు హోదాల్లో పని చేశారు. టీ న్యూస్‌, నమస్తే తెలంగాణ పత్రికల వ్యవస్థాపనలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ పబ్లికేషన్స్‌ (నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు)కు ఛైౖర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా వ్యవహరిస్తున్నారు.


అభ్యర్థి : వద్దిరాజు రవిచంద్ర

పుట్టిన తేదీ : 1964, మార్చి 22

స్వగ్రామం : మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి

విద్యాభ్యాసం : బీకాం

కుటుంబం : భార్య, కుమార్తె, కుమారుడు

వృత్తి జీవితం : గ్రానైట్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ గ్రానైట్‌ క్వారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర మున్నూరు కాపు ఆల్‌ అసోసియేషన్‌ జేఏసీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. తన సొంతూరులో బడి, గుడి, రహదారి, తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలను కల్పించారు. మేడారం ఆలయ అభివృద్ధికి తన వంతు ఆర్థిక సాయం చేశారు. రవిచంద్ర గత ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత తెరాసలో చేరారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని